close

పోటీ ఉంటుందా?
గువాహటి: తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో విజయం. రెండో టెస్టులో 10 వికెట్ల గెలుపు. రెండు మ్యాచ్‌లూ మూడేసి రోజుల్లోనే ముగిసిపోయాయి. తొలి టెస్టులో వెస్టిండీస్‌ నుంచి కనీస ప్రతిఘటన లేకపోయింది. రెండో టెస్టు ఆరంభంలో కొంచెం మెరుగ్గా కనిపించినా.. తర్వాత చతికిలపడింది. రెండు మ్యాచ్‌లూ ఏకపక్షం కావడంతో అభిమానుల్లో సిరీస్‌పై ఆసక్తే లేకపోయింది. మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులు చాలా తక్కువ స్థాయిలో వచ్చారు. ఆటలో మజానే లేకుంటే ఎవ్వరికైనా ఏం ఆసక్తి ఉంటుంది? ఐతే ఇప్పుడు విండీస్‌తో వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. టెస్టులతో పోలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ జట్టు మెరుగే. వన్డే జట్టులో కొందరు మెరుపు వీరులున్నారు. కాబట్టి సిరీస్‌లో పోటీ ఉంటుందని.. మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డున్న ఆల్‌రౌండర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌.. సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ కీమర్‌ రోచ్‌ లాంటి ఆటగాళ్లపై విండీస్‌ ఆశలు పెట్టుకుంది. ఐదో వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్‌ జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ డే-నైట్‌వే. మధ్యాహ్నం 1.30కి ఆరంభమవుతాయి. సిరీస్‌లో రెండో మ్యాచ్‌ ఇండోర్‌ నుంచి విశాఖపట్నంకి తరలిన సంగతి తెలిసిందే. ఆదివారం నాటి మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ ఇప్పటికే గువాహటికి చేరుకున్నాయి. స్టేడియంలో ఆటగాళ్లు సాధన కూడా చేశారు.
పంత్‌.. ఎలా ఆడతాడో!: విండీస్‌తో వన్డే సిరీస్‌లో చూడదగ్గ భారత ఆటగాళ్లలో రిషబ్‌ పంత్‌ ఒకడు. ఇప్పటికే టీ20లు, టెస్టుల్లో సత్తా చాటుకున్న ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌.. తొలిసారిగా వన్డే జట్టులోకి వచ్చాడు. విండీస్‌తో తొలి రెండు వన్డేలకు ఎంపికయ్యాడు. జట్టులో దిగ్గజ ఆటగాడు ధోని ఉన్నప్పటికీ.. పంత్‌ను ఎంపిక చేయడం ఆసక్తి రేకెత్తించే విషయం. నిజానికి ధోని లేకుంటే.. పంత్‌ ఇంకా ముందే జట్టులోకి వచ్చే వాడేమో. మహి వారసుడిగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు పంత్‌దే. కొన్నాళ్లుగా రెండో వికెట్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌ అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. కానీ అతడిలో నిలకడ లేకపోవడంతో వేటు వేసి పంత్‌కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. ధోనిని వికెట్‌ కీపర్‌గా కొనసాగిస్తూ.. కేవలం బ్యాట్స్‌మన్‌గానే పంత్‌ను జట్టులోకి తీసుకోవడానికి అవకాశముంది. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో ధోనికి విశ్రాంతినిచ్చి పంత్‌నే వికెట్‌కీపర్‌గా ఆడించినా ఆశ్చర్యం లేదు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే పంత్‌ ప్రపంచకప్‌కు ఎంపిక కావడం ఖాయం. టెస్టుల్లో తనదైన దూకుడు చూపించిన పంత్‌.. వన్డేల్లో మరింతగా చెలరేగేందుకు ఆస్కారముంది.
ఇంకో 221 చేస్తే..
టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లి వన్డేల్లో మరో మైలురాయి ముంగిట నిలిచాడు. అతను విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ పూర్తయ్యేలోపు 10 వేల పరుగుల మైలురాయిని అందుకోవచ్చు. అందుకోసం అతను ఇంకో 221 పరుగులే చేయాలి. భారత్‌ తరఫున సచిన్‌ (18,426), గంగూలీ (11,363), ద్రవిడ్‌ (10,889), ధోని (10,123) మాత్రమే 10 వేల ఘనత అందుకున్నారు. విరాట్‌ ఇంకో 187చేస్తే.. సచిన్‌ (1573)ను దాటి వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా  నిలుస్తాడు.

ప్రధానాంశాలు

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.