latest breaking telugu news
close

తాజావార్తలు

మద్యంలో విషం కలిపి చంపేశారు!
ప్రియుడితో కలిసి భార్తను అంతమొందించిన భార్య
అదే మద్యం తాగి చావుబతుకుల్లో ఉన్న మృతుడి తండ్రి
నిందితులను రిమాండ్‌కి తరలించిన పోలీసులు
పూర్ణామార్కెట్‌, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి మద్యంలో విషం కలిపి భర్తను పథకం ప్రకారం హత్య చేసిన నిందితురాలిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సంయుక్త కమిషనర్‌-2 టి.రవికుమార్‌మూర్తి ఆ వివరాలను వెల్లడించారు. కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌లో కొండా అప్పన్న (32) ఈ నెల 18న మద్యం తాగి మృతి చెందాడని, అతనితోపాటు తాగిన తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నాడని దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదైందన్నారు. ఈ కేసులోని విషయాలు నమ్మశక్యంగా లేకపోవడంతో లోతుగా విచారణ చేశామన్నారు. కొత్త కోణాలు వెలుగు చూడటంతో అప్పన్న తాగిన మద్యాన్ని ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి పంపామని, అందులో విషం కలిసినట్టు నిర్ధరణ అయ్యిందన్నారు. దీంతో మృతుడి బంధువులను, చుట్టు పక్కల వారిని విచారించామని తెలిపారు. మృతుడి భార్య నాగమణి(27).. కుర్మన్నపాలెం, అప్పికొండ కాలనీకి చెందిన వారధి కుమార్‌(22)తో సాగిస్తోన్న వివాహేతర సంబంధం బయటపడిందన్నారు. కొన్నాళ్ల క్రితం ఇరువురి కుటుంబాలకు ఏర్పడిన పరిచయం ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. తనతో నిత్యం గొడవలు పడుతోన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని నాగమణి నిర్ణయించుకుందన్నారు. దీనికి కుమార్‌తో కలిసి కుట్ర పన్నిందన్నారు. తొలుత మన్యంలోని వేర్లు తీసుకొచ్చి అంతం చేయడానికి ఆలోచించారన్నారు. అది ఖర్చుతో కూడుకోవడంతో విరమించుకున్నారన్నారు. కుమార్‌ గతంలో జంతువులను వేటాడే పనిచేసేవాడని, దీనికి బంగారం పనిచేసే తన స్నేహితుడు జగదీష్‌ వద్ద సైనేడ్‌ని ఉపయోగించేవాడన్నారు. అప్పన్నపై విషాన్ని ప్రయోగించి అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నారని, దాన్ని మద్యంలో కలపడానికి పథకం రచించాడన్నారు. ఈ నెల 17న అప్పన్న మద్యం సీసాను కొనుగోలు చేసి దుకాణంలోనే తాగడం గమనించిన నిందితుడు కుమార్‌ అలాంటి మరో సీసాను కొనుగోలు చేశాడన్నారు. మర్నాడు అప్పన్న మద్యం కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం చూసిన నిందితుడు తాను విషం కలిపిన సీసాను నాగమణికిచ్చాడన్నారు. ఇంటికొచ్చిన అప్పన్న తాను తెచ్చిన సీసాను పక్కనపెట్టి తండ్రిని కూడా తాగడానికి పిలిచాడన్నారు. అదను చూసుకుని నాగమణి సీసాలను మార్చేసిందని చెప్పారు. విషం కలిసిన మద్యం తాగి అప్పన్న నోటి నుంచి నురగలు కక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఆ మద్యం తాగిన అతని తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని వివరించారు. చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారన్నారు. నేరానికి పాల్పడిన ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలిస్తున్నామని వివరించారు.

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.