latest breaking telugu news
close

తాజావార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9PM

1.సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11మంది మృతి చెందారు. రాజీవ్‌ రహదారిపై సికింద్రాబాద్‌ నుంచి మంచిర్యాల వెళుతున్న రాజధాని బస్సు అదుపుతప్పి ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొని బోల్తాపడింది. దీంతో ఆ లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటుకొని ఎదురుగా వస్తున్న క్వాలీస్‌ను, మరో కంటైనర్‌ లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రెండు లారీల మధ్య క్వాలీస్‌ వాహనం నలిగిపోయింది.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

2. ప్రధాని మోదీ నాయకత్వంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే కేంద్రంలో పాలనాపగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. మోదీ మాట్లాడుతూ...‘ కటక్‌ నాకెంతో ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడి నుంచి నేను ప్రారంభించిన ప్రతి పనీ విజయవంతమైంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

3. ఉత్తర, దక్షిణకొరియాల అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, మూన్‌ జే ఇన్‌ శనివారం అనూహ్యంగా భేటీ అయ్యారు. ఈ మేరకు మూన్‌ కార్యాలయం వెల్లడించింది. కిమ్‌తో సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరూ అత్యవసరంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఉభయ కొరియాల సరిహద్దులోని గ్రామంలో కిమ్‌, మూన్‌ సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి చర్చ జరిగింది. ట్రంప్‌ సమావేశాన్ని రద్దు చేసిన నేపథ్యంలో తర్వాత జరగబోయే పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

4. విజయవాడలో ఆదివారం నుంచి జరగనున్న మహానాడులో 34 కీలక తీర్మానాలు చేసేందుకు తెదేపా సమాయత్తమవుతోంది. వీటిలో ఏపీకి సంబంధించిన 22 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 8 తీర్మానాలు, ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఉన్నాయి. చివరి రోజు కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయాలపై ఈ మహానాడులో చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఆవశ్యకతను రాజకీయ తీర్మానంలో పొందుపరిచే అవకాశం ఉంది. రాష్ట్రం కోసం జాతీయస్థాయి రాజకీయం అనే పంథాలో ఈ తీర్మానం ఉండవచ్చని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఇక మహానాడు కోసం దాదాపు 2వేల మంది వలంటీర్లు కష్టపడుతున్నారు. భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

5. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ పనితీరుకు ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఇచ్చారు. నాలుగేళ్ల మోదీ పాలనకు ఆయన ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ఇచ్చారు. ‘వ్యవసాయం రంగంలో విఫలమయ్యారు. విదేశీ విధానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందారు. చమురు ధరల నియంత్రణలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగాల కల్పన పనితీరులో అనుత్తీర్ణులయ్యారు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

6. ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టబడిన ప్రాంతమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు ఆయన నిరాహార దీక్షను విరమించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాను రాజకీయ లబ్దికోసం దీక్ష చేయలేదని ఆయన తెలిపారు. తనకు రాజకీయ లబ్ధి కావాలనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చేవాడిని కాదని తెలిపారు.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

7. ఇటీవల ఫేస్‌బుక్‌లో యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పేటీఎం యూజర్ల డేటా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్తున్నట్లు ఓ స్టింగ్‌ ఆపరేషన్ ద్వారా వెల్లడైంది. కశ్మీర్‌ లోయలోని ఆందోళనకారుల పేటీఎం వివరాలను అందజేయాలంటూ పీఎంవో ఆ సంస్థను కోరినట్లు తెలుస్తోంది. ‘ఆపరేషన్‌-136 II’ పేరుతో కోబ్రాపోస్ట్‌ ఓ స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఆందోళనకారుల ఖాతాల వివరాల కోసం పీఎంవో కార్యాలయం నుంచి కొందరు పేటీఎంను సంప్రదించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ సోదరుడు అజయ్‌ శర్మ చెప్పినట్లు కోబ్రాపోస్ట్‌ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

8. ట్రంప్‌ తాజాగా ఆటోమొబైల్‌ రంగంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా దిగుమతి చేసుకునే వాహనాలు, విడిభాగాలపై విచారణ జరపాలని ఇటీవల అమెరికా వాణిజ్యశాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ ఒత్తిడికి లోనుకానుంది. దీనిపై ది ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏసీఎంఏ) స్పందించింది. భారత్‌ను 2017-18లో 2.7బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలు ఎగుమతి అయ్యాయని పేర్కొంది. వీటిల్లో 22శాతం అమెరికాకు చేరాయని తెలిపింది.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

9. అమెరికాలోని హవాయి ద్వీపంలోని కిలోవా అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ప్రవాహం అక్కడి నివాసాలను నామరూపాలు లేకుండా చేస్తోంది. దాంతో అధికారులు స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని హెచ్చరించారు. నిప్పులు వెదజల్లే లావా కారణంగా ఇప్పటికే ఇళ్లతో సహా 82 నిర్మాణాలు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. మే 3 నుంచి ఉగ్రరూపం చూపిస్తోన్నఅగ్నిపర్వతం కారణంగా 2,200 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

10. 2016లో నగ్రోటా ఆర్మీ క్యాంప్‌మీద జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోన్న జైషే మహ్మద్ ఉగ్రవాది మునీర్-ఉల్-హసన్‌ ఖాద్రీని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. జమ్మూలోని కుప్వారాకు చెందిన అతడు..మిలిటెంట్లు దాడి చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాడని ఎన్‌ఐఏ పేర్కొంది. 2016, నవంబరు 29న నగ్రోటాలోని ఆర్మీ శిబిరంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఏడుగురు సైనికులు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు.

మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.