పెళ్లిపందిరి

శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు
చక్కటి సంబంధాన్ని కుదుర్చుకోవడంలో మీ మిత్రుల, బంధువుల సహకారం మీకు ఉన్నప్పటికీ, మీకున్న పరిచయాలను మించి అనేక కొత్త ప్రదేశాలలో కొత్త కుటుంబాలలోని సంబంధాల గురించి తెలుసుకొనే అవకాశాన్ని మీకందిస్తుంది. ''ఈనాడు పెళ్లిపందిరి'' మీరు ఎటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారో తెలుపుతూ పెళ్లిపందిరిలో ప్రకటన ఇవ్వండి. మీ అభిరుచులకు అనువైన సంబంధాన్ని కుదుర్చుకోండి. మీ ప్రకటన ఆంధ్రరాష్ట్రంలోనే కాక దేశ విదేశాలలోని తెలుగు కుటుంబాలకు చేరుతుంది. అధిక సంఖ్యలో సమాధానాలు అందుకొని మీకు వచ్చిన సంబంధం ఎంచుకునే అవకాశం మీదవుతుంది. ఈనాడు పెళ్లిపందిరిలో 4 లైన్ల ప్రకటనకయ్యే ఖర్చు రూ. 1950/- ప్రతి అదనపు లైనుకు రూ. 490/- చెల్లించాలి. పెళ్లిపందిరి ప్రకటనకు అయ్యే మొత్తానికి ఆదనంగా రూ. 60/- చెల్లిస్తే ఆ ప్రకటన ఇంటర్‌నెట్ ఎడిషన్‌లో కూడా వస్తుంది. ప్రకటన ఖర్చు డిడి గా ప్రచురించవలసిన తేదీకి 3 రోజులు ముందు ఈనాడు కార్యాలయంలో అందాలి. అనువైన సంబంధాల ఎంపికలో మీ ఆత్మీయ బంధువు

ఆశీర్వాదం అఖండబలం
తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది అతిథి సత్కారములను స్వీకరించి మమ్మానందింపజేయ పార్థన.
- ఇది శుభలేఖల్లో సాధారణంగా కనిపించే అసాధారణమైన మాటలు. ఇందులో పెళ్లిపెద్దల లక్ష్యం వధూవరులను ఆశీర్వదింపజేయడమే. వధూవరుల ఆశ, ఆశయం కూడా అదే!
ఆశీర్వదిస్తే ఏమవుతుంది? దేవుడు ఆశీర్వదిస్తే ఫలితం కానీ సాటి మనిషి ఆశీర్వదిస్తేనేం? ఆశీర్వదించకపోతేనేం? అని  కొందరనుకుంటారు. కానీ పెళ్లికి వచ్చిన వాళ్లు అతిథులు. ‘అతిథి దేవోభవ’ అన్నారు. అతిథులు దేవుళ్లయినప్పుడు వాళ్ల దీవెనలకు విలువ ఎందుకు వుండదు? అయినా ఆశీస్సులకు కుల, మత, ప్రాంత, స్త్రీ పురుష భేదాలుండవు. వధూవరుల కన్నా వయసులో పెద్దవారైతే చాలు. మంచి మనసుంటే చాలు! అందుకే నవవధూవరులకు పెద్దల ఆశీస్సు లుండాలని మనవారు కోరుకుంటారు.

మరోమాట- దేవుడు కనబడడు. కంటికి కనిపించే మనిషి రూపంలోనే ఆయన ఆశీర్వాదాలందిస్తాడు.‘దైవం మానుష రూపేణ’ అని అనేది అందుకే. అంచేత మనిషిలో దైవబలం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జీవుడే దేవుడయిపోతాడు. అందుకే పెద్దలు, బంధుమిత్రుల ఆశీస్సులు తప్పనిసరి.

పెళ్లివేళ మంగళ సూత్రాన్ని అతిథుల చేత తాకిస్తారు. ముత్తయిదువలతో తాకిస్తారు. ఏ మనస్సులో ఏ మహిమ ఉందో, ఏ మనిషిలో ఎంతటి శక్తి వుందో ఎవరికెరుక? ఆ బలమంతా పెళ్లి దిగ్విజయం కావడానికి ఉపయోగపడాలి. అది నూతన వధూవరులకు బలాన్నిస్తుందన్నది విశ్వాసం. పంటకు ఎరువులు ఎంత అవసరమో, ‘నూరేళ్ల పంట’కు ఆశీస్సులూ అంత అవసరమే. ఈ ప్రపంచాన్నీ విశ్వాసాలు నిలబెడుతున్నాయి. పెళ్లినీ నిలబెడుతున్నది విశ్వాసమే. అయితే అతిథులు మనసు పెట్టి ఆశీర్వదించడం అవశ్యం. తొందరలోనో, వెళ్లే హడావిడిలోనో, విందు మీద దృష్టితోనో పరధ్యానంగానో చేయరాదు. మొక్కుబడిగా అక్షింతలు వేసి వెళ్లిపోతే ఆ ఆశీర్వచనం ఎంతవరకూ ఫలిస్తుందన్నదీ ప్రశ్నార్థకమే! పెళ్లివిందు కూడా దేవుళ్లకు పెట్టే నైవేద్యం లాంటిదే. నైవేద్యం స్వీకరించే దేవుడు నిండుమనస్సుతో ఆశీర్వదిస్తాడు. అలాగే ఆశీర్వాద సమయంలో అతిథులకు వేరే ఆలోచనలు పనికిరావు.

నూతన వధూవరులు అతిథులకు ఒకరకమైన శరణాగతులు...తమ ఉజ్వల భవిష్యత్తుకోసం ఆశీస్సులు కోరుతూ మొక్కుతారు. ‘శతమానం భవతి’ అని అక్షింతలు వేయగానే తమ జన్మధన్యమైనట్టు పులకరించిపోతారు. ‘ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు దీర్ఘసుమంగళీభవ, దీర్ఘాయురస్తు, శ్రీరస్తు, శుభమస్తు, సంతాన ప్రాప్తిరస్తు’ అనేవి పెద్దల ఆశీర్వచనాల్లో మరికొన్ని. ఫలానా ఫలానా వాళ్లు తమ పెళ్లికి వచ్చి తమను ఆశీర్వదించారని భవిష్యత్తులో భార్యాభర్తలు ఘనంగా చెప్పుకుంటారు. ఆయా దృశ్యాలున్న ఛాయాచిత్రాల సంపుటాలను అందరికీ చూపిస్తారు. తమ తీపిగుర్తులుగా  భవిష్యత్తులో పిల్లలకు చూపించి గర్వపడతారు!

పెళ్లి వధూవరుల మధ్య జరిగే వ్యవహారం. రెండు కుటుంబాల నడుమ జరిగే కార్యక్రమం. పురోహితుడు వేదమంత్రాలతో వధూవరులను ఎలాగూ ఆశీర్వదిస్తాడు.. మళ్లీ ఇతర అతిథులందరూ వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరమేముంది అనుకోవచ్చు. దీని వెనుక సామాజిక అవసరం కూడా ఉంది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి బాజాభజంత్రీలతో పెళ్లిచేసి ఊరూవాడా ని పిలిచి విందులు చేసి ఆశీస్సులు అందించడం ఎందుకంటే వీరిద్దరూ భార్యాభర్తలని లోకానికి చాటి చెప్పడానికే. వీరిద్దరూ దంపతులని అందరికీ తెలియడానికే. ఆ తర్వాత నవదంపతులు వీధుల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నా ఎవరూ అపార్థం చేసుకోరు. చెడు దృష్టితో చూడరు. చెడుమాటలు అనరు. పైగా జంట చూడముచ్చటగా వుంది అని మెచ్చుకుంటారన్నమాట. పెళ్లి అనేది పెద్దల ఆశీర్వాదంతో పొందే పట్టాలాంటిది. వధూవరులు అలా ‘పట్టాభద్రులు’అవడమేగాక దానిని నిండు నూరేళ్లు భద్రంగా చూసుకోవడమే వారి కర్తవ్యం. అప్పుడే వారికి  సమాజంలో భార్యాభర్తలుగా చక్కని గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెళ్లి జీవితంలో అపురూపమైన బహుమతి. ఆ బహుమతిని అందుకోవడానికి పెద్దల ఆశీర్వాదమే తిరుగులేని అనుమతి! భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు!

- శంకరనారాయణ

 
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.