ప్ర‌త్యేక క‌థ‌నం


ఇప్పుడేం చేయాలి?
ఉ.కొరియా, అమెరికా ముందున్న లక్ష్యాలేమిటి?
అణు నిరాయుధీకరణను కిమ్‌ సర్కారు పాటిస్తుందా?
ఉత్తర కొరియా ఆయుధ
సామర్థ్యం ఎంత?అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సంసిద్ధత వ్యక్తంచేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటిస్తున్నారు. రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనా అదే విషయాన్ని ఉద్ఘాటించింది. అమెరికాతో సంబంధాలతో పాటు, కొరియా ద్వీపకల్పంలో శాంతి దిశగా ఇదో కీలక ముందడుగు. అయితే ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ పాటించినంత మాత్రానే.. అమెరికా, దక్షిణ కొరియాలతో సంబంధాలు మెరుగుపడతాయా? అంతకుమించి ఉత్తర కొరియా చేయాల్సిన పనులు ఏమున్నాయి? అసలు అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి ఉత్తర కొరియా సంసిద్ధంగా ఉందా? అనేవి ఇప్పుడు కీలక ప్రశ్నలు.
ఉత్తర కొరియా ఏం చేయాలి?
అనేక ఏళ్లుగా ఆంక్షల ఛట్రంలో మగ్గుతున్న ఉత్తర కొరియాకు ఈ చర్చలు కొత్త ద్వారాలు తీశాయి. వీటిని సోపానంగా మలచకుని.. దేశాన్ని సరికొత్త పథంలో నడిపించడానికి కొరియా నాయకత్వానికి చక్కటి అవకాశం లభించింది. ముఖ్యంగా సైన్యంపై వెచ్చిస్తున్న మొత్తాల్ని తగ్గించాలి. దేశంలో రాజకీయ ప్రక్రియను సరళీకరించాలి. ఇతర దేశాలకు మార్కెట్‌ను బార్లా తెరవాలి. దేశంలో ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగు పరచడం ఉత్తర కొరియాకు చాలా ముఖ్యం. ఎందుకంటే పొరుగునున్న దక్షిణ కొరియాతో పోల్చుకుంటే ఉత్తర కొరియా అనేక విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. దక్షిణ కొరియా జీడీపీ వృద్ధిరేటు 2.7 శాతం అయితే.. ఉత్తర కొరియా వృద్ధిరేటు 0.8 శాతం మాత్రమే. ఉత్తర కొరియా ఎగుమతులు 470 కోట్ల డాలర్లు అయితే.. దక్షిణ కొరియా ఎగుమతులు 55,200 కోట్ల డాలర్లు. దిగుమతులదీ దాదాపు ఇదే స్థాయి. మరోవైపు సైన్యంపై ఉత్తరకొరియా ఏటా 2200 కోట్ల డాలర్లను వెచ్చిస్తోంది. దక్షిణ కొరియాలో ఇది 280 కోట్ల డాలర్లే. సాంకేతికాభివృద్ధిలో ఉత్తర కొరియాతో పోల్చుకుంటే దక్షిణ కొరియా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉత్తర కొరియాలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న వారు 1.8 కోట్ల మంది. ఉత్తరకొరియాలో తలసరి ఆదాయం 1,800 డాలర్లు అయితే  దక్షిణ కొరియాలో  32,400 డాలర్లు. మానవాభివృద్ధి సూచీలోనూ ఉత్తర కొరియా చాలా వెనుకబడి ఉంది. ఈ గణాంకాలు ఉత్తర కొరియాలో సమూల సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతున్నాయి.

ఆయుధ కార్యక్రమాన్ని ఉ.కొరియా వీడుతుందా?
పాశ్చాత్య దేశాలను బెదిరించడానికి, బేరసారాలకు తన ఆయుధ కార్యక్రమాన్ని బలంగా వాడుతున్న ఉత్తరకొరియా నిజంగా అణ్వస్త్ర కార్యక్రమాన్ని వదులుకుంటుందా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. ఉత్తర కొరియాను అమెరికా మొదట్నుంచీ శత్రుదేశంగా చూస్తోంది. దానిపై ఆంక్షలు విధించడంలో ముందు వరుసలో ఉంటోంది. గతంలో అణు బూచి చూపి.. అటు ఇరాక్‌ను, ఇటు లిబియాను దారుణంగా దెబ్బతీసిన, ఆ దేశాల నేతలు సద్దాం హుస్సేన్‌, గడాఫీల మరణాల్ని కళ్లచూసిన అమెరికా- తన అంతాన్నీ అలాగే చూడొచ్చని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ భయపడుతున్నారు. అమెరికా తానిచ్చిన హామీని రాత్రికి రాత్రి వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని, కానీ తాను ఒకసారి అణు, క్షిపణి కార్యక్రమాన్ని వదిలేస్తే.. తిరిగి మొదలుపెట్టడానికి అనేక ఏళ్లు పడుతుందని కిమ్‌ భయపడుతున్నారు. పైపెచ్చు కేవలం ఆయుధ కార్యక్రమాల అభివృద్ధే అండగా ఉత్తరకొరియాను అనేక ఏళ్లుగా పాలిస్తున్న కిమ్‌ కుటుంబం ఏకఛత్రాధిపత్యానికి- అణు కార్యక్రమాల్ని వదులుకోవడం ద్వారా గండిపడుతుంది. దీనికి ఆయన ఎంతవరకు మానసికంగా సిద్ధపడతారు, అణు నిరాయుధీకరణకు ఎంత వరకు సహకరిస్తారు అనేవి కీలక ప్రశ్నలు

ఉత్తర కొరియా ఆయుధ సామర్థ్యం ఎంత?
అమెరికాతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగిన 2017లో ఉత్తర కొరియా వరుసగా క్షిపణి, అణు పరీక్షలు జరిపింది. అమెరికాను తాకగల అణ్వస్త్ర క్షిపణుల్ని పరీక్షించామని ఆ దేశం అప్పట్లో ప్రకటించింది. ఉత్తర కొరియా అణు, క్షిపణి సామర్థ్యం, సైనిక శక్తి ఎంత అన్నవి ఆసక్తికర అంశాలు.

* 2107 మే నెలలో ఉత్తర కొరియా పరీక్షించిన హొసాంగ్‌ 12(4500 కి.మీ.లు)కు గువామ్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని తాకే సామర్థ్యం ఉంది.
* అదే ఏడాది జులై పరీక్షించిన హొసాంగ్‌ 14(8 వేల కి.మీ.లు) ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి. ఇది అమెరికాలోని న్యూయార్క్‌ నగరాన్ని సైతం తాకగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ఇక గత ఏడాది నవంబరులో పరీక్షించిన హొసాంగ్‌ 15 అమెరికా ఖండంలోని ఏ ప్రాంతాన్ని అయినా తాకగలదని అంచనా.

ఎక్కడిది ఈ సామర్థ్యం
చైనా, రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి దిగుమతి చేసుకున్న సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిందన్నది జగమెరిగిన సత్యం. అత్యంత సామర్థ్యం కలిగిన లిక్విడ్‌ ప్రొపెల్లంట్‌ ఇంజిన్లను రష్యా, ఉక్రెయిన్‌ నుంచి అక్రమ మార్గాల ద్వారా ఉత్తర కొరియా సంపాదించింది.

అతిపెద్ద అణు పరీక్ష
గత ఏడాది సెప్టెంబరు 3వ తేదీన ఉత్తర కొరియా తన పంగీరీ కేంద్రం వద్ద అతిపెద్ద అణు పరీక్ష జరిపింది. ఇది 6.3 భూకంప తీవ్రతతో సమానం. గతంలో జరిపిన ఐదు అణుపరీక్షల కన్నా ఇది అత్యంత అక్తిమంతమైనది. ఇది 100 నుంచి 370 కిలో టన్నుల శక్తిని విడుదల చేసిందంటున్నారు. వంద కిలోటన్నులు అంటే.. 1945లో హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబుకన్నా ఆరు రెట్ల శక్తి ఎక్కువ. మొట్టమొదటి థర్మోన్యూక్లియర్‌ ఆయుధాన్ని పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. క్షిపణి లోపల అమర్చగలిగిన అణు వార్‌హెడ్‌ను ఉత్తర కొరియా తయారుచేసిందని అమెరికా విశ్వసిస్తోంది. తగిన సామర్థ్యాలు సంపాదించాం కాబట్టి అణు పరీక్షల్ని నిలిపేస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఉత్తర కొరియా ప్రకటించింది.

సైనిక శక్తి ఎంత?
ప్రపంచంలో అతిపెద్ద స్టాండింగ్‌ ఆర్మీలు కలిగిన దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. యుద్ధం వస్తే దక్షిణ కొరియాకు తీవ్రం నష్టం కలిగించేంతటి సంప్రదాయ బలగాలు ఉత్తర కొరియా వద్ద ఉన్నాయి.

చేయాల్సింది చాలా ఉంది
అణు నిరాయుధీకరణ పాటిస్తే ఉత్తరకొరియాకు తగిన రక్షణలు కల్పిస్తామని అమెరికా చెబుతోంది. ఆ ఒక్క భరోసాతోనే ఉత్తర కొరియా బాగుపడి పోదు. ఈ చర్చల ప్రక్రియకు సానుకూల ముగింపు పలకాలంటే అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా పలు చర్యలు చేపట్టాల్సి ఉంది.

1. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ సాధనకు ఉత్తర కొరియా చిత్తశుద్ధితో పనిచేయాలి. కష్టమనిపించినా.. దేశ సంక్షేమం దృష్ట్యా ఉత్తర కొరియాకు మరో మార్గం లేదు.
2. ఉ.కొరియాపై ఆంక్షల్ని అమెరికా ఎత్తేయాలి. కొరియా ద్వీపకల్పంలో సైనిక బలగాల్ని ఉపసంహరించి.. ఉద్రిక్తతలు సడలడానికి ట్రంప్‌ సర్కారు కృషిచేయాల్సి ఉంది. యుద్ధ ఖైదీల విడుదలకు ఇరు దేశాలూ చర్యలు చేపట్టాలి.
3. ఉత్తర కొరియా తన మార్కెట్‌ను ప్రపంచానికి బార్లా తెరవాలి. దేశంలో భారీ ఎత్తున పాలన, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.