నేడు దిల్లీకి కేసీఆర్‌
ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ
కొత్త జోనల్‌ విధానానికి  నేడు మంత్రిమండలి ఆమోదం
ఆ వెంటనే తీర్మానం ప్రతితో దిల్లీకి సీఎం పయనం
ప్రధానిని కలిసి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పుపై విన్నపం
ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. ఆదివారం తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే ఆయన బయల్దేరుతారు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన కొత్త జోనల్‌ విధానంపై మంత్రిమండలిలో తీర్మానం చేయించిన వెంటనే దాని ప్రతిని తీసుకొని స్వయంగా దిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కొత్త జోనల్‌ విధానం అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పును కోరే తీర్మానాన్ని అందజేస్తారు. రాష్ట్రపతి ద్వారా ఆమోదం ఇప్పించాలని కోరతారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు అంశాలు, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటి ఇతర అంశాలపైనా ఆయన చర్చించే వీలుంది. దిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులను కూడా కలుస్తారు. ప్రధానమంత్రితో భేటీ మంగళవారం ఉండే వీలుంది. దిల్లీ పర్యటనలో ఆయన దంత వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటారని సమాచారం.

మంత్రిమండలిలో 15 అంశాల ఎజెండా: తెలంగాణ మంత్రిమండలి కీలక సమావేశం ఆదివారం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో కొత్త జోనల్‌ విధానం, రైతుల జీవిత బీమా పథకానికి ఆమోదం లాంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. దీంతో పాటు కాళేశ్వరానికి అదనపు కేటాయింపులు, దేవాదుల, తుపాకుల కార్పొరేషన్‌ ఉత్తర్వులకు ఆమోదం, రైతు సమన్వయ సమితికి 14 పోస్టులు, మరికొన్ని ఉద్యోగ నియామకాలకు ఆమోదం తదితర అంశాలకు అనుమతి ఇవ్వనుంది. మంత్రిమండలి కోసం మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు. సాయంత్రం 5 గంటలకు సమావేశాన్ని ముగించాలని భావిస్తున్నారు. సమయానుకూలంగా మార్పులు, చేర్పులు జరిగే వీలుంది.

ముఖ్యమంత్రి సమీక్ష: మంత్రిమండలి సమాశం అజెండాపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం రోజంతా సమావేశం నిర్వహించారు. కొత్త జోనల్‌ విధానంపై సుదీర్ఘంగా చర్చించి, పలు అంశాలను ఖరారు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులలో చేయాల్సిన మార్పులు, కొత్తగా చేర్చాల్సిన వాటిని ఆమోదించారు. స్థానికత, జిల్లా, జోనల్‌, బహుళ జోన్లు, రాష్ట్రస్థాయి పోస్టుల విభజన తదితర అంశాల గురించి కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధంచేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.