ఛత్తీస్‌గఢ్‌లో ప్రకాశం వాసుల దుర్మరణం
వలస కుటుంబాల్లో ఘోర విషాదం
రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి
అందరూ బంధువులే
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు...
ఈనాడు డిజిటల్‌- ఒంగోలు, న్యూస్‌టుడే- కనిగిరి, హనుమంతునిపాడు: రాష్ట్రంకాని రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం వారి బతుకులను చిన్నాభిన్నం చేసింది. వలసవెళ్లిన వారు దైవదర్శనానికి వెళ్లి వస్తూ మృత్యువాత పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌, నాగపూర్‌ జాతీయ రహదారిలో దుర్గి జిల్లా సోమని గ్రామం వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ వాహనంలో 13 మంది ఉండగా డ్రైవరు సహా 10 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది రాష్ట్రవాసులే. వారంతా బంధువులే. కూలీనాలీ చేసుకునే శ్రమజీవులే. మృతుల్లో కొందరు సొంత ప్రాంతాల నుంచి 4  దశాబ్దాల కిందట వలస వెళ్లిన వారు. అక్కడి స్టీల్‌ప్లాంట్‌లో సహాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారిని చూసేందుకు స్వగ్రామాల నుంచి ఇటీవల వెళ్లిన బంధువులు మరికొందరు మరణించారు.
కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, సీయస్‌పురం, కొండపి నియోజకవర్గలోని మర్రిపూడి మండలాలకు చెందిన తొమ్మిది చనిపోయినవారిలో ఉన్నారు. వీరిలో హనుమంతునిపాడు మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన పాపాబత్తిన పెదమంగయ్య (27), భార్య వెంకటలక్ష్మి(25), పెదమంగయ్య బాబాయి కుమార్తె మనీషా (18), వెలిగండ్ల మండలం పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు(18), సీయస్‌ పురం మండలం వెంగనగుంటకు చెందిన పోకూరి ఆదినారాయణ (40), భార్య సావిత్రి(32), మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన భార్యాభర్తలు ఆండ్ర విజయ్‌ కుమార్‌ (35), నాగమణి(30) మృతి చెందారు. కారు డ్రైవరు అక్కడి వ్యక్తేనని సమాచారం. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బాబు, వెంకటేశ్వర్లు, మహేంద్రలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు వారి బంధువులు తరలి వెళ్లారు.

తెల్లవారుజామున ఘోరం
అందరూ బంధుగణం. డొంగార్‌గఢ్‌లో అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు శనివారం ప్రైవేటు వాహనం మాట్లాడుకుని బయలుదేరారు. దైవదర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. రాయ్‌పూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సును తప్పించే క్రమంలో వీరి వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదస్థలం రక్తసిక్తమైంది.  సాటి తెలుగువారు, స్టీల్‌ప్లాంట్‌లో పని చేస్తున్న సహ కార్మికులు ప్రమాద స్థలానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

పొట్టకూటి కోసం దశాబ్దాల కిందట వెళ్లి...
కనిగిరి ప్రాంతమంటే వలసలకు మారుపేరు.  1970లలో ఇక్కడి నుంచి చాలా మంది  ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. అక్కడ మహిళలు స్టీల్‌ప్లాంట్‌లో సహాయ కార్మికులుగా పనిచేస్తుండగా, పురుషులు రాడ్డు వెల్డింగ్‌ పనులు చేస్తుంటారు. అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. సొంత ప్రాంతాలకు రాకపోకలు తక్కువగానే ఉంటాయి. ఇక్కడి నుంచి వాళ్ల బంధువులు ఏటా ఓసారి వెళ్లి వస్తుంటారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు
మృతుల్లో పాపాబత్తిని పెద్దమంగయ్య కుటుంబంలో ముగ్గురు అసువులు బాయడంతో స్వస్థలంలో వారి తండ్రి చిన్న రోశయ్య, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాద సమాచారం మృతుల బంధువులకు ఆదివారం మధ్యాహ్నానికి తెలియడంతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నరోశయ్య తమ్ముడు బాలయ్య కుటుంబం దశాబ్దం కిందటే భిలాయ్‌ వెళ్లి అక్కడే స్థిరపడింది. ఇటీవల వారింట్లో ఓ శుభకార్యం ఉండటంతో చిన్న రోశయ్య కుమారుడు, కోడలు అక్కడికి వెళ్లారు. ప్రమాదంలో వారిద్దరితో పాటు బాలయ్య కుమార్తె మనీషా అసువులు బాసింది. కుమారుడు మహేంద్ర కోమాలో ఉన్నాడు.

పెళ్లయి ఏడాది కాకుండానే దంపతుల మృత్యువాత
మర్రిపూడి మండలానికి చెందిన ఆండ్ర విజయ్‌, నాగమణి ఈ ప్రమాదంలో అసువులు బాశారు. వీరికి వివాహమై ఏడాది కూడా కాలేదు. విజయ్‌ మామ కుటుంబం 40ఏళ్ల కిందటే భిలాయ్‌కి వలస వెళ్లింది. అక్కడికి 12 కి.మీ. దూరంలోని సరోజ్‌ గ్రామంలో వారు నివసిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.