తాజా వార్త‌లు

గవర్నర్‌ నిర్ణయం తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ
గవర్నర్‌ను కలిసిన జేడీఎస్‌, కాంగ్రెస్‌ పక్ష నేతలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జేడీఎస్‌ తమను ఆహ్వానించాలంటూ గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చేపనిలో పడింది. కాంగ్రెస్‌ నేతలు, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం లోపలికి వెళ్లేందుకు అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితితో తొలుత కాసేపు కుమారస్వామి రాజ్‌భవన్‌ గేటు వద్ద వేచిచూశారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతతో కలిసి గవర్నర్‌ను కలిశారు. అంనతరం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు గవర్నర్‌కు లేఖను సమర్పించామన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఐక్యంగా ఉన్నట్టు గవర్నర్‌కు స్పష్టంచేశామన్నారు. దీంతోపాటు బలనిరూపణకు అవసరమైన పత్రాలను ఆయనకు సమర్పించినట్టు చెప్పారు. గవర్నర్‌ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని తాము నమ్ముతున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్‌ నిర్ణయం తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారిస్తామని కుమారస్వామి స్పష్టంచేశారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ పక్షాన గెలిచినవారంతా తమతోనే ఉంటారన్నారు.

రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామన్నారు: పరమేశ్వర్‌
గవర్నర్‌ను కలిసిన అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పక్షాల నేతలు గవర్నర్‌ను కలిసినట్టు చెప్పారు. జేడీఎస్‌కు తాము మద్దతు ఇస్తున్నట్టు గవర్నర్‌కు తెలిపామన్నారు. న్యాయనిపుణుల్ని సంప్రదిస్తామని గవర్నర్‌ తమతో అన్నారని, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్టే తమకూ అవకాశం కల్పించాలని పరమేశ్వర్‌ కోరారు.

జేడీఎస్‌ ఎమ్మెల్యేల నిరసన
గవర్నర్‌ను కలవడంపై ముందస్తు సమాచారం ఇచ్చామని జేడీఎస్‌ నేతలు చెబుతున్నారు. అయినా తమను లోపలికి పంపించకపోవడంతో జేడీఎస్‌ శ్రేణులు రాజ్‌భవన్‌ వద్ద నిరసనకు దిగాయి.

మరోవైపు, ఈ ఉదయం నుంచీ రాజ్‌భవన్‌ కేంద్రంగా కన్నడ రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ (112 సీట్లు) రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అప్రమత్తమై జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతిస్తామని ప్రకటించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం రెండు పార్టీల శాసనసభాపక్షాల సమావేశాలు బెంగళూరులో వేర్వేరుగా జరిగాయి. ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన సమావేశంలో కుమారస్వామిని జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీనేతగా ఎన్నుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రతిపాదించారు. ఈ రెండు పార్టీలతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కలిపి మొత్తం తమకు 117 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నిన్న రెండు పార్టీల నేతలు సిద్ధరామయ్య, కుమారస్వామి గవర్నర్‌ను కలిసిన అనంతరం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉదయం శాసనసభాపక్ష సమావేశాలు జరిగే సమయానికి కలకలం రేగింది. జేడీఎస్‌ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్‌ శాసన సభాపక్ష సమావేశంలో తీర్మానంపై 72మంది మాత్రమే సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. అంతా సంతకాలు చేయలేదు, దీనిపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. అందుబాటులో లేరని చెబుతోంది. అందరి సంతకాలతో పనిలేదని, బలనిరూపణ జరిగేది అసెంబ్లీలో గనక తమ ఎమ్మెల్యేలంతా మద్దతు జేడీఎస్‌కు తెలుపుతామని స్పష్టంచేసింది. తెలుపుతామని చెబుతోంది. ఇప్పటికే జెడీఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన నేతలు రాజ్‌భవన్‌కు వచ్చినప్పటికీ వారిని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం తమ వద్ద ఉందని బలనిరూపణ చేసుకుంటామని వారు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని

ఈటీవీ ప్రోమోస్‌

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu Internet Division.
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers