తాజా వార్త‌లు

గవర్నర్‌ కాదంటే సుప్రీం కోర్టుకు వెళతాం!

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వెల్లడైనా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో 78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌, 38 స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌తో జట్టుకట్టింది. రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించాలన్న కాంక్షతో ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలాతో కుమార్‌ స్వామి, సిద్ధరామయ్య భేటీ ఆయ్యారు. ప్రస్తుతం 116ఎమ్మెల్యేల బలం ఉందని గవర్నర్‌కు వివరించారు. అయితే భాజపా కూడా గవర్నర్‌ కలిసి బలనిరూపణకు రెండు రోజులు సమయం కావల్సిందిగా కోరారు. ఇందుకు గవర్నర్‌ కూడా అనుమతించారు.

దీంతో నిన్నటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్‌ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ...‘రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాల్సిందిగా భాజపా వైపు గవర్నర్‌ మొగ్గితే తదనంతర చర్యలు తీసుకుంటాం. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతాం. కూటమిగా ఏర్పడిన ఏ రెండు పార్టీలైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అధికారం మన రాజ్యాంగం కల్పిస్తోంది. గోవా, మణిపూర్‌లో భాజపా అదే పనిచేసింది. ఇప్పుడు మేం చేస్తుంటే అధికార దాహం అంటున్నారు. బల నిరూపణకు రెండు రోజుల సమయం కావాలని అడిగిన యడ్యూరప్ప... 17న ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతివ్వాల్సిందిగా గవర్నర్‌కు లేఖ రాశారు. అధికార దాహం ఉంది ఎవరికి?. బలనిరూపణకు మేం సిద్ధం. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని భాజపాను గవర్నర్‌ ఆదేశిస్తే ఆ మరుక్షణం ఆయనపై చట్టపరంగా వెళతాం’ అని తెలిపారు.

మంగళవారం వెలువడిన ఫలితాలలో భాజపా 104స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 78, జేడీ(ఎస్‌)38స్థానాలు గెలుచుకున్నాయి.

మరిన్ని

ఈటీవీ ప్రోమోస్‌

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu Internet Division.
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers