సోదరుడినే చంపేశారు!
close

తాజావార్తలు


సోదరుడినే చంపేశారు!
కుమార్తెలకూ బెదిరింపులు
‘ఈనాడు’ వార్తతో వెలుగులోకి..
ఎనిమిది మందిపై కేసు నమోదు, ఇద్దరి అరెస్టు
పంచపాండవుల్లా ఉండాల్సిన అన్నదమ్ములు.. ఆస్తికోసం గొడవపడ్డారు. కర్రలతో కొట్టి, రాళ్లతో గాయపరిచి అత్యంత పాశవికంగా వారిలో ఒకరిని చంపేశారు. నోరు విప్పితే మీకూ ఇదే గతి అంటూ అమాయకులైన హతుడి కూతుళ్లను బెదిరించారు. రెండెకరాల భూమి కోసం జరిగిన ఈ పోరులో చివరికి నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ కొండకించంగి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఈనెల 10న ‘ఈనాడు’ మినీలో ప్రచురితమైన వార్తతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు  కేసును ఛేదించారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితులైన ఇద్దర్ని గురువారం అరెస్టు చేశారు.

గూడెంకొత్తవీధి:  కొండకించంగికి చెందిన గెమ్మెలి లక్ష్మణరావుకు ఐదుగురు కుమారులు. ఆస్తిని ఐదుగురికీ సమానంగా పంచి తన కోసం రెండు ఎకరాలు మిగుల్చుకున్నారు. చనిపోయేవరకు నాలుగో కుమారుడు రాజారావు వద్దే ఉన్నారు. తండ్రి వాటా రెండు ఎకరాల భూమిని రాజారావు సాగు చేసేవారు. అనారోగ్యంతో లక్ష్మణరావు చనిపోయిన తర్వాతా ఆ భూమిని రాజారావే సాగు చేస్తూ వస్తున్నారు. తండ్రి వాటాగా ఉన్న భూమిపై తమకూ హక్కు ఉందని, సమానంగా అందరికీ పంచాలంటూ మిగతా వారు అతనితో తరచూ గొడవకు దిగేవారు. ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకరైన జమ్మన్న కుమారుడు ఇటీవల చనిపోగా.. రాజారావు చేతబడి చేయించాడన్న అనుమానంతో అతనితో గొడవకు దిగారు. మరో సోదరుడు నాగేశ్వరరావు అనారోగ్యం బారినపడటంతో రాజారావే చేతబడి చేయించాడంటూ మరోసారి వాగ్వాదానికి వచ్చారు. రాజారావును హతమారిస్తే ఏ గొడవా ఉండదని, అతడికి నలుగురూ కుమార్తెలే కావడంతో తండ్రి వాటా రెండు ఎకరాల భూమి కూడా తమకే చెందుతుందని నలుగురూ పన్నాగం పన్నారు. ఈనెల 6న నలుగురితోపాటు వారి కుటుంబాలకే చెందిన రాజుబాబు, చంటిబాబు, బుజ్జిబాబు, సత్తిబాబు, రాము, చిన్నారావుతో కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేసి రాజారావును హతమార్చారు. ఈవిషయం బయటకు చెబితే మిమ్మల్నీ చంపేస్తామని బెదిరించడంతో రాజారావు కుమార్తెలు మిన్నకుండిపోయారు. హత్య ఘటనపై ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. దీంతో ధైర్యం తెచ్చుకున్న మృతుడి కుమార్తె బాలామణి ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నారాయణరావు చెప్పారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి జమ్మన్న, నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.