latest breaking telugu news
close

తాజావార్తలు

యూఏఈలో వీసా గడువు ముగిసిన వారికి ఊరట

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీసా కాల పరిమితి చెల్లిన తర్వాత కూడా యూఏఈలో నివాసం ఉంటున్న, విదేశీయులకు కాస్త ఊరట లభించింది. వీసా గడువు ముగిసిన వారు మరో మూడు నెలల పాటు అక్కడ ఉండేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 ఆగస్టు 2018 నుంచి 31 అక్టోబర్‌ 2018 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఆ దేశంలో నివాసం ఉంటూ, వీసా కాల పరిమితి చెల్లిన వారు ఈ 90 రోజుల్లోపు వీసా గడువును పొడిగించుకోవాలని లేదా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

విదేశీయులు యూఏఈ నివాస చట్టాన్ని(రెసిడెన్సీ లా) ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో ‘ప్రొటెక్టింగ్‌ యువర్‌ సెల్ఫ్‌ వయా రెక్టిఫైయింగ్‌ యువర్‌ స్టేటస్‌’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే వీసా గడువు ముగిసిన విదేశీయులకు మూడు నెలలు సమయాన్ని ఇచ్చారు. అక్రమంగా నివసిస్తున్న విదేశీయులందరూ ఈ క్షమాభిక్షను ఉపయోగించుకుని జరిమానా బారిన పడకుండా తమల్ని తాము కాపాడుకోవాల్సిందిగా యూఏఈ ఆదేశించింది.

వీసా గడువు ముగిసిన వారిని కఠినంగా శిక్షించకుండా, జరిమానాలు విధించకుండా ఇలా క్షమాభిక్ష పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2007లో 3,41,958 మంది విదేశీయులకు క్షమాభిక్ష పెట్టారు. ఇందులో 95,259మంది అక్కడే స్థిరపడ్డారు. 60,000 మంది విదేశీయులు యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నారన్న కారణంతో 2013లో ఇదే విధంగా 60రోజుల పాటు క్షమాభిక్ష విధానాన్ని అమలు చేశారు. దీంతోపాటు 2003, 1996లోనూ క్షమాశిక్ష పెట్టారు.

యూఏఈ ప్రవేశపెట్టిన ఈ విధానంపై వివిధ దేశాల దౌత్య కార్యాలయాల నుంచి యూఏఈకి ప్రశంసలు లభించాయి. యూఏఈ నిర్ణయం సంతోషించదగ్గ పరిణామం అని బంగ్లాదేశ్‌ రాయబారి మహమ్మద్‌ ఇమ్రాన్‌, శ్రీలంక కాన్సులేట్‌ జనరల్ చరిత యతోగొద, ఫిలిప్పైన్స్‌ రాయబారి రొవేనా పాంగిలినన్‌, నేపాల్‌ రాయబారి సాగర్‌ ప్రసాద్‌ ఫుయాల్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

అయితే అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదేశంలోకి అక్రమంగా ప్రవేశించారని భారత్‌కు చెందిన సుమారు 94మందిని అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.