ప్ర‌త్యేక క‌థ‌నం

మందుల మంట!
త్వరలో పెరగనున్న ధరలు
కొన్ని మందులకు కొరతా రావచ్చు!
ముడి ఔషధాలే అసలు సమస్య
  చైనాపై ఆధారపడటమే కారణం
  తగ్గుతున్న దిగుమతులతో అతలాకుతలమవుతున్న కంపెనీలు
ఎ వరైనా సరే.. జ్వరం వస్తే పారాసెటమాల్‌ వేసుకుంటాం. నీరసంగా ఉంటే త్వరగా కోలుకోటానికి విటమిన్‌ మాత్రలు వాడతాం. గుండెల్లో మంటగా అనిపిస్తే... పొద్దున్నే రాంటిడిన్‌ గోళీ ఒకటి పుచ్చుకుంటాం. ఇలా ఎప్పుడన్నా వేసుకునే మందులే కాదు.. మధుమేహం, హైబీపీ వంటివాటిని అదుపులో పెట్టుకునేందుకు నిత్యం ఎన్నో రకాల ఔషధాలు వాడేస్తుంటాం. వీటన్నింటి కోసం నెలవారీ కొంత బడ్జెట్‌ కూడా పెట్టుకుంటాం. అయితే.. మనం వేసుకునే ఈ బడ్జెట్‌లు తల్లకిందులైపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. సమీప భవిష్యత్తులో ఈ మందుల ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అంతేకాదు, వీటికి కొరత కూడా రావచ్చు. ఎందుకోనని ఆశ్చర్యపోతున్నారా? దీనంతటికీ మూలం ‘చైనా’నే! అదెలాగో చదవండి..
ఈనాడు - హైదరాబాద్‌
చాలా మందుల తయారీకి అవసరమయ్యే ముడి రసాయనాలను మన ఔషధ కంపెనీలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ముడి మందులనే ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) అంటారు. ఔషధాల తయారీకి ఈ ముడి రసాయనాలే అత్యంత కీలకం. కానీ ఇటీవలి కాలంలో చైనా ఈ ముడి రసాయనాల తయారీని గణనీయంగా తగ్గించివేసింది. ఫలితంగా ఇప్పటికే ఎన్నో ముడి రసాయనాల ధరలు పెరిగిపోయాయి. ఈ పెరిగిన ధరలను ఔషధ కంపెనీలు ఇంత వరకూ వినియోగదారులపై మోపటం మొదలుపెట్టలేదు. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మందుల ధరలను పెరగకుండా అదుపు చేయటం చాలా కష్టమని ఔషధ పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. పైగా గిట్టుబాటు కాక కొన్ని ఔషధాల తయారీని పూర్తిగా నిలిపివేసే పరిస్థితి కూడా రావొచ్చు.
ఎందుకీ ఇబ్బంది?
మందుల తయారీలో చాలా దశలుంటాయి. ముఖ్యంగా ముడి రసాయన ఔషధాలను ఐదారు దశల్లో శుద్ధిచేసి, మలినాలను తొలగించి, ఆ తర్వాత వాటిని పాళ్ల ప్రకారం వాడుతూ బిళ్లలు, గొట్టాలు, అరుకుల వంటివి తయారు చేస్తారు. ఈ ముడి రసాయనాలకు మన దేశంలో 1994 వరకూ కూడా ఎలాంటి కొరతా ఉండేది కాదు. వీటిని మన దేశంలోనే తయారు చేసుకునే వాళ్లం. కానీ 1994 తర్వాత ఈ ముడి రసాయనాలను చైనా పెద్దఎత్తున తయారు చేసి, చాలా తక్కువ ఖర్చుకు మనకు అందించటం మొదలు పెట్టింది. వీటిని మనమే దేశీయంగా, సొంతగా తయారు చేసుకుంటే అయ్యే ఖర్చుకంటే చైనా నుంచి దిగుమతి చేసుకోవటమే చాలా చౌక అనే పరిస్థితి కల్పించింది. దీంతో దేశీయంగా ముడి ఔషధాల యూనిట్లకు ఆదరణ కొరవడి, చాలాచోట్ల అవి మూతబడిపోయాయి. వీటి స్థానంలో చైనా నుంచి పెద్దఎత్తున ‘బల్క్‌ ఔషధాల’ దిగుమతి మొదలైంది. ఇది ఎప్పటికైనా సమస్యే అవుతుందని అనుమానిస్తూనే ఉన్నారు. కానీ పరిష్కారం కోసం మాత్రం గట్టి ప్రయత్నం జరగలేదు. పరిస్థితి ఇలా ఉంటే.. ఇటీవల చైనా ఉన్నట్టుండి బల్క్‌ ఔషధాల తయారీని బాగా తగ్గించేసింది. ఆ దేశంలో పారిశ్రామిక కాలుష్యం విపరీతంగా పెరగటంతో కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో చాలా ఫ్యాక్టరీలు మూతబడిపోతున్నాయి. మరికొన్నింటిలో ఉత్పత్తి బాగా తగ్గించారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవలి కాలంలో బల్క్‌ ఔషధాలు తయారు చేసే యూనిట్లు ఆ దేశంలో వందల సంఖ్యలో మూతపడిపోయాయి. దీంతో ఒక్కసారిగా బల్క్‌ ఔషధాల తయారీ తగ్గిపోయి, వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఇదే మన మందుల పరిశ్రమల పాలిట పెను సమస్యగా పరిణమిస్తోంది.

* మందుల తయారీలో తప్పనిసరిగా అవసరమయ్యే బల్క్‌ ఔషధాలు 300 వరకూ ఉన్నాయి. వీటిలో కనీసం 50కి పైగా బల్క్‌ ఔషధాల కోసం మనదేశం పూర్తిగా చైనా మీదే ఆధారపడుతోంది. చైనా నుంచి అవి రాని పక్షంలో సంబంధిత మందులను మనం తయారు చేసుకోలేం.

* 2016-17లో మనదేశం రూ.18,372 కోట్ల విలువైన ముడి రసాయనాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో ఒక్క చైనా వాటానే రూ.12,254 కోట్లు!

ఈ మందులు మంటే..
పారాసెటమాల్‌ (అసిటమినోఫెన్‌), విటమిన్‌-సి, మల్టీ విటమిన్‌ మాత్రలు, సిప్రోఫ్లాక్సాసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌, గుండె జబ్బుకు వినియోగించే స్టాటిన్‌ రకం ఔషధాలకు సంబంధించిన ముడి ఔషధాల ధరలు గత కొద్దికాలంలో 50-100% పెరిగిపోయాయి. కొన్ని ముడి ఔషధాల ధరలు రోజుకోరకంగా మారిపోతున్నాయి.
కింకర్తవ్యం?
* దేశీయంగా బల్క్‌ ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకు తక్షణం చర్యలు చేపట్టటమే దీనికి పరిష్కారమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* చిన్న, మధ్యస్థాయి యూనిట్ల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు కల్పించి, సత్వర అనుమతులతో బల్క్‌ ఔషధాల తయారీని ప్రోత్సహించాలి.
* బల్క్‌ డ్రగ్స్‌ తయారీకి ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయటం ఒక పరిష్కారం. అక్కడ కాలుష్య నియంత్రణ కోసం ఉమ్మడి సౌకర్యాలతో పాటు, సదుపాయాలన్నీ కల్పించాలి.
* ఈ ప్రయత్నాలు మొదలు పెట్టిన నాటి నుంచి ఫలితాలు కనిపించటానికి కనీసం ఏడాది, రెండేళ్లకు పైనే పడుతుంది. ఈ లోపు బల్క్‌ ఔషధాల కొరత నివారణకు తాత్కాలిక చర్యలపై దృష్టి సారించాలి.
అక్కడ ఎన్నో యూనిట్లు  మూసివేస్తున్నారు...
చైనాలో ముడి ఔషధ రసాయనాలు తయారు చేసే యూనిట్లు మూతపడుతుండటం మనకే కాదు, అన్ని దేశాలకూ సమస్యే. కాకపోతే మన కంపెనీలు చైనాపై మరీ ఎక్కువగా ఆధారపడటం పెను సమస్యగా తయారవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి ఔషధ కంపెనీలన్నీ ఈ భారాన్ని వినియోగదార్లకు బదలాయించటం మొదలుపెడతాయి. మన దేశంలో బల్క్‌ ఔషధ తయారీని ప్రోత్సహించటం ఒక్కటే దీనికి పరిష్కారం.
- రాజీవ్‌ నన్నపనేని, ఎండీ అండ్‌ సీఈఓ, నాట్కో ఫార్మా లిమిటెడ్‌
కటోచ్‌ కమిటీ సిఫార్సులు  అమలు చేయాలి...
ముడి రసాయనాలకు కొరత రావొచ్చనే విషయాన్ని కేంద్రం ఎప్పుడో గుర్తించింది. దీనికి పరిష్కార మార్గాలు సూచించేందుకు వి.ఎం.కటోచ్‌ సారధ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయగా ఆ కమిటీ 2015లోనే తన నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అయిదారు ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ బల్క్‌ ఔషధాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలనేది ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో ముఖ్యమైనది. కానీ ఈ సిఫార్సులను కేంద్రం అమల్లోకి తేలేదు. ఇప్పటికైనా ఆ సిఫార్సులపై దృష్టి సారించాలి.
- డాక్టర్‌ అప్పాజీ, ఫార్మాగ్జిల్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌
పెట్రోల్‌, డీజిల్‌ కంటే పెద్ద సమస్య
ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ముడి ఔషధాల అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
- ఎం.నారాయణ రెడ్డి, బీడీఎంఏ అధ్యక్షుడు (ఎమిరిటస్‌), ఎండీ, విర్కో ల్యాబరేటరీస్‌
 

మరిన్ని

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.