సంపాదకీయం

పేగు బంధం
ప్రసవ వేదన ఎంత బాధాకరమైనదో అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ బాధను మాటల్లో చెప్పలేమంటూ ‘గర్భమందున నేను కడుపు చుమ్మలు చుట్ట సుడి సుడిగుండాల సోలినావు’ అని కవులు కన్నీరు కారుస్తారు. పెంకును పగలగొట్టుకొని కోడిపిల్ల బయటకు తొంగి చూసినట్లుగా, టెంకను చీలికలు చేస్తూ మామిడి మొలక తలెత్తినట్లుగా- అమ్మ పొట్టను చీల్చుకొని మరీ బిడ్డ ఈ లోకంలో అడుగుపెడతాడు. అలా తనువు నుంచి రూపు కడతారు కనుకే పిల్లలను ‘తనూజులు’ అంటారు. తనూభవుల కోసం తల్లులు అంతటి బాధను పంటి బిగువున ఎందుకు భరిస్తారంటే- మాతృత్వం అనేది దివ్యమైన, మహత్వపూర్ణమైన అనుభూతి కాబట్టి! ఆ అనుభూతి కోసమే అమ్మలు నరక వేదనను సైతం నవ్వుతూ భరిస్తారు. ‘తనయు మొగంబుపై మొగము తాల్చి తళత్తళలీను చెక్కు మూర్కొని సకల అంగముల్‌ ఒడి గగుర్పొడునట్లు’ పదేపదే పసికందులను ముద్దాడుతూ తాము పడ్డ ప్రసవ మహా వేదనను మరిచిపోతారు. అప్పటిదాకా ఆమె బాధతో మెలికలు తిరిగిపోవడం చూసినవారికి ‘అమ్మదనం అంటే అదే మరి’ అనిపిస్తుంది. వెన్నుడు అంటే శ్రీమహావిష్ణువు. ‘వెన్నుని, అతి ప్రసన్నుని క్రన్నన కని, మెరుగుబోణి కడు ఒప్పారెన్‌, పున్నమినాటి కళానిధి గన్న మహేంద్రాశ చెలువు కలిగి’ అని భాగవతం దశమ స్కంధంలో పోతన చెప్పినట్లు- ప్రతి తల్లీ సాక్షాత్తు భగవంతుణ్నే కన్నంత తృప్తిగా పసికందును చూసి మురిసిపోతుంది. ఈ ఆత్మీయతను పురస్కరించుకొని తనూజులను ఆత్మజులుగానూ భావన చేస్తారు. ‘ఆత్మావై పుత్రనామాసి’ అంటూ వేదం దాన్ని బలపరచింది. ‘ఆత్మజుడు గల్గ కులమెల్ల అతిశయిల్లు, పరమ సుఖ కారణము తనూభవులె సుమ్ము’ అని లోకంలో గట్టి విశ్వాసం. ఈ ఆత్మీయతలు, అనుబంధాలు లేకుంటే మనిషి జీవితానికి అర్థమే లేదు నిజానికి!

సంతానం కోసం పరితపించిపోవడం భార్యాభర్తలు ఇద్దరిలోనూ కనిపిస్తుంది. దానికి తోడు లోకం ‘ఇంకా విశేషం ఏం లేదా?’ అని అదేపనిగా ప్రశ్నిస్తూ ఉంటుంది. చిరకాలం సంతానం లేకపోయేసరికి దశరథ మహారాజు ఎంతగా తపించిపోయాడో వివరిస్తూ వాల్మీకి మహర్షి ‘సుతార్థం తప్యమానస్య’ అన్నారు. ‘కల్పవృక్షం’లో విశ్వనాథ ఆ భావాన్ని మరింతగా విస్తరించారు. ‘తన మనోవాంఛ యెల్ల సంతానమయము కాగ’ దశరథుడు అయోధ్యా నగర వీధుల్లో ‘ఏ శిశువైనం కనిపించినన్‌ నిలిచి వీక్షించున్‌, హసించున్‌, కృపావశుడై వానిని తీసి ఎత్తుకొని ఏ భక్ష్యమ్ములో తెచ్చియిచ్చి సమావేశన సేయునంతటన్‌’ అంటూ అంతటి చక్రవర్తినీ దారినపోయే పిల్లగాణ్ని ఎత్తుకొని ముద్దాడే సాధారణ భావోన్మత్తుడిగా మార్చేశారు. తండ్రుల తపనకు కారణం ఏమిటో భాగవతంలో పోతనామాత్యుడు వివరించాడు. ‘అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్‌ తనయుల సంభాషణములు జనకులకున్‌ కర్ణ యుగళ సద్భూషణముల్‌’ కాబట్టి ఆ బుడిబుడి పలుకుల కోసం తండ్రులు తపించిపోతారు అన్నాడు. ‘అవ్యక్త మధురోక్తముల సుతుల్‌ పలుకుట వీనుల గల ఫలంబు...’ ఆ తీపి పలుకులు వినడమే చెవులు చేసుకున్న పుణ్యం. ‘ముద్దుల పాపలు ముందట నాడంగ వలయునా గృహములు గల ఫలంబు...’ విశాలమైన ఇళ్లూ వాకిళ్లూ ఉన్నవి దేనికంటే, పసిపిల్లలు సందడిగా ఆటలాడుకోవడానికి అంటూ ‘శ్రీరంగ మాహాత్మ్యం’లో వరద రాజేంద్రకవి అందరి ఇళ్లలో వినపడే ఎన్నోరకాల ఊసులను సీసపద్యంలో ఇమిడ్చాడు. సంతానభాగ్యం ఆశించి ‘పుణ్యముల్‌ చాలా చేసితిరా నృపాలకులు(ప్రభువులు) సత్సంతాన లాభార్థులై’ అంటూ ఆయా రాజులు నిర్వహించిన యజ్ఞయాగాది పుణ్య క్రతువులను తన కావ్యంలో ఏకరువు పెట్టాడు. సంతానం కోసం జనం పడే ఆరాటానికి ఇవి ఉదాహరణలు.

ప్రేమవివాహాల విషయంలో ఆగ్రహించి పిల్లలను దూరంచేసిన పెద్దవాళ్లు- మనవలు పుట్టుకొచ్చేసరికి మెత్తబడి తిరిగి వారిని చేరదీయడం చాలాచోట్ల చూస్తుంటాం. తల్లిదండ్రులకు వారి పిల్లలిచ్చే గొప్ప కానుక అది. అంతేకాదు, తమకు సంతానం కలిగాక జంట మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడటం లోకంలో రివాజు. దాన్నే వేటూరి ప్రభాకరశాస్త్రి ‘సుతాకారపు ముడి’గా అభివర్ణించారు. ‘అరయన్‌ ఆల్మగళ్ల హృదయంబులనంబడు రెండు రజ్జువుల్‌(తాళ్లు)... ఇక వేరుపడకుండగ ఏర్పడున్‌ సుతాకారపు ముళ్లు’ అని ‘మూన్నాళ్ల ముచ్చట’ ఖండకావ్యంలో పేర్కొన్నారాయన. ‘నదులు కనే కలలు ఫలిస్తాయి పొలాల్లో’ అని గుంటూరు శేషేంద్రశర్మ చెప్పినట్లుగా- కుటుంబసభ్యులందరి కలలు, ఆశలు సంతానం మూలంగా నెరవేరతాయి. అపత్యం అంటే సంతానం. ‘కులకలశ తోయరాశికి...’ వంశమనే క్షీరసాగరానికి ‘కుముద బాంధవ ఉదయంబు...’ కలువలకు మిత్రుడైన చంద్రోదయం వల్ల లాభించేవన్నీ ‘అపత్యోదయం’ వల్ల సిద్ధిస్తాయని నయనోల్లాసకర్త పేర్కొనడంలో ఔచిత్యం ఉంది. చైనాలో ఓ వృద్ధజంట నాలుగేళ్ల క్రితం మరణించిన తమ కొడుకు, కోడళ్ల శుక్ర శోణితాలను సేకరించి అద్దె గర్భం ద్వారా మనవణ్ని సాధించిన వైనం వింటే- ఆధునిక విజ్ఞాన ప్రగతి పట్ల ఆశ్చర్యంతో పాటు, వంశోద్ధారకుడి కోసం ఆ జంట పడిన ఆరాటంపై సానుభూతి కలుగుతుంది. ఉన్న ఒక్క కొడుకునూ ప్రమాదంలో పోగొట్టుకొని, తిరిగి అదే జన్యువులతో మనవణ్ని పొందాలన్న వారి సంకల్పానికి లోకం జేజేలు పలుకుతోంది. ‘సిద్ధాంజనము వేరె సిద్ధింప వలయునె? సుర మహీజము వేరె దొరకంగ వలయునె?’ సిద్ధాంజనాలు, కల్పవృక్షాలు మాకెందుకింక, మనవడు దొరికాడు మాకు చాలు- అనుకుంటూ మురిసిపోతున్నారట ఆ వృద్ధ జంట. పేగుబంధం ఎంత బలమైనదో    అనుకుంటున్నారు ఈ ఉదంతం విన్నవారంతా!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.