close

కథనాలు

రోహిత్‌ గెలిస్తేనే... కోహ్లీ ఆశలు సజీవం

ముంబయి: ఐపీఎల్‌లో మంగళవారం(మే15) నుంచి ఆసక్తికరమైన పోరులకు తెరలేచింది. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ లీగ్‌ దశ ముగియనుంది. దీంతో ప్లేఆఫ్‌లో చోటు కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్‌కి దూసుకెళ్లగా మిగతా ఏ రెండు జట్లు ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకుంటాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏటా లీగ్‌ చివరి దశకు చేరుకునే సమయానికి కనీసం మూడు జట్లు ప్లేఆఫ్‌ రేసు నుంచి బయటికి వచ్చేసేవి. కానీ, ఈ ఏడాది ఒక్క దిల్లీ తప్ప మిగతా ఐదు జట్లు ప్లేఆఫ్‌లో చోటు కోసం తలపడుతున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. టోర్నీలో ఒక జట్టు ఓడిపోతే మరో జట్టుకు లాభం చేకూరేలా మారాయి గణాంకాలు.

ఈ క్రమంలో ఈ రోజు ముంబయి ఇండియన్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోవాలని బెంగళూరు కోరుకుంటోంది. ఎందుకంటే.. ఇలా జరిగితేనే కదా ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉండేది. ఈ ఒక్క జట్టే కాదు కోల్‌కతా, రాజస్థాన్‌, ముంబయి, పంజాబ్‌ కూడా ఇప్పుడు ప్లేఆఫ్‌లో చోటు కోసం పోటీ పడుతున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు ఓడితే మరి ఏ ఇతర జట్టుకు లాభమో, ఏ జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయో, ఏ జట్టుకు క్లిష్టంగా మారతాయో ఇప్పుడు చూద్దాం.

* ముంబయి ఇండియన్స్‌: ఒకవేళ ఈ రోజు మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. లీగ్‌లో చివరి మ్యాచ్‌లో ముంబయి... దిల్లీ డేర్‌డెవిల్స్‌పై నెగ్గాలి. మరోపక్క బెంగళూరుపై సన్‌రైజర్స్‌ నెగ్గాలి. అలాగే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. చెన్నై చేతిలో, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓడిపోవాలి. ఇలా జరిగితే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ముంబయి ప్లేఆఫ్‌ చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోతే ప్లేఆఫ్‌ అవకాశాలను ఆ జట్టు పూర్తిగా దూరం చేసుకున్నట్లే.

* కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: ఈ రోజు మ్యాచ్‌లో జరిగే మ్యాచ్‌లో ముంబయిపైన, ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌పైనా విజయం పంజాబ్‌ సొంతం అయితే ఆ జట్టు ప్లేఆఫ్‌ చేరుకోవడం సులువు. ఒకవేళ ఈ రోజు ఓడిపోయినా పంజాబ్ ప్లేఆఫ్‌ ఆశలు ఉంటాయి. ఎలా అంటే బెంగళూరు చేతిలో రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌ చేతిలో బెంగళూరు ఓడిపోవాలి. ఇదే జరిగితే చివరి మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్‌ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ ఓడిపోతే ప్లేఆఫ్‌ చేరదు.

* రాజస్థాన్‌ రాయల్స్‌: ఈ రోజు ముంబయి ఇండియన్స్‌తో ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోతే రాజస్థాన్‌ రాయల్స్‌కు అవకాశం ఉంటుంది. అలాగే ఈ జట్టు బెంగళూరుపై విజయం సాధించాలి. మరోపక్క ముంబయి ఇండియన్స్‌ను దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఓడించాలని రాజస్థాన్‌ ప్రార్థనలు చేయాలి. ఇదేమీ కాకుండా రాజస్థాన్‌ తన తదుపరి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిపోతే ప్లేఆఫ్‌కు దూరమైనట్లే.

* రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఓడిపోతే ప్లేఆఫ్‌ రేసుకు దూరమైనట్లే.

* కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కోల్‌కతా తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో గెలిస్తే ప్లేఆఫ్‌కి చేరినట్లే.

మరిన్ని

© 1995 - 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu Internet Division.
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers