ప్ర‌త్యేక క‌థ‌నం

71 ఏళ్లలో 70కి..
ఈనాడు - హైదరాబాద్‌
రూపాయి బక్కచిక్కింది. టర్కీలో ఆర్థిక సంక్షోభం కాస్తా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందేమోనన్న భయాలతో రికార్డు కనిష్ఠానికి చేరింది. మంగళవారం 70.09 స్థాయికి చేరి ఆల్‌టైం కనిష్ఠాన్ని నమోదు చేసింది. టర్కీలో కొనసాగుతున్న కరెన్సీ సంక్షోభం అంతర్జాతీయ మదుపర్ల సెంటిమెంటును ఘోరంగా దెబ్బతీసింది. దీంతో మదుపర్లు డాలరును భద్రమైన కరెన్సీగా భావించి విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇది కాస్తా వర్థమాన దేశాలకు చెందిన కరెన్సీల పతనానికి దారితీసింది.

స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు పూర్తయిన తరుణంలో భారత కరెన్సీ రూపాయి (డాలర్‌తో పోలిస్తే) 70 స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయికి పతనం కావటం వివిధ వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేయనుంది.  దేశీయంగా వ్యాపారులు, విద్యార్ధులు, పర్యాటకులకు ఇది మింగుడు పడని పరిణామమే. గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం నాడు రూపాయి విలువ రూ.70.08కి పతనం అయింది. అంతర్జాతీయ పరిస్థితులు దీనికి ప్రధాన కారణం అయినప్పటికీ, దేశీయంగా కూడా కొన్ని మార్పులు ఇందుకు వీలుకల్పించినట్లు స్పష్టమవుతోంది. దీంతో యంత్రసామగ్రి, ఎలక్ట్రానిక్స్‌, ఇతర వస్తువుల దిగుమతులు ఖరీదైపోతాయి. విదేశీ విద్యకు వెళ్లదలచిన విద్యార్ధులు, వారి తల్లితండ్రులపై మోయలేనంత భారం పడుతుంది. విదేశీ పెట్టుబడులు క్షీణిస్తాయి. ఈ పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగితే మాంద్యం ముప్పు ఎదురుకావచ్చు. ఉద్యోగాల కల్పన తగ్గుతుంది. అన్ని రకాలుగా సమస్యలు తప్పవు. పరిస్థితులు అదుపు తప్పితే రూపాయి విలువ ఇక్కడితే ఆగకుండా... ఇంకా పతనం కావచ్చని, అదే జరిగితే ఇంకా కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనవరిలో 63.55, ఇప్పుడు 70.08: రూపాయి విలువ ఈ ఏడాదిలో భారీగా పతనం అయింది. మరీ ముఖ్యంగా గత మూడు నెలల్లో పతనం వేగవంతం అయినట్లు చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో డాలర్‌ విలువ రూ.63.55 ఉన్న విషయం గమనార్హం. ఇటీవల వరకూ కూడా 66-68 ఉండగా, గత వారం రోజుల పరిణామాలు రూపాయి రికార్డు స్థాయికి పతనం కావటానికి వీలుకల్పించాయి. ఈ ఏడాది డిసెంబరు వరకూ రూపాయి విలువ పెద్దగా పతనం కాదని, ప్రస్తుత స్థాయిల్లో స్థిరంగా ఉంటుందనే అభిప్రాయం గత వారం వరకూ ఉంది. మహా అయితే ఈ ఏడాది ఆఖరు నాటికి 70కి చేరుకుంటుందని నిపుణులు భావించారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడే ఆ స్థాయిని తాకింది. మళ్లీ ఇప్పటికిప్పుడు కోలుకోవటం సాధ్యం కాదనే అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఎందుకీ పతనం..
* టర్కీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది టర్కీ కరెన్సీ అయిన లీరా మారకం విలువ (డాలర్‌తో పోల్చితే...) దారుణంగా పతనం అయింది. రెండు రోజుల్లోనే దీని విలువ 19 శాతం క్షీణించింది. తాజాగా రూపాయి విలువ పడిపోవటానికి ఇది ప్రధాన కారణం.
* ఆర్థికంగా రెండు పెద్ద దేశాలైన అమెరికా, చైనా వర్తక యుద్ధంలో మునిగిపోవటం ప్రస్తుత సంక్షోభానికి మరొక కారణం. దీనివల్ల గత కొన్ని రోజులు పలు దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ప్రతి కరెన్సీ విలువ క్షీణించింది. అదే కోవలో రూపాయి విలువ తగ్గింది. ఇంకా ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ క్షీణతే తక్కువగా ఉంది.
* యూఎస్‌తో వర్తక యుద్ధంలో మునిగి తేలుతున్న చైనా, తనను తాను కాపాడుకునే చర్యల్లో భాగంగా తన కరెన్సీ అయిన యువాన్‌ విలువను భారీగా తగ్గిస్తోంది. అందువల్ల ఇటీవల కాలంలో యువాన్‌ మారకం విలువ (డాలర్‌తో పోల్చిప్పుడు....) బాగా క్షీణించింది. తద్వారా తన ఎగుమతులు చౌకగా మారి అంతర్జాతీయ వినియోగదార్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుందని చైనా ఎత్తుగడ. గతంలో ఇలా ఎన్నోసార్లు ఈ విధమైన ఎత్తుగడలను చైనా అనుసరించింది. ఇప్పుడూ అదే చేస్తోంది. దీనివల్ల మనదేశం వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడే పరిస్థితి ఉత్పన్నం అవుతోంది.
* అంతర్జాతీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఇటీవల కాలంలో మనదేశంలో స్టాక్‌మార్కెట్లో, బాండ్లలో తమ పెట్టుబడులను ఎఫ్‌పీఐలు భారీగా విక్రయిస్తున్నారు. అదే సమయంలో కొత్త గా విదేశీ పెట్టుబడులు కూడా తగినంతగా రావటం లేదు. విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య కాలంలో మనదేశానికి ప్రతి నెలా దాదాపు 3.6 బిలియన్‌ డాలర్ల చొప్పున వచ్చాయి. కానీ ఈ ఏడాది జనవరి- ఫిబ్రవరి మధ్యకాలంలో నెలకు ఎఫ్‌ఐఐ పెట్టుబడులు 2.9 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఇవి ఇంకా తగ్గాయి.
* ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి రావటం మనదేశానికి నష్టదాయకంగా మారింది. ఇరాన్‌తో మనకు ద్వైపాక్షిక వాణిజ్యం ఎంతో ఎక్కువ. ఆ దేశం నుంచి ముడిచమురు భారీగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. బదులుగా మనం బియ్యం, తేయాకు ఇరాక్‌కు ఎగుమతి చేస్తున్నాం. యూఎస్‌ ఆంక్షల వల్ల ఈ వాణిజ్యం సజావుగా సాగని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్‌కు బియ్యం, తేయాకు ఎగుమతి చేసిన కంపెనీలకు తాజాగా చెల్లింపులు కూడా నిలిచిపోయాయి.  ఈ మార్పులు రూపాయి విలువపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి.
* మనదేశానికి ఇటీవల కాలంలో వర్తక లోటు పెరిగిపోతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 156 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాదిలో వర్తక లోటు 106 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్న విషయం గమనార్హం. మనదేశానికి అధికంగా దిగుమతి అవుతున్న సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగినంతగా ఫలితాలు ఇవ్వకపోవటం ఈ పరిస్థితికి చాలా వరకూ కారణం.
* అదే సమయంలో కరెంటు ఖాతా లోటు కూడా ఆందోళనకరంగా ఉంది. 2015-16లో జీడీపీలో 0.6 శాతం ఉన్న కరెంటు ఖాతా లోటు 2017-18 నాటికి 2 శాతానికి పెరిగింది.
పతనం 71 వరకూ?

ఆర్థిక నిపుణుల అంచనా
* ప్రస్తుత ఇబ్బందికరమైన పరిస్థితులే కొనసాగితే రూపాయి విలువ సమీప భవిష్యత్తు 71 వరకూ పతనం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. టర్కీ సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే రూపాయికి కూడా నష్టం జరుగుతుంది- అని పేర్కొంటున్నారు.
* టర్కీ లీరా మరో 5% పతనం అయితే, రూపాయి- డాలర్‌ మారకం విలువను మనం 70.50 వద్ద చూడవచ్చు, అని స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంకు ఇండియా మార్కెట్స్‌ ఎండీ గోపికృష్ణన్‌ అన్నారు.
* హాట్‌ మనీ (షేర్లు, బాండ్లలో విదేశీ పెట్టుబడులు) ఇటీవల కాలంలో మనదేశానికి పెద్దగా రావటం లేదు, అదే సమయంలో విదేశీ మదుపరులు పెట్టుబడులు ఉపసంహరించి ఆ సొమ్మును వెనక్కి తీసుకువెళ్తున్నారు, అందువల్ల డాలర్‌కు గిరాకీ పెరిగింది, అందుకే రూపాయి విలువ క్షీణత- అని విదేశీ మారక ద్రవ్య నిపుణుడు ఒకరు వివరించారు.
* మళ్లీ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) పెరిగే వరకూ ఈ ఇబ్బంది తప్పదని పేర్కొన్నారు.
 రంగంలోకి ఆర్‌బీఐ? 
రికార్డు స్థాయికి రూపాయి మారకం విలువ పతనం అయిన నేపధ్యంలో ఆర్‌బీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సహజంగానే ఆర్‌బిఐ  క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. అవసరం మేరకు డాలర్లను మార్కెట్లో విక్రయించటం ద్వారా మరింతగా ధర పతనం కాకుండా జాగ్రత్త వహిస్తుంది. అదే సమయంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా లేకుండా చూస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 20- 25 బిలియన్ల వరకూ డాలర్లను ఆర్‌బీఐ విక్రయించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ వద్ద రికార్డు స్థాయిలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నందున ఈ మేరకు డాలర్లు విక్రయించటం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్‌బీఐ వద్ద 425 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అందువల్ల రూపాయి విలువ ఇంకా పతనం కాకుండా ప్రస్తుత స్థాయిలో స్ధిరపడే విధంగా తగిన చర్యలు తీసుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి మారకపు విలువను 69 వద్ద స్థిరంగా ఉంచటానికి ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు.
 ప్రతిపక్ష నేత
రూపాయి పతనాన్ని  ‘అవిశ్వాస తీర్మానం’గా భావించొచ్చు. యూపీఏ హయాంలో రూపాయి పతనం అయినపుడు అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీ ఏమన్నారో ఈ  వీడియోలో (పాత వీడియో) చూడొచ్చు. ‘మోదీ ఆర్థిక వ్యవస్థపై తీసుకున్న పాఠాల వీడియో చూడండి. రూపాయి ఎందుకు పతనమైందో ఆయన వివరిస్తున్నారు. 
- ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ అధినేత ,రాహుల్‌ గాంధీ
ప్రభుత్వ ప్రతినిధి
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి ‘బయటి అంశాలే’ కారణం. భవిష్యత్‌లో ఆ అంశాల ప్రభావం తగ్గవచ్చు. ప్రస్తుతానికి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ అంశాల వల్ల రూపాయి బలహీనపడుతున్నందున ప్రస్తుతానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. 
- ఆర్థిక వ్యవహారాల   కార్యదర్శి సుభాశ్‌ చంద్ర గార్గ్‌
బ్యాంకు అధిపతి
అన్ని కరెన్సీలూ డాలరుతో పోలిస్తే బలహీనపడ్డాయి. అయితే మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి కాస్త తక్కువగానే బలహీనపడింది. ‘రూపాయి 69-70 మధ్య స్థిరీకరణకు గురికావొచ్చు. దేశంలోకి వచ్చే పెట్టుబడులకు ఈ స్థాయి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో కరెన్సీ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడ్డా అటు డెట్‌.. ఇటు ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడులు తరలి వచ్చాయి. ప్రస్తుతం అన్ని కరెన్సీలూ బలహీనపడ్డాయి. అందుకు టర్కీ  పతనం కారణం. భారత్‌ చేయడానికి ఏమీ లేదు. 
- ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.