సంకీర్ణ యోధుడు
భారత రాజకీయాల్లో తొలిసారిగా పూర్తికాల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి చూపిన నాయకుడు
మిత్రపక్షాల మనసు గెలిచి పాలనలో విలువలకు వన్నెలద్దిన రాజనీతిజ్ఞుడు
విపక్ష నేతగా, దేశాధినేతగా గీటురాయి ప్రమాణాలకు ప్రతీకగా నిలిచినవాడు
...జనహృది విజేత భారతరత్న అటల్‌ బిహారి వాజ్‌పేయీ!

‘‘నా విహిత కర్తవ్య నిర్వహణలో విజయం సిద్ధించినా, అపజయం ఎదురైనా రెండింటికీ జంకను. వాటిని స్వాగతిస్తాను. ఎందుకంటే అదీ నిజమే, ఇదీ నిజమే.’’

‘‘నా ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో కూల్చేయడానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఒక్క ఓటుతో మా సర్కారు ఏర్పాటుకు జీవం పోయండి’’
1999 ఎన్నికల ప్రచారంలో వాజ్‌పేయీ


ప్రభుత్వానికీ, ప్రజలకూ వేర్వేరు లక్ష్యాలు ఉండవన్న భావనను అణువణువునా జీర్ణించుకున్న నాయకుడు అటల్‌ బిహారి వాజ్‌పేయీ. పాలన గాడితప్పి, వ్యవస్థలు పట్టు కోల్పోయిన దశలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఒక్కో సీటునూ పదిలంగా కూర్చుకుని ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వాలన్నీ అవిశ్వాస పరీక్షల్లో కుప్పకూలుతున్న తరుణంలో... ‘‘ఓటమిని అంగీకరించను. పోరాటం ప్రారంభిస్తాను. కొత్త గీతిక పాడతాను’’ అంటూ భారత రాజకీయాల్లో తొలిసారిగా పూర్తికాల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి చూపారాయన. మిత్రపక్షాలు అలవికాని తమ డిమాండ్ల సాధనకు ఎప్పటికప్పుడు గొంతెత్తినా... విజ్ఞత, దక్షత, బాధ్యతతో ప్రజాస్వామ్య విలువలకు పట్టం కడుతూ సుదృఢమైన పాలన అందించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోఖ్రాన్‌ అణుపరీక్ష నిర్వహించి భారత సత్తాను ప్రపంచానికి చాటారు. ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెల్లింది. సర్వశిక్షా అభియాన్‌, స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన వంటి పథకాలెన్నో ప్రవేశపెట్టి ప్రజల మదిని గెలిచారు.

‘ప్రజాస్వామ్యంలో లోపాలను మరింత ప్రజాస్వామ్యం ద్వారా పరిష్కరించగలం’ అని నమ్మిన వాజ్‌పేయీ ప్రభుత్వం చివరినాటికి భారత్‌ 8% వృద్ధి రేటుతో ముందుకు సాగింది. జాతి వైవిధ్యాన్ని ఆకళింపు చేసుకుని, సమాజంలోని అన్ని స్థాయులకూ పాలనను తీసుకెళ్లిన దార్శనికుడిగా నీరాజనాలందుకున్నారు అటల్‌జీ! మడమతిప్పని వ్యక్తిత్వం, నైతిక నిష్ఠతో ఎప్పటికప్పుడు రాజకీయాలకు కొత్త మెరుగులు అద్దుతూనే వచ్చారు వాజ్‌పేయీ. మొరార్జీ దేశాయ్‌ సర్కారులో విదేశాంగమంత్రిగా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించినప్పుడే పరిణతి కనబరచిన ఆయన- తర్వాత పాలనాపథంలో అంతకంతకూ రాటుదేలారు. ఎంత సంకీర్ణ ప్రభుత్వమైనా... మిత్రపక్షాల నుంచి డిమాండ్లు, అలకలు, బెదిరింపులు సహజం. పాలనలో అడుగడుగునా ప్రతిబంధకాలు తప్పవు. వాజ్‌పేయీ సారథ్యంలోని సంకీర్ణం సైతం రాజకీయ స్థిరత్వానికీ, దృఢ చిత్తంతో కూడిన విధానాలకు ఆలంబనగా నిలిచింది.

13రోజులు
1996 ఎన్నికల్లో భాజపా అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. అతిపెద్ద పార్టీకి నాయకుడిగా వాజ్‌పేయీ ప్రధానిగా కొలువుదీరారు. కానీ, కాంగ్రెస్‌ ఎత్తులకు ఆయన ఎంతోకాలం ఆ పదవిలో నిలబడలేదు. కేవలం 13 రోజులు మాత్రమే ఆయనకు అధికారం పరిమితమైంది. ఆ తర్వాత దేవెగౌడ, గుజ్రాల్‌ ప్రభుత్వాలను కాంగ్రెస్‌ తెరపైకి తెచ్చింది. కానీ, అవి కూడా పూర్తికాలం మనుగడ సాగించలేకపోయాయి. పాలన వ్యవస్థలకు కొత్తరక్తం ఎక్కించాలని అహరహరం తపించిన ప్రజాస్వామ్యవాదిగా, న్యాయం గెలిచేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడాలని వాజ్‌పేయీ సంకల్పించారు.

13 నెలలు
1998 ఎన్నికల వేళ... కాంగ్రెస్‌ది అవకాశవాద ధోరణి అంటూ వాజ్‌పేయీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. ఆయన నిజాయతీని గుర్తించిన ప్రజలు... భాజపాకు చరిత్రాత్మక విజయం అందించారు. ఆ పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) అత్యున్నత ఆదర్శాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకూ భాజపాను దునుమాడిన పార్టీలు ఎన్డీయేలో చేరాయి. ప్రధానిగా వాజ్‌పేయీ తన విలక్షణతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే వచ్చారు. పార్టీ పరిమితులను ఛేదించి... దేశవ్యాప్తంగా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. విస్తృతంగా జనామోదం పొందారు. అయితే... అవిశ్వాస తీర్మానంలో వాజ్‌పేయీ సర్కారు ఒక్క ఓటుతో అధికారానికి దూరమైంది. గాయపడిన మనసుతో అటల్‌ జీ లోక్‌సభ నుంచి నడుచుకుంటూ పార్లమెంటు భవనంలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ‘హమ్‌ కేవల్‌ ఏక్‌ ఓట్‌ సే హారే, కేవల్‌ ఏక్‌ ఓట్‌ (మనం కేవలం ఒక్క ఓటుతో ఓడాం... కేవలం ఒక్క ఓటు)’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఉద్వేగాన్ని నియంత్రించుకోలేకపోవడం అదే మొదటిసారి. చివరిసారి కూడా!

పూర్తి కాలం సంకీర్ణం
రాజకీయాల్లో ఆయన పడిలేచిన కెరటం. 1999 పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి.. ఎన్డీయే సంకీర్ణ సర్కారును పునఃస్థాపించారు. ఆ ఏడాది అక్టోబరు 13న మూడోసారి ప్రధాన మంత్రిగా వాజ్‌పేయీ ప్రమాణం చేశారు. దాదాపు పూర్తికాలం పదవిలో కొనసాగారు. బాధ్యతలు చేపట్టాక- ఆధునిక సవాళ్లకు అనుగుణంగా భారత్‌ను తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి సారించారు. సామాన్యుడి ఆశలకు అనుగుణంగా నీతిమంతమైన పాలన సాగించారు. స్థిరమైన, పారదర్శకమైన పాలనను అందించడం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని నమ్మారు. అదే ఆచరించి చూపారు. కచ్చితమైన కాలవ్యవధి నిర్దేశించి, పరిమిత సమయంలో ప్రభుత్వాధికారులు లక్ష్యాలను పూర్తిచేయాలన్న విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు.

-ఈనాడు ప్రత్యేక విభాగం

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.