తాజా వార్త‌లు

‘ఆపరేషన్‌ కమల’ గుర్తుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌ :కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మెజార్టీకి సమీపంలో వచ్చి ఆగిపోయిన భాజపాకు రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి ప్రభుత్వ ఏర్పాటుకు మొదట అవకాశం ఇవ్వాలి. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమకు మెజార్టీ ఉందని తమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌చేస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలకు తమ వైపునకు తిప్పుకునేందుకు ఆపరేషన్‌ కమల ద్వారా భాజపా యత్నిస్తోందని జేడీఎస్‌నేత కుమారస్వామి ఆరోపించారు.తమ పార్టీ ఎమ్మెల్యేలను భారీగా నగదు, పదవులు ఆశ చూపి ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆపరేషన్‌ కమల’ అంటే..

గతంలో 2008 ఎన్నికల అనంతరం భాజపా అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఎన్నికల్లో భాజపా 110 స్థానాలను సాధించి మెజార్టీకి దగ్గరలో నిలిచిపోయింది. అయితే సీఎం పగ్గాలు చేపట్టిన యడ్యూరప్ప ‘ఆపరేషన్‌ కమల’ ను ప్రారంభించారు. దీని ప్రకారం జనతాదళ్‌ ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన దాదాపు 20 మంది శాసనసభ్యులను తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించారు. దీంతో విపక్ష సభ్యల సంఖ్య తక్కువ కావడంతో భాజపాదే మెజార్టీగా ఉండేది. రాజీనామా చేసిన సభ్యులకు అనంతరం భాజపా సభ్యత్వం ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. అనేకమంది ఇలా తిరిగి ఎన్నిక కావడంతో భాజపాకు మెజార్టీకి అవసరమైన సభ్యులు సమకూరారు. రాజకీయంగా యడ్యూరప్ప ఈ విధానం ద్వారా ప్రతిపక్షాలపై పైచేయి సాధించారు. అయితే ఈ దఫా 104 స్థానాలు మాత్రమే గెలవడంతో జనతాదళ్‌ ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి కనీసం ఎనిమిది సభ్యులు సభకు హాజరుకాకుండా ఉంటే భాజపా ప్రభుత్వం విశ్వాసపరీక్షలో గట్టెక్కే అవకాశముంది.

కుమార హెచ్చరికలు...

2008 తరహాలో ఆపరేషన్‌ కమలను ఈ సారి ప్రయోగిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కుమారస్వామి హెచ్చరించారు. భాజపా సభ్యులు కూడా అనేకమంది తమ కూటమిలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రకటించారు.

అయితే కమలనాథులు అప్పట్లోనే ఆపరేషన్‌ కమలను పూర్తిగా సమర్థించుకున్నారు. 2004 ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయాక జేడీఎస్‌, భాజపాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు చెరో 20 నెలలు అధికారంలో ఉండాలి. మొదట కుమారస్వామి అధికారంలో ఉన్నారు. అనంతరం ఒప్పందం ప్రకారం భాజపా నేత యడ్యూరప్పకు అధికారం అప్పగించాలి. అయితే ఒప్పందాన్ని జేడీఎస్‌ గౌరవించకపోవడంతో యడ్యూరప్ప ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వం కొన్నిరోజుల్లోనే కూలిపోయింది. దీనికి ప్రతీకారంగానే యడ్యూరప్ప 2008లో ఆపరేషన్‌ కమలను ప్రారంభించి జనతాదళ్‌ ఎస్‌ను తీవ్రంగా దెబ్బతీసినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా. దాదాపు దశాబ్దం తరువాత ఆపరేషన్‌ కమల రెండోదశను ప్రారంభిస్తారని ఆరోపణలు వస్తున్న దృష్ట్యా కమలనాధులు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించనున్నారో వేచి చూడాల్సిందే.

మరిన్ని

ఈటీవీ ప్రోమోస్‌

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu Internet Division.
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers