Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

టాలీవుడ్‌

‘దేవదాస్‌’కి సీక్వెల్‌ చేయాలని ఉంది!
నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌ నిర్మాత. ఈనెల 27న విడుదల కాబోతోంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘1953లో ‘దేవదాసు’ సినిమా విడుదలైంది. ఇప్పుడు మళ్లీ ‘దేవదాస్‌’ వస్తోంది. నాన్నగారు బతికే ఉన్నారు అనడానికి ఇదొక్కటి చాలు. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు. మూడు కారణాల వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా. కథ, అశ్వనీదత్‌, నానిల కోసమే ఈ సినిమా చేశా. కథ విన్నప్పుడే ఈ పాత్రలో పెద్దగా నటించాల్సిన అవసరం లేదు అనిపించింది. మరో పాత్రలో నాని సరిగ్గా సరిపోతాడనిపించింది. చాలా గొప్ప చిత్రాలు తీశారు అశ్వనీదత్‌. నాతో ఇది అయిదో చిత్రం. సినిమా అంటే ఆయనకు ప్రాణం. దానికోసం ఏమైనా చేస్తారు. నేను అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. గట్టిగా అనుకుంటే మరీ జరుగుతాయి. మల్టీస్టారర్‌ చేస్తే నానితో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. నాని డైలాగులు వింటే ఓ పాట విన్నట్టు ఉంటుంది. ‘దేవదాస్‌’కి సీక్వెల్‌ చేయాలనిపిస్తుంది. చాలా కాలం తరవాత ఓ అందమైన కథానాయికని ఆకాంక్ష రూపంలో నా కోసం తీసుకొచ్చారు. రష్మిక త్వరలో స్టార్‌ అవుతుంది. శ్రీరామ్‌ చాలా బద్ధకస్తుడు. మా అందరికంటే చిన్నోడు. ‘పొద్దుటే లేచి సెట్‌కి రా..’ అంటూ తిట్టేవాణ్ని. మా ఇగోల్ని చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. శ్యాం తన కెమెరాతో మ్యాజిక్‌ చేశాడు. మణిశర్మ పాటలు బాగున్నాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్‌ చూసి సమంత చాలా బాధ పడింది. సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది అన్నాను. ‘యూ టర్న్‌ సినిమాకి రివ్యూస్‌ బాగున్నాయి.. వసూళ్లు తక్కువ’ అని మళ్లీ బాధ పడింది. మరుసటి రోజుకి వసూళ్లూ పెరిగాయి. సెప్టెంబరు నెల మాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు 27న ‘దేవదాస్‌’ పండగలా రాబోతోంద’’న్నారు.
సమంత మాట్లాడుతూ ‘‘మావయ్య మజాకాని ఈ సినిమాలో చూస్తారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరవాత అంత అసక్తిగా ఎదురుచూసిన సినిమా ఇదే. నాని చాలా మంచి నటుడు. తెరపై ఎవరిని ముందు చూడాలో అర్థం కావడం లేదు.
‘మహానటీ’ తరవాత మరో మంచి విజయం వైజయంతీ మూవీస్‌కి దక్కుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ ‘‘దత్తుగారు నన్ను పరిచయం చేసి 20 ఏళ్లయిందంటే      ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఇరవై ఏళ్లు భరించి, ఇంకా నాకు సినిమాలిస్తున్నారు. చాలా రోజుల తరవాత నాగార్జున గారి సినిమాకి పనిచేశాను. దర్శకుడు చాలా ప్రతిభావంతుడు. కష్టపడ్డాడ’’న్నారు. ‘‘21 ఏళ్ల తరవాత నాగార్జున వయసు ఆగిపోయిందనిపిస్తుంది. అశ్వనీదత్‌ ‘మహానటి’ రూపంలో పరిశ్రమకు ఓ పుస్తకం అందించారు. మా కాలేజీ రోజులన్నీ మణిశర్మగారి పాటలు వినడంతోనే వెళ్లిపోయాయ’’న్నారు వంశీ పైడిపల్లి. క్రిష్‌ మాట్లాడుతూ ‘‘ఈ కథ యేడాదిన్నర క్రితం విన్నా. చాలా మంచి కథ. దాన్ని అంతకంటే చక్కగా శ్రీరామ్‌ ఆదిత్య తీసుంటాడని నమ్ముతున్నా’’ అన్నారు. అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘‘మా సంస్థలో అత్యధిక చిత్రాలు చేసిన కథానాయకుడు నాగార్జున. ఇది ఆయనతో అయిదవ చిత్రం. నాని నాకు మంచి మిత్రుడు. నాగ్‌ అశ్విన్‌, వంశీ పైడిపల్లి, క్రిష్‌.. ఇలా యువ దర్శకులు వచ్చి పరిశ్రమ ట్రెండ్‌ మార్చారు. రాబోయేకాలంలో మరిన్ని మంచి చిత్రాలొస్తాయి’’ అన్నారు. అఖిల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో హిట్టుకొట్టబోతున్నామని గట్టిగా అనిపిస్తోంది. నాని, నాన్నగారు కలసి ఓ మంచి విజయాన్ని సాధిస్తారు. నాని ఎప్పటి నుంచో తెలుసు.   కలిసిన వెంటనే నచ్చేస్తాడు. తన ఈజ్‌ని చూస్తే అసూయగా అనిపిస్తుంద’’న్నారు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ ‘‘ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం... ఈ సినిమా. వైజయంతీ మూవీస్‌లో ఓ సినిమా చేయడం ఓ గౌరవం. అయిదేళ్ల క్రితం నాగార్జునగారితో ఓ ఫొటో దిగాను. ఇప్పుడు సినిమా తీశాను. నాని నాకు సోదరుడితో సమానం. నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. నాని మాట్లాడుతూ ‘‘నాగ్‌ సార్‌ సినిమాలెప్పుడు చూసినా ఆయనేం తింటాడు? ఏం తాగుతాడు? అనే చర్చించుకునేవాళ్లం. అందుకే సెట్లో ఆయన ఏం తింటున్నారో గమనించేవాడ్ని. మనసులో ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి అంత అందంగా ఉంటారనిపించింది. ఈ సినిమా చూసి నాగ్‌ సార్‌ నాతో చెప్పిన మాటలు చాలు. ఈ సినిమాతో నేను సాధించేసినట్టే. మా టీమ్‌లో అందరికంటే చిన్నోడు ఆదిత్య. ఇంత పెద్ద సినిమా పూర్తి చేయడం ఎంతో కష్టం. ఈ సినిమా పూర్తి చేయడంలోనే పెద్ద విజయం సాధించాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అమల, సుశాంత్‌, పి.నాగసుశీల, టి.సుబ్బరామిరెడ్డి, నాగ్‌ అశ్విన్‌, ఆకాంక్ష సింగ్‌, రష్మిక, అజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.