latest breaking telugu news
close

తాజావార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో భజరంగ్‌ పునియా సత్తాచాటి భారత్‌కు పసిడి పతకం అందించాడు. జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో పునియా.. మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆసియాడ్‌-2018లో పురుషుల, మహిళల కబడ్డీ జట్లు భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాయి. మహిళల జట్టు జపాన్‌ను మట్టికరిపించగా పురుషుల జట్టు బంగ్లాదేశ్‌, శ్రీలంకను ఆదివారం చిత్తుచిత్తు చేశాయి. గత ఆసియా క్రీడల్లో భారత జట్లు రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. భారత పురుషుల జట్టు మొదట గ్రూప్‌-ఏ గేమ్‌-1లో బంగ్లాదేశ్‌ను 50-21తో చిత్తు చేసింది. ఆ తర్వాతి పోరులో శ్రీలంకను 44-28 తేడాతో మట్టికరిపించింది. రెండు మ్యాచుల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్‌ తరహాలో ప్రదర్శన చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు ఇతర కనీస అవసరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ ల సూచనలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. సహాయచర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆంధ్రప్రదేశ్‌లో ద్విముఖ పోటీ పోయి త్రిముఖ పోటీ రావటమే రాజకీయాల్లో మార్పునకు నిదర్శనమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడ సిద్దార్ద ఆడిటోరియంలో జరిగిన సదస్సులో వామపక్ష నేతలు మధు, కె.రామకృష్ణ, సహా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. జనసేన, సీపీఎం, సీపీఐ కలసి ఉమ్మడి ఉద్యమాలు చేపట్టనున్నాయని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా చర్యలు ఆరంభించింది. ఇందులో భాగంగా నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఏడువేల మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని అక్కడి నుంచి ఉపసంహరించి ఛత్తీస్‌గఢ్‌ తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పశ్చిమ్‌ బంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఏడువేల మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని చత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌కు తరలించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాను తమ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆలింగనం చేసుకున్న నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ విమర్శలు చేశారు. సిద్ధూ అలా చేయడం సరైంది కాదని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘రోజూ మన జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. మన జవాన్లు నిత్యం అమరులు అవుతున్నారన్న నిజాన్ని ఆ వ్యక్తి (సిద్ధూ) అర్థం చేసుకోవాలి. మా సొంత ప్రాంతంలో కొన్ని నెలల క్రితమే ఒక మేజర్‌, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జనరల్ బజ్వాయే పాక్‌ చీఫ్‌గా ఉన్నారు. కాల్పులు జరపమని ఆర్మీ అధినేతే ఆదేశాలు ఇస్తారు’ అని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. ఆ దేశానికి చెందిన లోంబక్‌ ద్వీపంలో ఆదివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. యూఎస్‌ జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు వారాల క్రితం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించి 460 మంది మరణించిన సంగతి తెలిసిందే. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో లోంబక్ ప్రాంతంలోని ప్రజలు భయాందోళలకు గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వరద బాధితులకు పలు రాష్ట్రాలు ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం ప్రకటించాయి. పశ్చిమ్‌బంగా తరఫున తాము రూ.10 కోట్ల నిధులను అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు ప్రకటించారు. ‘వరదలతో కేరళ ప్రజలు పడుతోన్న కష్టాలు నా హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఇటువంటి సమయంలో వరద బాధిత ప్రజలకు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్లు ప్రకటిస్తున్నాం’ అని మమతా బెనర్జీ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాకిస్థాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ 21 మందితో తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో 16 మంది మంత్రులు కాగా.. మిగిలిన ఐదుగురు పాక్‌ ప్రధానికి సలహాదారులుగా వ్యవహరించనున్నారు. వీరిలో 12 మంది గతంలో పాక్‌ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పాలనలో మంత్రులుగా పనిచేసినవారే కావడం గమనార్హం. పాక్‌ విదేశాంగ మంత్రిగా షా మహమూద్‌ ఖురేషీ, రక్షణ మంత్రిగా పెర్వైజ్‌ ఖట్టక్‌, ఆర్థిక మంత్రిగా అసద్‌ ఉమర్‌లు వ్యవహరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు కసితో కనిపిస్తున్నారు. కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దీంతో 128 పరుగులకే ఆతిథ్య జట్టు 9 వికెట్లు చేజార్చుకుంది. బౌలర్లంతా సమిష్టిగా చెలరేగుతున్నారు. హార్దిక్‌ పాండ్యా 5, ఇషాంత్ శర్మ 2, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా చెరో వికెట్‌ పడగొట్టారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.