ప్ర‌త్యేక క‌థ‌నం

చదువుల చెరసాల
ర్యాంకులన్నీ మావేనంటూ ప్రకటనలు.. మీ పిల్లల్ని ఇంజినీర్లు, వైద్యులుగా చేయడం మాకే సాధ్యమంటూ ప్రచారం చేసే కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు విద్యార్థులకు వసతుల కల్పన ఊసే మరిచిపోతున్నాయి. లక్షల్లో రుసుములు వసూలు చేస్తున్నా వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా బందీఖానాల్లాంటి గదుల్లో వారిని కుక్కిపారేస్తున్నాయి. విద్యార్థులను కేవలం మార్కులు, ర్యాంకులు తెచ్చే యంత్రాలుగా చూస్తున్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థుల తలరాతలను కళాశాలల యాజమాన్యాలే రాసేస్తున్నాయి. ఏ విద్యార్థి ఏం చదవాలో నిర్ణయించేస్తున్నాయి. విపరీతమైన ఒత్తిడి, కనీస వసతులు కరవైన హాస్టళ్లలో ఇమడలేక విద్యార్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రధాన కారణమిదే. సరస్వతీ నిలయాలను చదువుల చెరసాలలుగా మారుస్తున్నా, వసతిగృహాలను అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నా, కనీస వసతులు లేకుండా పిల్లల్ని అవస్థలు పెడుతున్నా ఇంటర్‌ బోర్డు, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నాయి.
క్కువ వేతనానికి వస్తారని.. బోధనలో అనుభవం, తగిన అర్హతలు లేనివారిని చాలా కళాశాలలు ప్రిన్సిపాళ్లు, వైస్‌ప్రిన్సిపాళ్లుగా నియమించుకుంటున్నాయి. వారు పిల్లలపై జులుం ప్రదర్శిస్తున్న ఘటనలెన్నో. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ కార్పొరేట్‌ కళాశాల బ్రాంచి ప్రిన్సిపాల్‌ ఓ విద్యార్థిని కొట్టడం వివాదాస్పదమైంది. తనను క్షమించాలని ప్రిన్సిపాల్‌ ఆంగ్లంలో రాసిన మూడు లైన్ల లేఖ చదివినవారంతా అధ్వానమైన ఆయన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. విద్యార్థుల హాజరు, తదితర వ్యవహారాలు చూసే ఫ్లోర్‌ ఇన్‌ఛార్జులు చాలాచోట్ల విద్యార్థులతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు.

తినలేక తింటున్నారు..
ఆహారం నాణ్యంగా, రుచిగా ఉండడం లేదు.. తినలేకపోతున్నామని పిల్లలు చెబుతున్నా ఈ రెండేళ్లు ఓర్చుకోమని తల్లిదండ్రులు బుజ్జగిస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లలకు ఇష్టమైనవి వండితెస్తున్నారు. బిస్కెట్లు, డ్రైఫ్రూట్స్‌ కొనుక్కొచ్చి ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య అల్పాహారం. అంత పొద్దున్నే తినలేక విద్యార్థులు విముఖత చూపుతున్నారు. పరిశుభ్రత లేని శౌచాలయాలు, భోజనశాలల వల్ల చాలామంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. సిక్‌ రూమ్‌లు లేవు. జగిత్యాలకు చెందిన ఓ ఉద్యోగి తన కుమార్తెను హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో చేర్పించారు. భోజనం బాగా లేదని, ఇంటికి వచ్చేస్తానని అమ్మాయి పట్టుబట్టడంతో ఆమె తల్లిని హైదరాబాద్‌కు పంపించి అక్కడే ఇల్లు తీసుకుని కూతురిని చదివిస్తున్నారు.

అపార్ట్‌మెంట్లే కళాశాలలు
అపార్ట్‌మెంట్‌ లేదా వాణిజ్య అవసరాల కోసం నిర్మించిన భవనాలను లీజుకు తీసుకొని కళాశాలు నడిపిస్తున్నారు. సూర్యకాంతి అసలు సోకని భవనాల్లో నడుస్తున్న కార్పొరేట్‌ కళాశాలలెన్నో. కొన్ని భవనాల్లో మూత్రశాలలు తగినన్ని లేక, సమయం సరిపోక ప్రతిరోజూ స్నానాలు చేయడం కూడా సమస్యగా మారుతోంది. హాస్టల్‌ గదుల్లో కుక్కినట్లుగా బెడ్లు వేస్తున్నారు. మంచాల మధ్య నడవడానికి కూడా చోటు ఉండని వసతిగృహాలెన్నో. అయిదారు అంతస్థుల భవనం అయినా లిఫ్టులు ఉండవు. ఉన్నా విద్యార్థులను వినియోగించనివ్వరు. సెల్లార్లలో ఉండే భోజనశాలకు ఇన్ని అంతస్తులు దిగిరావాల్సిందే.

అగ్నిప్రమాదం జరిగితే..
కూకట్‌పల్లి అగ్నిమాపక కేంద్రం పరిధిలో 540 విద్యాసంస్థలుంటే అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లున్నవి 10 శాతంలోపే. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. అగ్నిమాపక చట్టంలో కళాశాలల గురించి లేదని అగ్నిమాపక శాఖ చేతులు దులిపేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగితే విద్యార్థుల భద్రతకు ఎవరు పూచీ?

పిల్లలు తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాలన్నా వారానికి ఒకసారి 10 నిమిషాలు అనుమతిస్తున్నారు. అక్కడ ఉండే ఒకటి రెండు ఫోన్ల కోసం బారులు తీరాల్సిందే. సమయం ముగిసిపోతే ఆ భాగ్యమూ దక్కదు.  బిడ్డలను చూద్దామని ఆదివారాలు కళాశాలలకు వచ్చే తల్లిదండ్రులను గంట మాత్రమే అవకాశం ఇస్తున్నారు.

అడగొద్దు నాన్నా
వసతులకు సంబంధించి సమస్యలను విద్యార్థులు అమ్మానాన్నలకు కూడా చెప్పడం లేదు. కొందరు చెప్పినా ప్రిన్సిపాళ్లను అడగొద్దని బతిమాలుతున్నారు. తల్లిదండ్రులు చెప్పి వెళ్లాక తమను ఇబ్బంది పెడతారన్న భయమే ఇందుకు కారణం. మొత్తానికి కార్పొరేట్‌ కళాశాలల్లో పరిస్థితి.. పెట్టింది తినాలి, చెప్పింది చదవాలి అన్నట్లు తయారైంది. తల్లిదండ్రులకు సమస్యలు చెబితే టీసీపై రెడ్‌ మార్కు వేస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులుబోర్డు అధికారులకూ ఫిర్యాదు చేశారు.

తూతూమంత్రం తనిఖీలు
ఒత్తిడి భరించలేక ఇంటర్మీడియట్‌ విద్యార్థులు గత అక్టోబరు, నవంబరు వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కళాశాలల వసతిగృహాలను తనిఖీ చేయాలని ఆదేశించింది.
* హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి, వెలాసిటీ తదితర కార్పొరేట్‌ కళాశాలలకు అనుబంధంగా నడుస్తున్న 146 వసతిగృహాలను ఆయా జిల్లాల అధికారులు తనిఖీ చేశారు.

* ప్రతి వసతిగృహంలోనూ వసతుల లేమి, అపరిశుభత్ర, వెలుతురు లేని గదులు, గది విస్తీర్ణానికి మించి విద్యార్థులను ఉంచడం వంటి సమస్యలెన్నో వెలుగుచూశాయి. ఏసీ క్యాంపస్‌లని చెబుతున్నా అవీ సరిగాపనిచేయవు.

* ఒక సబ్జెక్టును ఏకధాటిగా మూడు గంటలపాటు బోధిస్తున్నారని, వారానికి 3-4 పరీక్షలు నిర్వహిస్తున్నారని గుర్తించారు.

* ఆయా కళాశాలలకు నోటీసులిచ్చారు. అయితే ఎప్పటిలోగా వివరణ ఇవ్వాలో చెప్పలేదు. దీంతో  కశాశాలలు సమాధానం ఇవ్వలేదు.. బోర్డు అడగనూ లేదు.

* అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు విద్యార్థుల ఆత్మహత్యల గురించి నిలదీస్తాయనే బోర్డు అధికారులు తూతూమంత్రం తనిఖీలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ప్రవేశాలతోనే ముకుతాడు
కార్పొరేట్‌ కళాశాలలకు ముకుతాడు వేయడానికి డిగ్రీ కోర్సుల్లో మాదిరిగా ఆన్‌లైన్‌ ప్రవేశాలు జరపాలని విద్యార్థి, తల్లిదండ్రుల సంఘాలు నిరుడు ఆందోళనకు దిగాయి. దాంతో ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే రెసిడెన్షియల్‌ విధానంతోపాటు ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని కళాశాలలు చెబుతున్నందున రుసుములను ఎలా నిర్ణయిస్తామని ప్రభుత్వం ప్రశ్నించి, పరిష్కారం వెతకకుండా ఆన్‌లైన్‌ ప్రవేశాలను పక్కనపెట్టేసింది. ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేస్తే రుసుముల గురించి కూడా వెబ్‌సైట్లో ఉంచాలనే ఆ ప్రతిపాదన విరమించుకున్నారని విమర్శలు వినిపించాయి.

* కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో రెండు బోధనా పిరియడ్ల తర్వాత 10 నిమిషాల విరామం కూడా ఉండడం లేదు. దీంతో మూత్రవిసర్జనకూ వెళ్లలేక విద్యార్థులు ఉగ్గబట్టుకుంటున్నారు. జనగామకు చెందిన ఒక బాలిక ఏడాదిపాటు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంది. సెలవులకు ఇంటికెళ్లి అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. కళాశాలలోని అధ్వాన పరిస్థితుల వల్ల బిడ్డను కోల్పోయానని ఆ విద్యార్థిని తండ్రి ‘ఈనాడు’ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

* మా అమ్మాయి హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలో చదువుతోంది. వాళ్ల వసతిగృహంలో డైనింగ్‌ హాల్‌లో వర్షాకాలం వస్తే చాలు ఆహారపదార్థాల చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. ఇలాగైతే వారి ఆరోగ్యం ఏమవ్వాలి?

- కరీంనగర్‌కు చెందిన విద్యార్థి తండ్రి ఆవేదన
ఆరోగ్యం హరీ..
జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుణ్ని హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ కళాశాలలో చేర్చారు. ఆ కుర్రాడికి అక్కడి భోజనం సరిపడలేదు. ఇంటిమీద బెంగతో చదువుపై శ్రద్ధ చూపలేకపోయాడు. హైదరాబాదులో చదవలేనంటే తల్లిదండ్రులు వచ్చి నచ్చజెప్పి వెళ్లారు. ఓ రోజు కళాశాల నుంచి ఫోన్‌ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. కుర్రాడు కడుపునొప్పితో విలవిల్లాడుతున్నాడు. వెంటనే బయటకు తీసుకుచ్చి వైద్యశాలలో పరీక్షలు చేయించడంతో అకాల భోజనం, అన్నంలో అనుచిత పదార్థాలు కలపడంతో ఇలా కడుపునొప్పి వస్తుందని, ఇంటి వంట తినకపోతే తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరించారు. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు పది అడుగులు వడివడిగా నడవలేడు. చదువూ అంతంత మాత్రమే.
* మూడు నెలల క్రితం జేఎన్‌టీయూహెచ్‌ సమీపంలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలోకి వెళ్లాం. మరో 15 రోజుల్లో నేను స్వర్గానికి వెళుతున్నాను అని విద్యార్థులు రాసిన రాతలు పలుచోట్ల కనిపించాయి. పిల్లలు ఎంత ఒత్తిడిలో నలిగిపోతున్నారో చెప్పడానికి ఇది చాలదా?
- ఓ విద్యార్థి సంఘ నేత ఆందోళన
* హాస్టళ్లు ఇంటర్‌బోర్డు పరిధిలో లేవు. అందువల్ల ఎంత మందికి ఒక మూత్రశాల ఉండాలన్న దానిపై నిబంధనలు కూడా లేవు. ఈసారి హాస్టళ్లను కూడా ఇంటర్‌ బోర్డు వద్ద నమోదు చేసుకోవాలని నిర్ణయించినా ఇంకా స్పష్టత రాలేదు
- ఓ జిల్లా విద్యాశాఖాధికారి వ్యాఖ్యలు
ఊపిరి సలపని ఒత్తిడి
జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎయిమ్స్‌, ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల కోసం కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్నాయి. విద్యార్థులకు ఇష్టం ఉన్నా లేకున్నా తరగతులు, స్టడీ అవర్స్‌ అంటూ రోజుకు 16 గంటలు చదివిస్తున్నారు. ఇక ప్రతిరోజూ పరీక్ష, వారం వారం పరీక్షలు.. ప్రతి దాంట్లో నిరూపించుకోవాల్సిందే. మార్కులు తగ్గితే సెక్షన్లు మార్చేస్తారు. అదే జరిగితే అమ్మానాన్నలు ఏమంటారో, సహ విద్యార్థులు గేలిచేస్తారనే ఆందోళనతో పిల్లలు నిత్యం కుంగిపోతున్నారు. కొందరు అధ్యాపకులు విద్యార్థులను వేస్టు ఫెలోస్‌, మొద్దులు అంటూ మానసికంగా దెబ్బతీస్తున్నారు.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.