షష్టిపూర్వక స్నేహం
ఒక రైలు ప్రయాణం...
వాజ్‌పేయీని ఆడ్వాణీకి పరిచయం చేసింది.
తర్వాత మరోచోట కలిసినప్పుడు...
వారి మధ్య స్నేహబంధం చిగురించింది.
అంతే! అది మొదలు..
విభేదాలకు తట్టుకుని, ఆటుపోట్లకు
ఎదురొడ్డి ఆ మైత్రి బలపడింది.
ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో
ఎన్నెన్నో కఠిన సవాళ్లను అధిగమించింది.
స్నేహమనే మాటకే పర్యాయపదంగా
నిలిచిన ఆ ద్వయం నేడు భౌతికంగా విడిపోయింది.
తన మిత్రుణ్ని ఏకాకిని చేస్తూ వాజ్‌పేయీ తిరిగిరాని లోకాలకు
వెళ్లిపోయిన నేపథ్యంలో... వారి ‘‘మనసులో మాట’’లివీ.

అటల్‌జీ.. అమూల్యమైన సంపద
‘‘నా రాజకీయ జీవితంలో మొదట్నుంచీ తోడున్న వ్యక్తంటే అటల్‌జీనే. పార్టీలో ఆయన నాకు అత్యంత సన్నిత సహచరుడు. ఆయన నాయకత్వాన్ని అన్నివేళలా నిస్సందేహంగా అంగీకరించాను. అటల్‌జీతో సుదీర్ఘ సాహచర్యాన్ని అత్యంత అమూల్యమైన సంపదగా భావిస్తాను’’అంటూ తన ఆత్మకథను ఆరంభించారు ఆడ్వాణీ. మిగతా సంగతులు ఆయన మాటల్లోనే..

తొలి పరిచయం మరువలేనిది
తొలిసారి అటల్‌జీని చూసిన సంగతి ఇప్పటికీ మరువలేను. జనసంఘ్‌ యువ కార్యకర్తగా ఆయన శ్యామా ప్రసాద్‌ ముఖర్జీతోపాటు రైలులో వెళ్తున్నారు. అస్పష్టంగావున్న ఆయన రూపురేఖలు ఇంకా నా మదిలో మెదులుతున్నాయి. చురుగ్గా నా అంత సన్నగా ఆయన ఉండేవారు. నేను కాస్త పొడవు కాబట్టి ఆయన కంటే సన్నగా కనిపించేవాణ్ని. యవ్వనపు, ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని చూడగానే అర్థమైంది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్లు కనిపించేది. ఆయనలో అంతర్జ్వాల ముఖంపై ప్రస్ఫుటమయ్యేది. అప్పుడాయన వయసు 27 లేదా 28 సంవత్సరాలు ఉండొచ్చు. కొన్నిరోజుల తర్వాత అటల్‌జీ రాజస్థాన్‌లో ఓ పర్యటన కోసం వచ్చారు. మొదటిసారి ఏర్పడిన అభిప్రాయాలన్నీ దీంతో మరింత బలపడ్డాయి. అద్భుత వ్యక్తిత్వం, హిందీపై ‘‘అసాధారణ ఆధిపత్యం’’, అత్యంత తీవ్రమైన రాజకీయ అంశాలనూ చమత్కారంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించగలిగిన ఆయన సామర్థ్యం.. నాపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయి. రెండో పర్యటన ముగిసేనాటికి ఆయన ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడని, ఒకరోజు మన దేశానికి నాయకత్వం వహించగలిగే లక్షణాలు ఆయనలో ఉన్నాయనే అభిప్రాయం కలిగింది.

ప్రతికూల పరిస్థితుల్లో బాసటగా
హవాలా కేసులో కొందరు నన్ను ఇరికించినప్పుడు.. నా పట్ల విశ్వాసాన్ని, సంఘీభావాన్ని ఆయన బహిరంగంగా ప్రదర్శించిన తీరు నా మనస్సుకు హత్తుకుంది. ఇదే పార్టీలో శక్తినీ నింపింది. పార్టీ అగ్రశ్రేణి నాయకుల మధ్య సమైక్యత గురించి తిరుగులేని సందేశాన్ని పంపింది. 1995లో ముంబయిలో పార్టీ మహాసభలో ఇదేరకమైన సందేశాన్ని నేనూ పంపాను. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయనే మా ప్రధాన మంత్రి అభ్యర్థని.. పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాను. ఈ ప్రకటనతో గొప్పత్యాగం చేశానని కూడా కొందరు అన్నారు. అయితే నేను చేసింది త్యాగం కాదు. ఏది సరైనది, ఏది పార్టీకి దేశానికి ప్రయోజనకరమైంది? అన్న విషయంలో హేతుబద్ధమైన అంచనాకు వచ్చిన తర్వాతే ఈ ప్రకటన చేశాను.

పోటీనే లేదు
అటల్‌జీతో ఏనాడూ పోటీగానీ, సంఘర్షణగానీ తలెత్తలేదు. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలుండేవి. వ్యక్తిత్వాలు వేరుగా ఉండటంతో సహజంగానే వ్యక్తులపై, సంఘటనలపై, సమస్యలపై అంచనాలు భిన్నంగా ఉండేవి. అంతర్గత ప్రజాస్వామ్యానికి అద్దంపట్టే ఏ సంస్థలోనైనా ఇది సహజమే. మా మధ్య బంధం ఇంత పటిష్ఠంగా మారడానికి 3 కారణాలున్నాయి. వీటిలో మొదటిది దేశం. రెండోది పార్టీ. మూడోది అంతరాంతరాల్లోనూ అటల్‌జీని సీనియర్‌గా, నాయకుడిగా నేను అంగీకరించడం. అటల్‌జీతో భేదాభిప్రాయాలూ ఉండేవి. అయోధ్య ఉద్యమమే దీనికి తార్కాణం. ఉద్యమంతో భాజపా ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడంపై అటల్‌జీకి అభ్యంతరాలున్నాయి. కానీ ఆయన సహచరుల మధ్య ఏకాభిప్రాయాన్ని గౌరవించారు.


కలిసే జైలుకు
ఇందిరాగాంధీ అత్యయిక స్థితికి వ్యతిరేకంగా పోరాడి ఇద్దరం కలసికట్టుగా జైలుకెళ్లాం. అనంతరం జనతాపార్టీ ఆవిర్భావానికి కలిసే కృషి చేశాం. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆరోగ్యం క్షీణించిన తర్వాత పార్టీని సంఘటితం చేసేందుకు, ప్రభుత్వ స్థిరత్వం కోసం మా ఇద్దరిలా దృఢ విశ్వాసంతో కష్టపడి పనిచేసినవారు ఇంకెవరూ లేరు. 1998లో భాజపా విజయవంతంగా అధికారాన్ని చేపట్టేందుకు ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రధానంశమని రూఢిగా చెప్పగలను. ఈ ఆకర్షణ పార్టీకున్న మద్దకు కంటే అతీతమైనది.
సినిమాలకూ..
హిందీ సినిమాలు కలిసి చూడటం మాకు అలవాటు. మొదట్లో దిల్లీలోని రీగల్‌, ఇతర సినిమాహాళ్లకు కలిసి వెళ్లేవాళ్లం. 1959లో మేం దిల్లీ మున్సిపల్‌ ఉప ఎన్నికల కోసం కష్టపడి పనిచేశాం. విజయం సాధించకపోవడంతో నిరాశకు గురయ్యాం. దీంతో సినిమా చూద్దాం పదమని అటల్‌జీ చెప్పారు. మేమిద్దరమూ పహాడ్‌గంజ్‌లోని ఇంపీరియల్‌ సినిమాహాల్‌కు వెళ్లాం. ప్రముఖ నటుడు, నిర్మాత రాజ్‌కపూర్‌ నటించిన ‘‘ఫిర్‌ సుబాహ్‌ హోగీ’’ సినిమా చూశాం.

ముందుమాట వాజ్‌పేయీదే!
ఆప్త మిత్రుడు, తనతో భుజం కలిపి నడిచిన సహచరునిగా ఆడ్వాణీని అటల్‌జీ అభివర్ణించేవారు. అంతేకాదు ఆడ్వాణీ ఆత్మకథకు ముందుమాట రాసిందీ ఆయనే. తమ 60 ఏళ్ల ప్రయాణాన్ని దీనిలో ఆయన స్మరించుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..  ఆడ్వాణీతో నా బంధం 60 ఏళ్లనాటిది. నాతో భుజం కలిపి నడిచిన సహచరుడాయన. వెనక్కి తిరిగి చూస్తే ఆయన నిర్వహించిన ఎన్నో పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌తోపాటు నాకూ అత్యంత క్లిష్ట సమయాల్లో పార్టీని నిర్మించేందుకు ఆయన సహాయపడ్డారు. అత్యయిక పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యం కోసం పోరాడి నాతోపాటు జైలు జీవితమూ గడిపారు. జనతాపార్టీ ప్రభుత్వ ఏర్పాటులోనూ, పతనంలోనూ తోడుగా ఉన్నారు. ఎన్డీయేను నిలబెట్టడంలోనూ ఎంతో సహాయపడ్డారు. ఆరు సంవత్సరాలు దేశానికి సారథ్యం వహించినప్పుడు ఉప ప్రధాని మంత్రిగా ఆయన అండగా నిలిచారు.

ఐక్యతే బలం
నిజమే. అనేక అంశాలు, వైఖరులపై మా మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఒక సంస్థలో 60ఏళ్లు పాటు పనిచేసిన ఇద్దరు ఒకేరకంగా ప్రతిస్పందించడం సాధ్యంకాదు. అయితే విభేదాలకంటే లక్ష్యం, కార్యచరణ కోసం ఏర్పడ్డ ఐక్యత మా సంబంధాల్లో ప్రధానమైనది. భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ విభేదాలకు దారితీయలేదు. అవి విభజనకూ కారణం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భాజపా సమైక్యంగా నిలబడేందుకు ఇదే కారణం.

ఎంతో గొప్పవారు
నిజమైన లౌకికవాదం, జాతీయత ప్రధాన మూలాలపై తీవ్రమైన ప్రజాచర్చ రేకిత్తించడంలో ఆడ్వాణీ కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కొన్నిసార్లు ఆడ్వాణీని అపార్థం చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. విభిన్న మార్గాల నుంచి కొత్త ఆలోచనలు గ్రహించేందుకు ఆయనకు స్వేచ్ఛగా ఆలోచించే మస్తిష్కం ఉంది. ఆయనలో ఉన్న గొప్పతనం ఇంకా బయటకు రావాల్సి ఉందని విశ్వసిస్తున్నా. అది నెరవేరాలని ప్రార్థిస్తున్నా.


మోదీపై భేదాభిప్రాయాలు
గోధ్రా అల్లర్ల సమయంలో మోదీతో రాజీనామా చేయించాలని ఒత్తిడి చేయడంపై వాజ్‌పేయీ, ఆడ్వాణీల మధ్య విభేదాలున్న సంగతి జగమెరిగిన సత్యం. ఇదే విషయాన్ని ఆత్మకథలోనూ ఆడ్వాణీ ప్రస్తావించారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..  2002 గోధ్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలూ దీనికి గొంతు కలపడంతో డిమాండ్‌ తారస్థాయికి చేరుకుంది. భాజపాతోపాటు ఎన్‌డీఏలోనూ కొంత మంది వ్యక్తులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే గుజరాత్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడిన అనంతరం మోదీపై అన్యాయంగా దాడిచేస్తున్నారని గట్టిగా విశ్వసించాను. మరోవైపు గుజరాత్‌ ఘర్షణలతో కేంద్రంలోనూ మా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింది. దీంతో ఏదోక గట్టి చర్య తీసుకోవాలని అటల్‌జీ భావించారు. మరోవైపు మోదీతో రాజీనామా చేయాలని కోరాల్సిందిగా ఆయనపై ఒత్తిడీ పెరిగింది. ఆయన స్పష్టమైన అభిప్రాయం చెప్పకపోయినప్పటికీ.. మోదీతో రాజీనామా చేయిస్తే మంచిదని ఆయన భావించారని నాకు స్పష్టంగా తెలుసు. నేను దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్న సంగతీ ఆయనకు తెలుసు.

ఇది జరిగిన కొద్ది రోజులకే గోవాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేశాం. ‘‘మోదీ భవితవ్యంపై పార్టీ ఏం నిర్ణయిస్తుంది. గుజరాత్‌పై ఏం చర్చ జరుగుతుంది’’లాంటి అంశాలే ఆనాటి ప్రధాన అజెండా. గోవాకు రావాల్సిందిగా అటల్‌జీ నన్ను కోరారు. విమానంలో వెళ్తుండగా.. ఆయన దీర్ఘాలోచనలో మునిగిపోయారు. వెంటనే జస్వంత్‌ సింగ్‌ స్పందిస్తూ.. మోదీ విషయంలో ‘‘మీరేం అనుకుంటున్నారు?’’అని అటల్‌జీని ప్రశ్నించారు. దీంతో ‘‘కనీసం మోదీ రాజీనామా చేస్తాననైనా చెప్పాలి’’అని అటల్‌జీ అన్నారు. దీంతో మోదీ తప్పుకోవడంతో గుజరాత్‌ పరిస్థితి మెరుగు పడేటట్లయితే.. రాజీనామా చేసేందుకు ప్రతిపాదించమని ఆయనకు చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. కానీ దానివల్ల ఏదో జరుగుతుందని భావించట్లేదని అన్నాను. పార్టీ జాతీయ కార్యవర్గం దాన్ని అంగీకరిస్తుందనీ చెప్పలేనని స్పష్టీకరించాను. చివరగా సమావేశంలో రాజీనామా చేస్తానని మోదీతో నేనే చెప్పమన్నాను. అయితే ‘‘వద్దు వద్ద’’అనే నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో భేదాభిప్రాయాలన్నీ సమసిపోయాయి.కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.