పట్టాలపై పెను విషాదం
ప్రజలపైకి దూసుకొచ్చిన రైలు
61 మంది మృతి..  72 మందికి గాయాలు
అమృత్‌సర్‌ సమీపంలో ఘోరం
రావణ దహన వేడుకల్లో ఘటన
రోజంతా వేడుకగా దసరా పండుగ చేసుకొని.. సాయంత్రం దశకంఠుడి దహనకాండను కళ్లారా చూసేందుకు ఉత్సాహంతో వచ్చారు. చెవులు చిల్లులు పడేలా బాణసంచా పేలుళ్లు.. కళ్లు మిరుమిట్లు గొల్పే కాంతులతో సాగిన రావణుడి దహనకాండను ఒళ్లంతా కళ్లు చేసుకొని చూస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ సంబరంలో.. రైలుపట్టాల మీద నిలబడ్డామన్న సంగతినే మరిచిపోయారు. శరవేగంగా దూసుకొస్తున్న జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు తమ పాలిట యమశకటమవుతుందని పసిగట్టలేకపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుపచక్రాల కింద పడి నలిగిపోయారు. కొద్దినిమిషాల ముందు వరకూ ఉన్న ఆనందాతిరేకాలు ఆవిరయ్యాయి. ఆక్రందనలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది.
అమృత్‌సర్‌
అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద దసరాను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 61 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 72 మంది గాయపడ్డారు.

రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేరువేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో జనానికి దృశ్యగోచరత సరిగా లేదు. రైలు మోత వినిపించలేదు. ఈ అయోమయంలో.. జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు.

హృదయ విదారకం..
క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు అమృత్‌సర్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ రాజేశ్‌ శర్మ చెప్పారు. కళ్ల ముందే బంధువులు, స్నేహితులు దుర్మరణం పాలవ్వడాన్ని చూసిన జనం గుండెలు అవిసేలా రోదించారు. తమవారి జాడ కోసం మరికొందరు అన్వేషణలో పడ్డారు. తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మొత్తం భయానకంగా ఉంది. మృతుల్లో అనేక మంది చిన్నారులూ ఉన్నారు. కొన్ని మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఈ దృశ్యాలు.. వీక్షకుల గుండెలను పిండేశాయి. మృతదేహాలను తొలగిచేందుకు అక్కడికి వచ్చిన అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. శవాలను తొలగించడానికి తొలుత అంగీకరించలేదు. దీంతో ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మృతదేహాలు ఘటనా స్థలిలో పడి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి డీజీపీ నేతృత్వంలో అదనపు బలగాలు అక్కడికి తరలివచ్చాయి.

ముఖ్య అతిథిగా సిద్ధూ భార్య
రావణ దహనకాండ వేడుకకు.. పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సిద్ధూ భార్య, స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాదం తర్వాత స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను క్షతగాత్రులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లినట్లు ఆమె ఆ తర్వాత చెప్పారు. దసరా వేడుకల నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైళ్లను నెమ్మదిగా నడపాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరగడానికి ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపారు.

దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. శనివారం నుంచి తాను చేపట్టాల్సిన ఇజ్రాయెల్‌ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యచికిత్స అందించాలని చెప్పారు. సహాయ చర్యలను పర్యవేక్షించడానికి తాను అమృత్‌సర్‌ తరలివెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రైలు పట్టాల పక్కనే రావణ దహనం జరగడానికి కారణాలు తనకు ప్రస్తుతానికి తెలియవని, దీనిపై అధికారులు దృష్టిసారిస్తారని చెప్పారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా, రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్వనీ లోహానీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలికి బయలుదేరారు. తక్షణ సహాయ చర్యలను తమ శాఖ చేపట్టినట్లు అమెరికా పర్యటనలో ఉన్న రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌లో తెలిపారు. ఆయన వెంటనే బయలుదేరి రానున్నారు.

బాధితుల ఆక్రోశం..
ఈ దుర్ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన చిన్నారిని కోల్పోయిన ఓ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దసరా సమయంలో ఆ ప్రాంతంలో రైళ్లను నెమ్మదిగా నడపాలని తాము అధికారులను, స్థానిక నేతలను ఎప్పటి నుంచో కోరుతున్నామని ఓ స్థానికుడు పేర్కొన్నాడు. ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని వాపోయాడు. బాణసంచా పేలుడు మోతలో రైలు చప్పుడు తమకు వినిపించలేదని మరో వ్యక్తి చెప్పాడు. డ్రైవర్‌ హారన్‌ కొట్టలేదని ఓ సాక్షి ఆరోపించాడు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.