ఎలా మాట్లాడాలో మంత్రులకు నేర్పించండి
సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత జానారెడ్డి హితవు
మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తమ పార్టీపైనా, నాయకులపైనా అనుచిత పదజాలాన్ని వాడుతున్నారంటూ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటన్నారు. రాహుల్‌గాంధీ మాటలు అపరిపక్వతతో ఉన్నాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌...ముందు తన కేబినెట్‌లో మంత్రులకు ఎలా మాట్లాడాలో నేర్పించాలని హితవు పలికారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కతో కలిసి జానారెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా హాలులో మాట్లాడారు.ఇప్పటికైనా కేటీఆర్‌ తన తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ముందస్తు ఎన్నికలపై స్పందిస్తూ..‘మేం ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే..అంత అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని జానారెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును అమలు చేసి ప్రభుత్వం తన ప్రతిష్ఠను ఇనుమడింప చేసుకోవాలని సూచించారు.

ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపిస్తాం: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో ప్రాజెక్టుల పునరాకృతి పేరిట అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ లేవనెత్తిన అంశాలకు తెరాస ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని నిరూపిస్తామని, ప్రభుత్వం వైపు నుంచి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కేటీఆర్‌ మాట తీరు చూసి సిగ్గుతో తల దించుకుంటున్నా అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కేటీఆర్‌ కాంగ్రెస్‌ నాయకులపై విమర్శలకు వాడుతున్న భాష సరికాదని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తెలిపారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తన భర్త వర్ధంతికి నివాళులర్పించడానికి వెళ్లితే అరెస్టు చేయడం దారుణమన్నారు.

కేటీఆర్‌కు అశ్లీల సాహిత్య అవార్డు ఇస్తాం: వీహెచ్‌
కాన్వెంట్‌ స్కూల్లో చదివిన మంత్రి కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయటంలో ఆరితేరారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. కేటీఆర్‌కు జనవరి 26న రవీంద్ర భారతిలో అశ్లీల సాహిత్య చక్రవర్తి అవార్డు ఇస్తానన్నారు. కార్యక్రమానికి కేటీఆర్‌ను అమితంగా అభిమానించే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా పిలిచి, అవార్డుతో పాటు రూ.వెయ్యి నూట పదహార్లు ప్రదానం చేయిస్తానన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.