ప్ర‌త్యేక క‌థ‌నం

నాలా.. నిర్లక్ష్యం చాలా..!
విస్తరణ పనులకు రూ.230 కోట్లు ఇచ్చిన సర్కారు
టెండర్ల అనంతరం రూ.165 కోట్ల పనులు గుత్తేదారులకు అప్పగింత
పూర్తిస్థాయిలో పనులు చేపట్టని గుత్తేదారులు
ముంపు ముప్పులో మహానగరం
అధికారుల నిర్లక్ష్యమే అసలు కారణం
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌ మహానగరంలో ప్రధాన నాలాల విస్తరణ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ప్రస్తుత వర్షాకాలంలో పలు కాలనీలు జలదిగ్బంధం అంచున ఉన్నాయి. ఈ కష్టాలను తప్పించేందుకు రాష్ట్రప్రభుత్వం రాజధానిలో కీలకమైన నాలాల విస్తరణకు 230 కోట్ల రూపాయలను కేటాయించింది. గత ఆర్నెల్లలో 10శాతం పనులు కూడా పూర్తి చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో పనులకు టెండర్లను పిలిచి గుత్తేదారులకు అప్పగించగా.. చాలావరకూ ప్రారంభం కాలేదు. కొన్ని పనులను గుత్తేదారులకు అప్పగించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు. మొత్తం ఒకేఒక్క పని పూర్తయిందని చెబుతున్నారు. మహానగరంలోని నాలాల అధ్వానస్థితి, విస్తరణ పనుల తీరుతెన్నులపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్‌లో దాదాపు 9వేల కిలోమీటర్ల పొడవున 290 నాలాలు ఉన్నాయి. ఇందులో 390 కిలోమీటర్ల మేర కీలకమైనవి. వీటిలో కొన్ని 200 అడుగుల వెడల్పులో ఉండేవి. గత కొన్నేళ్లుగా నాలాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. మొత్తం నాలాల వ్యవస్థను పూర్వస్థితికి తీసుకురావాలంటే దాదాపు రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన నాలాల్లో ఎక్కడైతే వర్షపునీరు ప్రవహించడానికి అడ్డంకులున్నాయో అలాంటి వాటిని తొలిదశ కింద విస్తరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వీటికి నిధులను మంజూరు చేయించారు. ఈపనులకు రూ.230 కోట్లు కేటాయిస్తే రూ.165.29 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిల్చారు. మొత్తం పనులను 46 భాగాలుగా చేసి 8 నెలల కింద టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో 33 పనులను గుత్తేదారులకు అప్పగించారు. మిగిలినవి చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. పనులను చేజిక్కించుకున్న గుత్తేదారులు గత ఆర్నెల్లుగా పనులు పూర్తి చేయలేకపోయారు. కొన్ని 5శాతం, మరికొన్ని పనులు 10శాతం మాత్రమే పూర్తయ్యాయి. 33 పనుల్లో 12 పనులను అసలు గుత్తేదారులు మొదలుపెట్టలేదు. టెండర్ల ప్రక్రియ అనంతరం.. ఆర్నెల్లకు పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఆయా పనుల పరిమాణాన్ని బట్టి ఆర్నెల్ల నుంచి ఏడాది వరకూ అధికారులు గడువిచ్చారు. ఇందులో చాలావరకూ గడువు దాటిపోయాయి. అయినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. నగరంలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో ఏ విపత్తు ముంచుకొస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నాలాల విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

380 భవనాలు కూల్చివేశాం
కొన్నిచోట్ల నాలాలపై ఉన్న ఆక్రమణ భవనాలను తొలగించపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయడానికి అవరోధంగా ఉందని గుత్తేదారులు చెబుతున్నారని, అది వాస్తవం కాదని నగర ప్రణాళికా విభాగం చెబుతోంది. మొత్తం 777 భవనాలను కూల్చివేయాల్సి ఉండగా పనులు వేగంగా జరగడానికి ముఖ్య ప్రాంతాల్లోని 380 భవనాలను కూల్చివేశామని నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. మరో 120 భవనాల కూల్చివేత పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. కూల్చినచోట పనులు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు.

పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం
నగరంలో నాలాల విస్తరణ పనులు పెద్తఎత్తున చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు నాలాల్లో యంత్రాలను దింపి పనులు చేయించడం వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యాయి. గత నెల రోజుల్లో పనులు ఊపందుకున్నాయి. వీలైనంతమేర పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
- శ్రీధర్‌, ఈఎన్‌సీ, జీహెచ్‌ఎంసీ
ఇదీ కారణం
హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి ప్రాంతాల పరిధి కిందకు వచ్చే బల్దియా పశ్చిమ మండలంలో 16 పనులను ఒకే గుత్తేదారు దక్కించుకున్నారు. అన్నిచోట్ల ఏకకాలంలో పనులు చేపట్టాలంటే కనీసం 16 పొక్లెయిన్లు, యంత్రాలు, కూలీలు అవసరం. సంబంధిత గుత్తేదారు దగ్గర అన్నిచోట్లా పనిచేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఇలానే ఇతరచోట్ల గుత్తేదారులు దక్కించుకున్న పనులను చేపట్టడం లేదు. నాలాలోకి దిగి పనులను చేయాలని.. మురుగునీరు ప్రవాహం ఉంది కాబట్టి వేగంగా చేపట్టలేమని పేర్కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆక్రమణ భవనాలను తొలగించకపోవడమే కారణమని చెబుతున్నారు. కొన్నిచోట్ల భవనాలను తొలగించినా పనులు మాత్రం మొదలవ్వలేదు. ఇప్పటి వరకూ రూ.165 కోట్ల పనులకు రూ.20 కోట్ల విలువైన పనులు కూడా చేయలేదు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ
* కూకట్‌పల్లి ప్రాంతంలో చిన్న వర్షం వచ్చినా మియాపూర్‌ పరిసరాల్లోని దీప్తిశ్రీనగర్‌తో పాటు అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో పటేల్‌చెరువు-మదీనాగూడ నాలాను రూ.6 కోట్లతో విస్తరించాలని తలపెట్టి గుత్తేదారుకు అప్పగించారు. ఇప్పటివరకూ 20 శాతం కూడా విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాంతంలోని పలు ప్యాకేజీలను ఒకరే దక్కించుకున్నారని, ఆయన వేగంగా చేయడం లేదని స్థానిక నేతలు అంటున్నారు.

* ఐడియల్‌ చెరువు నుంచి మూసాపేట వరకు నాలా వర్షాకాలంలో పొంగడంతో సమీపంలోని జాతీయ రహదారిపై ముంపు నీరు పోటెత్తి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీని విస్తరణ పనులు అసలు ప్రారంభించలేదు. రూ.5.75 కోట్లతో అంచనాలు రూపొందించినా.. పనులు చేయడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదు.

* కాయిదమ్మకుంట-మదీనాగూడ మధ్య నాలాలను రూ.9 కోట్లతో విస్తరించాలనుకున్నా ఇక్కడ 15 శాతం పనులు కూడా పూర్తవ్వలేదు. గుత్తేదారు ఇక్కడ పెద్దఎత్తున పనులు చేయడానికి సన్నద్ధం కావడం లేదని చెబుతున్నారు. ఈర్లకుంట-దీప్తిశ్రీనగర్‌ నాలాను రూ.6 కోట్లతో విస్తరించాలని భావించినా అక్కడా ఇదేతంతు.

* ఆల్విన్‌కాలనీ-ధరణీనగర్‌ మధ్య నాలా పొంగడంతో ఇక్కడి కాలనీలు వారంపాటు ముంపులో నానుతున్నాయి. రూ.5.75 కోట్లతో పనులను గుత్తేదారుకు అప్పగిస్తే ఒకవైపు గోడ కట్టే పనిని మాత్రమే ఇంతవరకూ పూర్తి చేశారు. ఇదే తీరులో అనేక పనులు ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.