close

సచిన్‌ తర్వాత గంభీరే!
ముగిసిన దిల్లీ బ్యాట్స్‌మన్‌ కెరీర్‌
దిల్లీ: అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్‌ (దిల్లీ) తన చివరి మ్యాచ్‌ ఆడేశాడు. ఆదివారమే మైదానంలో అతడికి చివరి రోజు. ఆంధ్రతో రంజీ మ్యాచ్‌తో అతడు కెరీర్‌ను ముగించాడు. భారత గడ్డపై సచిన్‌ తర్వాత ప్రొఫెషనల్‌ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గంభీర్‌ ఘనత సాధించాడు. 18 ఏళ్ల కెరీర్‌లో ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌, లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, టీ20 క్రికెట్లో కలిపి గంభీర్‌ 31362 పరుగుల చేశాడు. ఇందులో స్వదేశంలో చేసినవి 22484. సొంతగడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లో సచిన్‌ (24452) మాత్రమే గంభీర్‌ కన్నా ముందున్నాడు. ద్రవిడ్‌ (21237)ది మూడో స్థానం.

ధోనీపై విమర్శనాస్త్రాలు..: మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై గంభీర్‌ విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా అతడి సెలక్షన్‌ విధానాన్ని తప్పుపట్టాడు. ‘‘2012లో ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్‌ సందర్భంగా మా ముగ్గురినీ (గంభీర్‌, సచిన్‌, సెహ్వాగ్‌) తుది జట్టులో ఆడించడం కుదరదని, ఇద్దరికే అవకాశముంటుందని తెలిపాడు. 2015 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అది నాకు పెద్ద షాక్‌. అలాంటి పరిస్థితి ఏ క్రికెటర్‌కైనా షాకే. ఒక ఆటగాడికి ‘నువ్వు 2015 ప్రపంచకప్‌లో ఉండవు’ అని 2012లోనే ఎవరైనా చెబుతారా?’’ అని గంభీర్‌ అన్నాడు. ‘‘ఒక ఆటగాడు పరుగులు చేస్తుంటే, మైదానంలో చురుగ్గా ఉంటే కోరుకున్నంత కాలం ఆడొచ్చు. మేం ముగ్గురం తుది జట్టులో ఉండమని ఆస్ట్రేలియాలో మాకు తెలిసింది. కానీ ఆ తర్వాత అదే సిరీస్‌లో మేం ముగ్గురం కలిసి ఆడాం. గెలుపు అత్యవసరమైన మ్యాచ్‌లో సెహ్వాగ్‌, సచిన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. నేను మూడో స్థానంలో ఆడా. ఆ మ్యాచ్‌ భారత్‌ గెలిచింది’’ అని చెప్పాడు. ‘‘సిరీస్‌ ఆరంభంలో మేం ముగ్గురం కలిసి ఆడలేదు. రొటేషన్‌లో ఆడాం. కానీ విజయం తప్పనిసరైన స్థితిలో ధోని మా ముగ్గురిని తుది జట్టులో ఆడించాడు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. వెనక్కి తగ్గకూడదు’’ అని గంభీర్‌ అన్నాడు. ‘‘మా ముగ్గురిలో ఇద్దరినే తుది జట్టులో ఆడిస్తానని నువ్వే చెప్పావు. కానీ ముగ్గురినీ ఆడించాలని నువ్వే నిర్ణయించావు. అంటే రెండు నిర్ణయాల్లో ఏదో ఒకటి తప్పన్నమాట. కెప్టెన్‌ నిర్ణయం మా ముగ్గురినీ దిగ్భ్రాంతికి గురిచేసింది’’ అని ధోనీని ఉద్దేశించి గంభీర్‌ అన్నాడు.

ఆంధ్ర.. త్రుటిలో: దిల్లీతో ఆంధ్ర రంజీ మ్యాచ్‌ (గ్రూప్‌-బి) డ్రాగా ముగిసింది. కానీ పేలవ బ్యాటింగ్‌తో ఆంధ్ర ఓటమికి చేరువగా వెళ్లింది. ఓవర్‌నైట్‌ స్కోరు 409/7తో చివరి రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దిల్లీ.. 433 పరుగులకు ఆలౌటైంది. 43 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మ్యాచ్‌ డ్రాగా ముగియడం లాంఛనమే అనుకున్న దశలో ఆంధ్రను దిల్లీ కలవరపెట్టింది. దిల్లీ బౌలర్లు వశిష్ఠ్‌ (5/49), వికాస్‌ మిశ్ర (3/15) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 130కే కుప్పకూలింది. 88 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ ధాటిగా ఆరంభించింది. 5 ఓవర్లలో  రెండు వికెట్లకు 41 పరుగులు చేసింది. కానీ వెలుతురులేమి కారణంగా ఆట ఆగిపోవడంతో ఆంధ్ర డ్రాతో బతికిపోయింది.

ప్రధానాంశాలు

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.