నైపుణ్యాన్నే చూద్దాం
ఇంజినీరింగ్‌లో ఓపెన్‌ బుక్‌  పరీక్షల విధానం?
ఏఐసీటీఈ నియమించిన  నిపుణుల కమిటీ సిఫారసు
ప్రశ్న పత్రాల రూపకల్పన  సమగ్రంగా మారాలని సూచన
అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించిన ఏఐసీటీఈ
ఈనాడు - హైదరాబాద్‌
ఇంజినీరింగ్‌లో చూచిరాత(ఓపెన్‌ బుక్‌) పరీక్షల విధానం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నియమించిన కమిటీ సిఫారసులు అమలైతే మాత్రం ఇదే జరుగుతుంది. విద్యార్థులారా? అలాగని ఎగిరి గంతేయకండి. రాసేది చూసే అయినా..అందులోనూ సృజనను..సమస్యలకు చక్కని..మెరుగైన పరిష్కారాన్ని చూపాల్సి ఉంటుంది సుమా!

పరీక్షల విధానంలో సంస్కరణలు తేవాలని నిర్ణయించిన  అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఇటీవలే నలుగురు నిపుణుల కమిటీని నియమించింది. కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య రామకృష్ణ చల్లా కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన చండీగఢ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐటీటీటీఆర్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది. ఒత్తిడిని తగ్గించడంతోపాటు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పరీక్షించేందుకు ‘ఓపన్‌ బుక్‌ పరీక్షల విధానమే’ సరైనదని సిఫారసు చేసింది. అందుకు అనుగుణంగా ప్రశ్నపత్రావళి రూపకల్పన, కేటాయించాల్సిన సమయాల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా సూచించింది. ఈ నివేదికను ఏఐసీటీఈ, కేంద్ర మానవ వనరుల శాఖ పరిశీలిస్తున్నాయి. నివేదికను వెబ్‌సైట్లో ఉంచిన
ఏఐసీటీఈ ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించింది. ఈ నెల 20వ తేదీలోపు పంపాలని కోరింది.

జ్ఞాపకశక్తిని కాదు.. నిపుణతనే పరీక్షిద్దాం
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పరీక్షల విధానం విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరీక్షించేలా ఉంది. ఇంజినీరింగ్‌ పరీక్షలూ అదే రీతిలో ఉన్నాయి. పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు కూడా ప్రాంగణ నియామకాల సమయంలో సమస్యలను పరిష్కరించే పరీక్షల్లో కళ్లు తేలేస్తున్నారు. అందుకే ఆయా పరిశ్రమల ప్రతినిధులు సైతం నైపుణ్యాల లేమిని ప్రస్థావిస్తున్నారు. అదే విషయాన్ని నివేదికలో చెప్పిన కమిటీ ‘పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానం మంచిదని’ సిఫారసుల్లో పేర్కొంది.

కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలివీ
* బట్టీ కొట్టడాన్ని ప్రోత్సహించడం ప్రస్తుత పరీక్షల విధానంలో ప్రధాన లోపం. ఇది పరిజ్ఞానాన్ని పైపైన పరీక్షించేలా ఉంది. ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానంతో దీన్ని అధికమించవచ్చు.
* ఈ విధానంలో జరిపే పరీక్షల్లోనూ నిర్దేశిత సమయంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. అయితే పాఠ్య, నోటు పుస్తకాలు, ఆమోదం పొందిన విద్యాసామగ్రి(రీసోర్స్‌ మెటీరియల్‌)ని విద్యార్థులు పరీక్ష గదిలోకి తీసుకెళ్లవచ్చు.
* జ్ఞాపకశక్తికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది.
* అడిగే ప్రశ్నలు సమస్యల పరిష్కారం, పరిజ్ఞానాన్ని పరీక్షించే, కేవలం విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని రాసేవిగా కాకుండా.. సృజనాత్మకతంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి రాసేలా ఉండాలి. ముఖ్యంగా ఆయా ప్రశ్నలు ప్రస్తుతం ఉన్న (రియల్‌ టైమ్‌) సమస్యలను పరిష్కరించేలా ఉండాలి.
* ఆ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయడం లేదా సూచించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకు అనుగుణంగా సాధారణ పరీక్షల కంటే ఎక్కువ సమయం కేటాయించడమో లేదా రెండు లేదా మూడు విషయాంశాలను (కాన్సెప్ట్‌) పరీక్షించేలా తక్కువ ప్రశ్నలు ఇవ్వడమో చేయాలి.

మూల్యాంకనం ఓ సవాల్‌
ఐఐటీల్లో మూడు, నాలుగో సంవత్సరాల విద్యార్థులకు కొంత మంది ఆచార్యులు ఓపెన్‌ బుక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులుంటే ఇబ్బంది లేదు. ఇంజినీరింగ్‌లో ఒక్కో వర్సిటీ కింద వందల కళాశాలలున్నాయి. ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానంలో ఇచ్చే ప్రశ్నలకు కచ్చితమైన జవాబు ఉండదు. ఒక్కో విద్యార్థి ఒక్కో తరహాలో సమాధానం రాయొచ్చు..లేదా సమస్యకు పరిష్కారం చూపవచ్చు. అందువల్ల జవాబుపత్రాల మూల్యాంకనం ఓ సవాల్‌గా మారుతుంది. మార్కులు ఇవ్వడమనేది మూల్యాంకనంలో పాల్గొనే అధ్యాపకుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఈ విధానం మాత్రం మంచిదే.

- ఆచార్య కామాక్షిప్రసాద్‌, సంచాలకుడు, పరీక్షల విభాగం, జేఎన్‌టీయూహెచ్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.