latest breaking telugu news
close

తాజావార్తలు

అర్జెంటీనా ఇంటికేనా?

మాస్కో: వరల్డ్‌కప్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన అర్జెంటీనాకు నాకౌట్‌ అవకాశాలు దాదాపుగా దూరమైనట్లే కనిపిస్తున్నాయి. గ్రూపు-డిలో మిగతా మ్యాచ్‌ల ఫలితం మీదనే వరల్డ్‌కప్‌లో ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ దశలోనే అతి కష్టం మీద గట్టెక్కిన అర్జెంటీనా.. మొదటి నుంచి మెస్సిపైనే అతిగా ఆధారపడుతూ వచ్చింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. పసికూన ఐస్‌లాండ్‌ను‌ సైతం నిలువరించలేక డ్రాతో గట్టెక్కింది. ఆ మ్యాచ్‌లో 1-1తో స్కోరు సమానమైన దశలో 63నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ అవకాశం వచ్చింది. కానీ, మెస్సి ఐస్‌లాండ్‌ గోల్‌కీపర్‌ హేన్స్‌ డిఫెన్స్‌ను ఛేదించలేక విఫలమయ్యాడు. అయితే పేరుకు మాత్రం మ్యాచ్‌ డ్రాగా ముగిసినా, అర్జెంటీనా పసికూన ఐస్‌లాండ్‌ను ఓడించలేకపోయిందంటూ యావత్‌ ప్రపంచమంతా విమర్శలు గుప్పించింది.

ఇక గురువారం అర్ధరాత్రి క్రొయేషియాతో మ్యాచ్‌లోనూ అర్జెంటీనాకు ఊహించని విధంగా ఓటమి ఎదురైంది. మ్యాచ్‌ ఆరంభం నుంచి బంతి అర్జెంటీనా నియంత్రణలో ఉన్నా.. ప్రథమార్ధంలో ఒక్క గోల్‌ నమోదు కాలేదు. ఆ తర్వాత మొదలైన ద్వితీయార్ధంలో అర్జెంటీనాకు నిరాశ తప్పలేదు. ద్వితీయార్ధంలో అద్భుతంగా పుంజుకున్న క్రొయేషియా 3-0తో ఏకంగా మ్యాచ్‌ను కైవసం చేసుకొని అర్జెంటీనాకు షాక్‌ ఇచ్చింది. ఫలితంగా ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండు విజయాలతో క్రొయేషియా నాకౌట్‌కు చేరుకోగా, అర్జెంటీనా మాత్రం గ్రూపులో మూడో స్థానానికి దిగజారింది.

ఇక అర్జెంటీనా నాకౌట్‌కు చేరాలంటే గ్రూపు-డిలో మిగతా మ్యాచ్‌లపైనే ఆధారపడాలి. అర్జెంటీనా గెలవాలని కోరుకుంటూ అభిమానులు ఈవిధంగా లెక్కకడుతున్నారు.

1. ముందుగా ఐస్‌లాండ్‌, నైజీరియా మధ్య మ్యాచ్‌ డ్రా కావాలి. దీంతో ఇరు జట్లకు చెరో పాయింటు వస్తుంది. అప్పుడు ఐస్‌లాండ్‌కు‌ రెండు పాయింట్లు రాగా, అర్జెంటీనా, నైజీరియా చెరో పాయింట్‌తో సమానంగా నిలుస్తాయి.

2. గ్రూపు దశలో క్రొయేషియా తన చివరి మ్యాచ్‌ను ఐస్‌లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో క్రొయేషియా గెలిస్తే ఐస్‌లాండ్‌ రెండు పాయింట్లతోనే ఉంటుంది. ఒకవేళ డ్రాగా ముగిస్తే ఐస్‌లాండ్‌కు ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరతాయి.

3. ఇక అర్జెంటీనా గ్రూపు దశలో తన చివరి మ్యాచ్‌ను నైజీరియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా తప్పక గెలవాల్సిందే. గెలిస్తే అర్జెంటీనా ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చి చేరతాయి. దీంతో అర్జెంటీనా నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

ఈ క్రమంలో ఐస్‌లాండ్‌గానీ, నైజీరియా గానీ ఏ ఒక్కమ్యాచ్‌ గెలిచినా అర్జెంటీనా ఇక ఇంటి ముఖం పట్టాల్సిందే. మరి ఇలాంటి క్లిష్ట సమయంలో అర్జెంటీనా నాకౌట్‌కు చేరుతుందో లేదో చూడాలి.

ఈ జూన్‌ 21 కలిసి రాలేదు..
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ చరిత్రలో జూన్‌ 21కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ తేదీన అర్జెంటీనా ఇంతకుముందు ఐదు ప్రపంచకప్‌ మ్యాచ్‌లాడింది. అందులో నాల్గింట గెలవగా, ఒక్కమ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది. కానీ ఈ సారి వరల్డ్‌కప్‌లో మాత్రం ఆ మంత్రం పనిచేయలేదు. క్రొయేషియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 3-0తో దారుణంగా ఓటమి చవిచూసింది.

అర్జెంటీనా తాజా ఓటమితో అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. యావత్‌ ప్రపంచమంతటా లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్‌ ఆటగాడు మెస్సీ ఈసారి ఆశించిన విధంగా రాణించలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఒక్కగోల్‌ కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో చివరి మ్యాచ్‌లోనైనా మెరుస్తాడో లేదో చూడాలి.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.