ముంచెత్తిన వాన
జలదిగ్బంధంలో ఆదిలాబాద్‌
ఆసుపత్రి నుంచి రోగుల తరలింపు
పొంగిన వాగులూ వంకలు
ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, బృందం: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.  రహదారులు దెబ్బతిన్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. గర్భిణులను అతికష్టమ్మీద వరద నీటిలో ఆస్పత్రులకు చేర్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో జలమయమైంది. ఆదిలాబాద్‌లో లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరి సామగ్రి అంతా తడిసి ముద్దవడంతో వేలాదిమంది నరకయాతన పడుతున్నారు. రాంనగర్‌ వద్ద స్థానికులు ఆగ్రహంతో అటువైపు వెళుతున్న బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపూరావు వాహనాన్ని అడ్డగించి నిలిపివేశారు. పట్టణంలో జీఎస్‌ ఎస్టేట్‌వాసులు చెరువులో ఉన్న ఇళ్లకోసం మత్తడి తెంవడంతో తమ ఇళ్లలోకి నీరు చేరిందంటూ పాత జాతీయ రహదారిపై బైఠాయించారు. జన్నారం వద్ద వాగు పొంగిప్రవహించటంతో మూడు జిల్లాలకు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఇచ్చోడ మండలంలోని అడెగామ వద్ద వాగు పొంగిప్రవహించటంతో అంతర్రాష్ట్ర రహదారిపై, తలమడుగు వాగు వరద ఉద్ధృతితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్చోడలోని కస్తూర్బా పాఠశాల, బాలికల గిరిజన గురుకుల పాఠశాలల్లో వరద నీరు భారీగా చేరడంతో పిల్లలను సురక్షింతగా ప్రయివేటు గార్డెన్‌కు తరలించారు. పీహెచ్‌సీలోకి వరద నీరు చేరటంతో రోగులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. సిరికొండ, ఇచ్చోడ నేరడిగొండ, ఆదిలాబాద్‌, బజార్‌హత్నూర్‌ మండలాల్లో వాగులు ఉప్పొంగడంతో పదులసంఖ్యలో గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆదిలాబాద్‌ మండలంలో బూర్నూర్‌ చెరువు తెగిపోయి గ్రామంలోకి వరద నీరు చేరింది. గుడిహత్నూర్‌ మండలం వాగాపూర్‌కు అయిదుగురు ఉపాధ్యాయులు కారులో వెళ్తుండగా వైజాపూర్‌ వద్ద వరద ఉద్ధృతిలో చిక్కుకుపోగా. కష్టమ్మీద వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వీరి వాహనం వరదల్లో కొట్టుకుపోయింది. కోటపల్లిలో తున్‌తుంగ వాగు పొంగడంతో 12గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. నూతనంగా నిర్మిస్తున్న ఎడమ కాలువ కాగజ్‌నగర్‌ మండలం కోసిని వద్ద గండి పడింది.  కుమురం భీం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేశారు. నిర్మల్‌ జిల్లాలో స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఖత్‌గావ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు వరదనీటిలో చిక్కుకున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భారీగా వరదనీరు చేరడంతో 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు మూడు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కడెం జలాశయం 14 వరదగేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు..
గోదావరి పరివాహకంలోనూ ఉరకలు
మహారాష్ట్రతో పాటు తెలంగాణలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహకంలోని వంకల నుంచి ఉపనదుల వరకు ఉప్పొంగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉపనదులు పొంగుతున్నాయి. భద్రాచలం గోదావరి గురువారం సాయంత్రానికి 43 అడుగులు దాటింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తాలిపేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో 23 గేట్లు ఎత్తి 1,42,200 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరి నదికి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఎగువన సాయంత్రం 5 గంటలకు కడెం ప్రాజెక్టు 29 గేట్లు, 6 గంటలకు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
* కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా ఉండటంతో రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం నుంచి గురువారం వరద విడుదల కొనసాగింది.
* జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం వరద పెరిగి తర్వాత నిలకడగా కొనసాగుతోంది. జల విద్యుదుత్పత్తి ద్వారా 48వేలు, 13 క్రస్ట్‌గేట్లను ఎత్తి 74వేలు మొత్తం 1.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం జలాశయం వైపు వదులుతున్నారు.
చెరువులకు గండ్లు పడే ప్రమాదం: మంత్రి హరీశ్‌రావు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులకు గండ్లు పడే ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజినీర్లను అప్రమత్తం చేశారు. గురువారం పరిస్థితిపై ఎస్‌ఈలు, సీఈలతో జలాశయాలు, చెరువులపై సమీక్ష నిర్వహించారు. వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గంటకూ వరదపై పరిశీలన చేయాలని సూచించారు. ప్రధాన జలాశయాలు, ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేస్తూ ఉండాలని ఆదేశించారు.
‘శబరి’కి భారీగా వరద
న్యూస్‌టుడే, చింతూరు: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలోని చింతూరు వద్ద శబరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకుంది. విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారిపై చిడుమూరు సమీపంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వరరామచంద్రపురం మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. 25 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఏపీ నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారి నిమ్మగూడెం- కుయిగూరు గ్రామాల మధ్య వరద నీరు చేరింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. ఆనకట్ట నుంచి సముద్రంలోకి 4,10,876 క్యూసెక్కులను వదిలారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.