మూడుముళ్లపై..ట్రంపెడు నీళ్లు!
హెచ్‌-1 వీసాదారుల భాగస్వాముల ఉద్యోగాలపై ఆంక్షలకు ట్రంప్‌ సర్కారు కసరత్తు
వివాహాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆ నిర్ణయం
అమెరికా సంబంధాలపై మారుతున్న ధోరణి
ఐటీయేతర వృత్తి నిపుణుల వైపు అమ్మాయిల చూపు
ఈనాడు - హైదరాబాద్‌
దేశాధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ పరిధి..ప్రభావం అమెరికా దేశానికే పరిమితం కావాలి. తద్భిన్నంగా ఆగ్రదేశాధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలు భారతదేశాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయంగానో, ద్వైపాక్షికంగానో కాదు సామాజికంగానూ అవి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హెచ్‌1-బి వీసాదారుల భాగస్వాములకు అమెరికాలో పని అనుమతి(వర్క్‌ పర్మిట్‌) జారీపై ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడు సమాయత్తమవుతున్న నేపథ్యంలో..ఆ నిర్ణయం భారతీయ కుటుంబ వ్యవస్థ.. ప్రత్యేకించి దక్షిణాది, మరీ ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా మూడుముళ్ల బంధాలకు అది ప్రతిబంధకంగా మారుతోంది.

ఒకప్పుడు డాలర్ల పంట..ఇప్పుడో!
భారతదేశం నుంచి వెళ్లే అమ్మాయిల్లో సింహభాగం మంది వృత్తి నిపుణులే కావడంతో..హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాపై వచ్చే వారు ఉద్యోగాలు చేసేందుకు 2012లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వెసులుబాటు కల్పించారు. భారతీయుల మధ్య వైవాహిక బంధాలు బలపడేందుకు ఆ నిర్ణయం ఎంతగానో దోహదం చేసింది. ఆ కారణంగా ఇటీవల వరకు అమెరికా ఐటీ వరుడు అంటే కాసుల పంటే అన్నట్లుండేది. తల తాకట్టు పెట్టయినా అమెరికా వరుణ్ని అందిపుచ్చుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఆసక్తి చూపేవారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెంపరి నిర్ణయాలతో పరిస్థితి తారుమారు అవుతోంది. హెచ్‌-4 వీసాపై వచ్చే భాగస్వాములను ఇంటికే పరిమితం చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తుండగా..ఆ నేపథ్యం అమెరికా పెళ్లి సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆ సంబంధాలంటే..వద్దు బాబాయ్‌ అనే పరిస్థితికి దారితీసింది.

వస్తే వివాహం..రావాలంటే భయం
ఒకటీ అర సంబంధాలపై కుటుంబపరంగా ఆసక్తి చూపినా పెళ్లిచూపుల కోసం అమెరికా వదిలి వచ్చేందుకు వరులు జంకుతున్నారు. ఒకవేళ వస్తే మళ్లీ అమెరికాలో ప్రవేశానికి అవకాశం ఉంటుందో? లేదో? అన్న మీమాంశ వారిని వెంటాడుతోంది. అమెరికాలోనే ఉన్న అమ్మాయిలు..అబ్బాయిల మధ్య సంబంధాలు కలుపుకునేందుకు సైతం పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఉద్యోగం ఉంటుందో? లేదో? తెలియదు. కొనసాగింపు వస్తుందో? లేదో? అన్న డోలాయమానంలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు.

అమ్మాయిల ప్రాథామ్యాలు మారుతున్నాయ్‌
తల్లిదండ్రులతోపాటు అమ్మాయిలు కూడా గతంలో డాలర్‌ కలల్లో తెలియాడేవారు. ప్రస్తుతం ఆ కలలు కల్లలుగా మారడంతో అమ్మాయిల ప్రాథామ్యాలూ మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి తెంపరి నిర్ణయాన్ని వెలువరిస్తారో అంతుచిక్కకపోతుండటంతో ఐటీయేతర నిపుణులైన వరులపైనే వధువులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. సివిల్‌ సర్వీసెస్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, వైద్యులు, వ్యాపారవేత్తలపై ఆసక్తి చూపుతున్నారు’ అని ప్రముఖ వివాహ పరిచయ వేదిక ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ‘ఐటీ నిపుణులపై ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతోంది. గడిచిన ఏడాది నుంచి తమ సంస్థ ద్వారా రెండు మూడు శాతానికి మించి అమెరికా ఐటీ నిపుణుల సంబంధాలను కుదర్చలేదని’ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వివాహ వేదికకు చెందిన యలమంచి చిరంజీవిరావు ‘ఈనాడు’తో చెప్పారు. ఐటీ కాకుండా ఇతర వృత్తి నిపుణులను ఎంచుకునేందుకు అమ్మాయిలు ఆసక్తిచూపుతున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం వచ్చినప్పట్నుంచి సొంత రాష్ట్రాలకు వచ్చే అబ్బాయిల సంఖ్య కూడా తగ్గిందని పేర్కొన్నారు.


అధ్యయనం చెప్పిన నిజం
అమెరికా జారీ చేసిన వీసాలపై అమెరికాకే చెందిన మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌(ఎంపీఐ) ఇటీవల అధ్యయనం చేసింది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌-4 వీసాదారులు పని చేసేందుకు అవకాశం కల్పించకూడదన్న నిర్ణయాన్ని చట్టబద్ధం చేసే కసరత్తు అమలులోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది.
* హెచ్‌1-బి వీసాదారుల భాగస్వాము(భార్య లేదా భర్త)ల్లో సుమారు 71 వేల మందికి 2017కు ముందు అమెరికా వర్క్‌ పర్మిట్‌ వీసాలిచ్చింది.
* హెచ్‌-4 వీసాలు పొందిన భాగస్వాముల్లో 90 శాతం మంది భారతీయులు.
* ఆ వీసాలు పొందిన వారిలో 94 శాతం మంది హెచ్‌1బి వీసాదారుల భార్యలే.
* వారిలో 93 శాతం మంది భారతీయులు.
* వారిలో అధిక శాతం మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారున్నట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది తెలుగు వారే.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.