ప్ర‌త్యేక క‌థ‌నం

నిన్నటి స్వేచ్ఛకు నేడు సంకెళ్లు!
స్వప్రయోజనాల కోసం నాడు ప్రపంచీకరణ
నష్టపోతున్నామంటూ ఇప్పుడు కొత్త పల్లవి
‘ట్రంప్‌’ వర్తక విధానాలపై ఇతర దేశాల గుర్రు
దేశాల మధ్య వ్యాపారానికి అడ్డుగోడలు ఏమిటని ఒకప్పుడు ఆ దేశం ప్రశ్నించింది. అభివృద్ధి చెందాలంటే ఆంక్షలు లేని ప్రపంచం కావాలని ఆశపెట్టింది. ఒప్పుకోని దేశాలను నయానో, భయానో లొంగదీసుకుంది. ఉత్తర అట్లాంటిక్‌ అని, ట్రాన్స్‌- పసిఫిక్‌ అని... ప్రాంతీయ ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థకు సూత్రధారిగా వ్యవహరించింది. తద్వారా తన వస్తువులకు ప్రపంచాన్ని విపణిగా మార్చుకుంది. ఆ దేశం మరేదో కాదు. అగ్రరాజ్యమైన అమెరికానే. కానీ ఆదే ఇప్పుడు ప్రపంచీకరణ పెద్ద ముప్పు అన్నట్లుగా, ఇతరదేశాల వస్తువులకు అమెరికాలో స్థానం లేదంటూ అడ్డుగోడలు కట్టుకుంటోంది. చైనాతో మొదలు పెట్టి, కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలు.. దేనికీ మినహాయింపు లేనట్లు కత్తులు నూరుతోంది.
ర్తక యుద్ధాలే మంచివి, వాటిని గెలవటం ఎంతో సులువు- అనేది ట్రంప్‌ విశ్వాసం. ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు అయ్యాక దాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకు ఎంచుకున్న మార్గం వర్తక సుంకాల విధింపు. వివిధ దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అదనపు సుంకాలు వడ్డిస్తూ అడ్డుగోడలు కట్టడం మొదలు పెట్టారు. వాస్తవానికి ఎన్నో దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తూ వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య విధానాలకు ఇది పూర్తి విరుద్ధం. అసలు ప్రపంచీకరణ ఛాంపియన్‌ అమెరికానే. అటువంటి దేశం ఇప్పుడు రక్షణాత్మక వాణిజ్య విధానాలను అవలంబించటం ఇతర దేశాలకు మింగుడు పడటం లేదు.

జీ-7 సదస్సులో చిచ్చు!
ఇటీవల కాలంలో ఇష్టానుసారం అమెరికా విధిస్తున్న వర్తక సుంకాల అంశం కెనడాలో గత వారంలో జీ-7 దేశాల సదస్సులో చర్చకు వచ్చింది. సదస్సు చివరి రోజున సంయుక్త ప్రకటన విడుదల చేయాలి. అతికష్టం మీద అందరి అంగీకారంతో ఒక సంయుక్త ప్రకటన సిద్ధం చేశారు. దాన్ని విడుదల చేసే సమయానికి డోనాల్డ్‌ ట్రంప్‌ అడ్డుపుల్ల వేశారు. సంయుక్త ప్రకటనకు తమ మద్దతు లేదని స్పష్టం చేశారు. పైగా కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడెవ్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జీ-7 కు అమెరికానే వెనుదన్ను. ఈ బలమైన కూటమి ద్వారా అమెరికా ఎన్నో ఏళ్లుగా తన వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంది. కానీ ఇప్పుడు అదే కూటమిలో చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడ్డుగోడలు వద్దన్నది వారే...
అమెరికా తన అవసరాలకు తగ్గట్లుగా వర్తక నిబంధనలను మార్చుకుంటూ వస్తోందనేది చరిత్రాత్మక సత్యం. ఐరోపా దేశాల నుంచి దిగుమతులు వెల్లువెత్తకుండా నియంత్రించటానికి అమెరికాలో మొదట్లో కట్ట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి. స్మూత్‌- హాలే టారిఫ్‌ చట్టం, 1930 ఇటువంటిదే. భారీ ఆర్థిక మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలతో అమెరికా పారిశ్రామికంగా పురోగమించింది. అక్కడి కంపెనీలకు ప్రపంచవ్యాప్త మార్కెట్‌ కావలసి వచ్చింది. దేశాల మధ్య వర్తక ఆంక్షలు ఏమిటంటూ... ఆ దేశం కొత్త పల్లవి అందుకుంది. ఈ క్రమంలో ఎన్నో వర్తక ఒప్పందాలను ప్రపంచ దేశాలపై రుద్దింది.

రెసిప్రోకల్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్స్‌ యాక్ట్‌
అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ 1934లో ఈ చట్టం తీసుకువచ్చారు. దీని ప్రకారం ఇతర దేశాలతో అమెరికా వర్తక ఒప్పందాలు కుదుర్చుకోవటానికి, సుంకాలు తగ్గించటానికి వీలుకలిగింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమెరికా విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఈ చట్టమే పునాది వేసింది.

గాట్‌
1947లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, 22 ఇతర దేశాలతో కుదుర్చుకున్న అతిపెద్ద వర్తక ఒప్పందం జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారిఫ్స్‌ అండ్‌ ట్రేడ్‌ (గాట్‌). ఎన్నో దశాబ్దాల పాటు ప్రపంచ వాణిజ్యానికి ఇది ప్రధాన ప్రాతిపదిక అయింది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు
సోవియన్‌ రష్యా కుప్పకూలిపోవటంతో అప్పటి వరకూ అమెరికా- యూఎస్‌ఎస్‌ఆర్‌ మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం తొలగిపోయింది. ప్రపంచ వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని సాధించే యత్నాలను అమెరికా వేగవంతం చేసింది. ఈ క్రమంలో పలు ద్వైపాక్షిక వర్తక ఒప్పందాలు కుదుర్చుకుంది. యూఎస్‌- కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, నాఫ్టా (నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌), దక్షిణ కొరియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ట్రాన్స్‌- పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టీపీపీ),  సీఏఎఫ్‌టీఏ (సెంట్రల్‌ అమెరికన్‌- డొమినకన్‌ రిపబ్లిక్‌ ఫ్రీ టేడ్‌ అగ్రిమెంట్‌) ఈ కోవలోని ఒప్పందాలే.

ఉరుగ్వే చర్చలు
1947 నుంచి 1986 మధ్యకాలంలో ఎనిమిది దఫాలుగా గాట్‌ (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారిఫ్స్‌ అండ్‌ ట్రేడ్‌) సమావేశాలు జరిగాయి. కానీ 1986లో మొదలైన ఉరుగ్వే రౌండ్‌ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 1994 వరకూ జరిగిన ఈ చర్చలే డబ్ల్యూటీఓ ఏర్పాటుకు వీలుకల్పించాయి. అంతేగాక పలు కొత్త రంగాలకు ప్రపంచ వాణిజ్యం విస్తరించేందుకు  అవకాశం కలిగింది. అంతకు ముందు దఫా చర్చల్లో వ్యవసాయం అంతర్జాతీయ వర్తకంలో భాగంగా లేదు. కానీ ఉరుగ్వే రౌండ్‌ లో వ్యవసాయంతో పాటు, టెక్స్‌టైల్స్‌, సేవలు, మూలధనం, మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌) తదితర అంశాలపై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం ఉరుగ్వే రౌండ్‌లో అత్యంత ప్రధానమైనది.

డబ్ల్యూటీఓ
ఉరుగ్వే చర్చల ఫలితంగా ‘గాట్‌’ స్థానంలో 1995లో డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ) వచ్చింది. దీంతో ప్రపంచ వాణిజ్యంలో అడ్డుగోడలు చాలా వరకూ తొలగిపోయినట్లయింది. స్వేచ్ఛా వాణిజ్యం బహుముఖంగా విస్తరించింది. డబ్ల్యూటీఓ ఫలితంగా తొలిదశలో అగ్రరాజ్యాలు తమ వ్యాపారాన్ని బాగా విస్తరించుకోగలిగాయి. కానీ మలిదశలో వర్థమాన దేశాల నుంచి పోటీ పెరిగింది. చైనా, భారత్‌, మెక్సికో తదితర దేశాలు ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన పాత్ర పోషించే స్థితికి ఎదిగాయి.

ఆలోచన మారిందిలా...
21వ శతాబ్దం ఆరంభం వరకూ వివిధ వర్తక ఒప్పందాల ద్వారా అమెరికా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. కానీ నెమ్మదిగా వర్థమాన దేశాలు అమెరికా కంటే తక్కువ ఖర్చులో వస్తు, సేవలు అందించే పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికా విధాన నిర్ణేతల్లో ఆలోచన మొదలైంది. ట్రంప్‌ వచ్చాక వర్తక సుంకాలను వడ్డించటం మొదలు పెట్టారు. దీనివల్ల దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, చైనా ప్రాబల్యం విస్తరిస్తుందని నిపుణులు మొత్తుకుంటున్నా, ట్రంప్‌ వినటం లేదు.

ఎంతో వ్యతిరేకత
ట్రంప్‌ సుంకాలపై చైనా, కెనడా, ఐరోపా  దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అమెరికా సుంకాలకు బదులుగా చైనా 120 అమెరికా వస్తువులపై 25% వరకూ అదనపు సుంకాలు విధించింది. స్టీలు, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలు కెనడాకు ఎంతో నష్టదాయకం. అమెరికాకు అవసరమైన స్టీలు ఉత్పత్తుల్లో  16% కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. కెనడా నుంచి అల్యూమినియం దిగుమతులు కూడా అధికమే. అమెరికా విధించిన వర్తక సుంకాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడెవ్‌ అన్నారు. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని ఐరోపా యూనియన్‌ ఛైర్మన్‌ జీన్‌ క్లాడ్‌ జంకర్‌ స్పష్టం చేశారు.

భారత్‌పై కన్నెర్ర...
అమెరికా ‘ఐకానిక్‌’ మోటార్‌ సైకిల్‌ అయిన హార్లీ డేవిడ్సన్‌ను మనదేశం దిగుమతి చేసుకుంటే 100% దిగుమతి సుంకం చెల్లించాలి. దీన్ని ఉదహరిస్తూ, అమెరికా వస్తువులను దిగుమతి చేసుకోవటానికి భారతదేశం భారీగా పన్నులు విధిస్తోంది, ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం..., మేం కూడా భారత వస్తువులపై పన్నులు విధిస్తాం- అని నిన్నటికి నిన్న ట్రంప్‌ హెచ్చరించారు. మనదేశం నుంచి అమెరికాకు ఏటా 47.9 బిలియన్‌ డాలర్ల (1 బిలియన్‌= రూ.6,700 కోట్లు) ఎగుమతులు నమోదవుతున్నాయి. అమెరికా నుంచి మనదేశానికి 26.6 బిలియన్‌ డాలర్ల దిగుమతులు అవుతున్నావు. ఈ నేపధ్యంలో ట్రంప్‌ వైఖరి మనదేశానికి కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. 
ఇవీ ట్రంప్‌ టారిఫ్‌లు...
* డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది ప్రారంభంలో సౌర విద్యుత్తు పలకలు, వాషింగ్‌ మెషీన్లపై దిగుమతి సుంకాలు విధించారు.. 
* మూడు నెలల క్రితం చైనాపై 50 బిలియన్‌ డాలర్ల వర్తక సుంకాలతో విరుచుకుపడ్డారు. 
* ‘మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘిస్తున్న’ చైనాపై డబ్ల్యూటీఓ  లో కేసు పెట్టే అంశాన్ని పరిశీలించాలని ట్రంప్‌ తన అధికార్లకు సూచించారు.
* జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఐరోపా యూనియన్‌, కెనడా, మెక్సికో నుంచి స్టీలు దిగుమతులపై 25%, అల్యూమినియం వస్తువులపై 10% అదనపు సుంకాలు విధించారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.