కాంగ్రెస్‌ ప్రజాగర్జన
close

తాజావార్తలు

కాంగ్రెస్‌ ప్రజాగర్జన
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి
ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి లక్షన్నర మందిని తరలించేందుకు కాంగ్రెస్‌ నాయకులు కసరత్తు చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి నలభై వేల మందిని తరలించేందుకు మండలి విపక్షనేత షబ్బీర్‌అలీ స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎల్లారెడ్డి నుంచి సైతం నలభై వేల మంది, జుక్కల్‌, బాన్సువాడల నుంచి ఇరవై వేల చొప్పున, జిల్లాకు సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి ముప్పై వేల మందిని, నిజామాబాద్‌ గ్రామీణం, అర్బన్‌, ఆర్మూర్‌, బాల్కొండల నుంచి పదిహేను వేల మంది చొప్పున తరలించేలా ఏర్పాట్లు చేసుకొన్నారు.

యువత, మహిళలకు ప్రాధాన్యం
సభకు ప్రధానంగా యువత, మహిళలను తరలించేలా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీడీకార్మికులకు ఎన్‌డీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీతో జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ వారిని సభకు వచ్చేలా చైతన్య పరుస్తున్నారు. తెరాస ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందిన తీరును వివరిస్తున్నారు. ఇలా ఈ రెండు వర్గాలు అధిక మొత్తంలో పాల్గొనేలా చూస్తున్నారు. ఈ సభలో రాహుల్‌గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీకార్మికులు, యువత ఉపాధికి చేపట్టనున్న అంశాలను వివరిస్తారని నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంతో పాటు ఉమ్మడి జిల్లాలోని సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం అంతా షామియాను ఏర్పాటు చేశారు. కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో ఏర్పాటు చేస్తున్నందున సభకు వచ్చే జనాలకోసం మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లను పంపిణీ చేస్తామని నాయకులు చెబుతున్నారు.

రాహుల్‌ పర్యటన ఇలా
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భైంసా బహిరంగసభకు
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియానికి
మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక వాహనంలో సభాస్థలికి
3.45 గంటల వరకు సభలో ప్రసంగం
తర్వాత హైదరాబాద్‌కు పయనం

ఇంకా ఎవరెవరు వస్తారు?
మరో హెలికాప్టర్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సీ. కుంతియా, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టివిక్రమార్క సభకు హాజరుకానున్నారు. వీరితోపాటు రాష్ట్ర ముఖ్యనేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విజయశాంతి, సబితాఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డీకే.అరుణ తదితరులు సైతం సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.

భారీ బందోబస్తు
రాహుల్‌ సభకు జిల్లాపోలీసులతో పాటు ఎస్పీజీ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుంచి ఎస్పీజీ అధికారులు జిల్లాకేంద్రంలోనే మకాం వేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఆరు సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌కు వందమంది సిబ్బందిని నియమించారు. సుమారు 1,453 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

భద్రతలో పాల్గొంటున్న వారి వివరాలు
జిల్లా ఎస్పీ
* నిజామాబాద్‌ సీపీ
* ఆరుగురు అడిషనల్‌ ఎస్పీలు
* డీఎస్పీలు: 12
* సీఐలు: 40
* ఎస్‌ఐలు: 88
* ఏఎస్‌ఐలు: 162
* కానిస్టేబుళ్లు: 691
* హోంగార్డులు: 235
* మహిళా పోలీసులు: 77
* ఆర్మ్‌డ్‌ ఫోర్సు సిబ్బంది: 140

ఏర్పాట్లను పరిశీలించిన కుంతియా
పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు కుంతియా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి జిల్లాకేంద్రానికి చేరుకొన్నారు. మండలి విపక్షనేత షబ్బీర్‌అలీతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. ఎటువంటి సమస్యలు లేకుంగా సభ సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు రాహుల్‌ పర్యటన కోసం ఆతృతగా ఉన్నారని అన్నారు.

ఎస్పీజీ అధీనంలోకి మైదానం
రాహుల్‌ హెలికాప్టర్‌ లాండింగ్‌ అయ్యే ఇందిరాగాంధీ మైదానాన్ని ఎస్పీజీ అధికారులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొన్నారు. కాంగ్రెస్‌ నేతలను సైతం అక్కడికి అనుమతించడం లేదు. మైదానం నుంచి సభాస్థలికి రాహుల్‌ పయనించే మార్గంలో ప్రతి అణువును తనిఖీ చేస్తున్నారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ను పలు మార్గాల్లో దారిమళ్లిస్తున్నారు.

పోలీసులకు విడిది
సభ భద్రత కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసుల కోసం గంజి వర్తక సంఘం కళాశాలలో విడిది ఏర్పాటు చేశారు.

స్వాగతానికి ఏర్పాట్లు
ఇందిరాగాంధీ మైదానంలో రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. షబ్బీర్‌అలీతో పాటు తొమ్మిది నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు అధినేతకు బొకేలు ఇచ్చేందుకు పాసుల కోసం ఎస్పీజీకి దరఖాస్తు చేసుకొన్నారు.


జనరల్‌

రాజకీయం

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.