దోమలపై డ్రోన్‌ యుద్ధం
రెండేళ్లలో పరిపూర్ణ పరిష్కారం
పల్లెలకు ఆధునిక వైద్య సేవలు
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
‘ఆరోగ్య ఉత్సవం’లో 5 కొత్త కార్యక్రమాలకు శ్రీకారం
అవినీతిపరుల మాటలు నమ్మొద్దని పిలుపు
విశాఖలో మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ
ఈనాడు - విశాఖపట్నం
దోమల్ని నివారించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌గా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో దోమల నివారణకు పరిపూర్ణ పరిష్కారాన్ని చూపెడతామని చెప్పారు. దీనికోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని తెస్తామని, తద్వారా అనేక వ్యాధులకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా నివారణలో భాగంగా డ్రోన్‌లను ఉపయోగించే పద్ధతుల్నీ అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లెలకూ ఆధునాతన వైద్య సేవలందేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో ఆరోగ్యశాఖ, మెడ్‌టెక్‌ జోన్‌ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా జరుగుతున్న ‘ఆరోగ్య ఉత్సవం’ ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా 5 కొత్త పథకాల్ని ప్రారంభించారు. ఈ- సబ్‌సెంటర్లు, ఆర్‌ఎఫ్‌ఐడీ, ముఖ్యమంత్రి బాల సురక్ష యోజన పథకాల్ని ప్రారంభించడంతోపాటు ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను, ఏపీ మెడికల్‌ రీహాబిలిటేషన్‌ టూరిజంను (అమ్రిత్‌) ఇదే వేదిక నుంచే ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖులందరితో, కంపెనీ యజమానులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడారు. ‘ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వసతిని కల్పిస్తున్నాం. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టెలీ మెడిసిన్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. గూగుల్‌ సాంకేతికతతో ఒక గ్రామం నుంచి 20 కి.మీ. దూరం వరకూ ఎలాంటి తీగల్లేకుండా కేవలం బాండ్‌విడ్త్‌ ద్వారానే టెలీ మెడిసిన్‌ సేవలు అందేలా చేస్తున్నాం. 3 ఐటీడీఏల్లో 40 సబ్‌సెంటర్లను ఈ- సబ్‌సెంటర్లుగా మార్చాం. ఆ కేంద్రాలకు రోగులొచ్చాక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులు మాట్లాడతారు. ఆన్‌లైన్‌లో మందుల వివరాలు నమోదు చేస్తారు. వెండింగ్‌ మిషన్‌ ద్వారా  ఆటోమేటిక్‌గా మందులు తీసుకునే విధానం అమలులో ఉంటుంది. గురువారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలువురితో ఆయన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.
పుట్టిన బిడ్డలు తప్పిపోకుండా..
‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయిన తర్వాత పసిపిల్లలు మాయమవడం, తారుమారు అవడం చూస్తుంటాం. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా పిల్లలు వేరుకాకుండా చూసే సాంకేతికతను తీసుకొస్తున్నాం. తల్లీబిడ్డను ఎవరూ వేరు చేయనంత జాగ్రత్తలు ఇందులో ఉంటాయి. 0-18ఏళ్ల గ్రామీణ పిల్లల్లో చిన్న వయసులో లోపాల్ని గుర్తించేందుకు ముఖ్యమంత్రి బాల సురక్ష కార్యక్రమం కింద 450 సంచార ఆరోగ్య బృందాల్ని ప్రవేశ పెడుతున్నాం. ప్రతి వాహనంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉంటూ అన్ని గ్రామాల్లోని పిల్లల్లో లోపాల్ని వీరు గుర్తిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది’ అని సీఎం చెప్పారు.

పీపీపీ విధానం మీద నమ్మకముంది
‘రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం దగ్గర అన్ని సాంకేతికతలు ఉండవు. ఇలాంటి వెలితిని భర్తీ చేసేందుకు పీపీపీ విధానం ద్వారా ఇతర సంస్థల్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం. పేదలకు మెరుగైన, అధునాతన సేవలందించేందుకు ఈ పీపీపీ విధానం ఎంతో మేలనే నమ్మకం నాకుంది. ప్రభుత్వ నిధులద్వారా ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్లై విదేశాలకెళ్లి స్థిరపడే వైద్యుల మీద మీ అభిప్రాయమేంటని నన్ను చాలామంది అడిగారు. నేనిచ్చే సమాధానం ఒక్కటే. ఆరోగ్యశాఖలో దేశంలో ఎక్కడాలేని సాంకేతికతతో, వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకెళ్తోంది. ఇప్పుడు పీపీపీ విధానంలో చాలా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. విదేశాలకు వెళ్లినవారు కూడా వచ్చి సేవలందించే స్థాయిని మనం కల్పిస్తాం. ఇది జరుగుతుంది’ అని చంద్రబాబు వెల్లడించారు. డ్రోన్‌ల ద్వారా మారుమూల గ్రామాలకు రక్తాన్ని చేరవేసే ఆలోచనలూ రావడం అభినందనీయమని చెప్పారు.

అంతకు ముందుగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా రాష్ట్రంలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆ పథకం సీఈవో ఇందూ భూషణ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య ఉత్సవం సందర్భంగా నిర్వహించిన హాకథాన్‌, డాటాథాన్‌లో విజేతలకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఆరోగ్యశాఖలో అత్యుత్తమ సేవలందించిన వారికి సీఎం అవార్డుల్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రాష్ట్ర ఆరోగ్యశాఖ సలహాదారు జితేంద్ర శర్మ, ప్రపంచ బ్యాంకు సీనియర్‌ హెల్త్‌ స్పెషలిస్టు షీనా ఛాబ్రా, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి పెడెన్‌, యూఎన్‌డీపీ నేషనల్‌ ప్రోగ్రాం మేనేజర్‌ మనీష్‌ పంత్‌, కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి అరుణ్‌ సింఘాల్‌ తదితరులు ప్రసంగించారు.

భీమిలిలో సౌరఫలకాల తయారీ పరిశ్రమ ప్రారంభం
విశాఖ శివారు భీమిలిలోని డెక్కతిపాలెంలో గాన్కో ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఏటా 60 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న సౌర ఫలకాలను ఈ సంస్థ తయారు చేయనుంది. రూ.29.67 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సౌర ఫలకాల తయారీ కంపెనీని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కితాబిచ్చారు. ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చేలా మంత్రి గంటా చొరవ తీసుకున్నారు. సంస్థ ఎండీ గాడు అప్పల నాయుడు భీమిలి నియోజకవర్గ పార్టీ కీలక నాయకుడు.

అవినీతిపరులు.. కొత్తగా వచ్చినవారి మాటలు నమ్మొద్దు
‘పేదలంతా ఆనందంగా ఉండాలి. మీ ఆదాయం పెరగాలి. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా సేవా కార్యక్రమాల్లో కోత ఉండకూడదు. మీకు అండగా ఉంటా. సమస్యలన్నీ పరిష్కరిస్తా. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులు. కొత్తగా వచ్చిన వ్యక్తులు మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరేమన్నా ప్రభుత్వానికి అండగా ఉంటామని మీరు గట్టిగా శపథం చేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో గురువారం సాయంత్రం జరిగిన మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదిక ప్రాంగణంలో 87 కౌంటర్లు ఏర్పాటుచేసి 9,054 మందికి 9,16,999 చదరపు గజాల రూ.2,220 కోట్ల విలువైన స్థలాన్ని అందించారు. విశాఖలో మూడు విడతలుగా 60,965 మందికి రూ. 10,600 కోట్ల విలువైన 44,26,764 చదరపు గజాల స్థలాన్ని అందించినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ భూములపై తక్షణమే లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ ఫోన్లు చేస్తామని.. అధికారులు, అనధికారులు పైసా తీసుకున్నట్లు తెలిసినా కఠిన చర్యలు తప్పవని.. పేదోళ్ల పొట్టకొడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో 3.55 లక్షల మందికి పట్టాలిచ్చామని, మరో 28,137 పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీలకు 1.14 లక్షల ఎకరాల్లో పట్టాలిచ్చి పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. రానున్న కాలంలో 10వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, పోలీసులతో సహా ఇతర ఉద్యోగాలు మరో 10వేలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో 3వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.