సంపాదకీయం

ప్రాణాంతక నిర్లక్ష్యం ఇంకానా?
వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు దేశంలోని తక్కిన ప్రాంతాలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య సంక్షోభాన్ని ప్రేరేపిస్తున్నాయి. శీతల వాతావరణంలో, వానలు కురిసి చలి పెరగడంతోనే కోర సాచే స్వైన్‌ ఫ్లూ ఈ సంవత్సరం ఇప్పటికే మహారాష్ట్రలో సుమారు 440, గుజరాత్‌లో 260కి పైగా నిండుప్రాణాల్ని కబళించింది. కేరళ, రాజస్థాన్‌లలో చెరో ఏడు పదుల మంది ఆయువు తోడేసింది. జికా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న రాజస్థాన్‌లోనే కేవలం పదిరోజుల వ్యవధిలో కొత్తగా 180 స్వైన్‌ ఫ్లూ కేసుల నిర్ధారణ, ఇరవై మరణాలు- పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేవే. తెలుగు గడ్డపై డెంగీ, మలేరియా జ్వరాల ఉద్ధృతి తగ్గకుండానే వాటికి స్వైన్‌ ఫ్లూ జతపడింది. తెలంగాణలో పక్షం రోజుల్లోనే 156మందికి స్వైన్‌ ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకినట్లు నిగ్గు తేలగా, ఈ రెండు నెలల్లో ఆ మహమ్మారి 11మంది ప్రాణాల్ని హరించివేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ధాటి కనబరుస్తున్న స్వైన్‌ ఫ్లూ ఆంధ్రప్రదేశ్‌లో క్రమేణా జోరందుకుంటోంది. వారంలో నాలుగు మరణాలు నమోదైన కర్నూలుతోపాటు చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో హెచ్‌1ఎన్‌1 వైరస్‌ విజృంభిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి తెలంగాణలో డెంగీ, మలేరియా కేసులు రెండింతలకు పైబడ్డాయన్న కథనాలు ఒక వంక; తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడులకన్నా ఆంధ్రప్రదేశ్‌లో డెంగీ దూకుడు అధికంగా ఉందన్న విశ్లేషణలు మరోవైపు తీవ్ర ఆందోళనకరమవుతున్న వేళ- స్వైన్‌ ఫ్లూ దండయాత్ర మరింతగా బెంబేలెత్తిస్తోంది.
ఇంకో నాలుగు నెలలు శీతల   వాతావరణం కొనసాగనున్న దృష్ట్యా, కట్టుతప్పి రెచ్చిపోతున్న స్వైన్‌ ఫ్లూ నియంత్రణను లక్షించి ప్రణాళికాబద్ధమైన ఉమ్మడి పోరుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చురుగ్గా కదలాల్సి ఉంది!

తొమ్మిది సంవత్సరాల క్రితం, తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన పద్నాలుగేళ్ల పుణె బాలిక రియా షేక్‌ రూపేణా దేశంలో తొలి స్వైన్‌ ఫ్లూ మరణం నమోదైంది. ఆ ఏడాది దాదాపు 50వేలమందికి సోకిన మాయదారి వైరస్‌ 2,700మంది జీవనదీపాల్ని ఆర్పేసింది. 2010-17 సంవత్సరాల మధ్య దేశంలో లక్షా 14వేలమందికి సోకిన హెచ్‌1ఎన్‌1 ఎకాయెకి ఎనిమిదిన్నర వేలమందిని విగతజీవులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇన్నేళ్లలో స్వైన్‌ ఫ్లూ కేసులు, మరణాల ప్రాతిపదికన జాబితాలో తొలి మూడు స్థానాలు మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌లవే. ఏడేళ్లుగా హెచ్‌1ఎన్‌1 కేసు ఒక్కటీ నమోదు కానివి సిక్కిం, లక్షద్వీప్‌లేనంటున్న అధికారిక నివేదిక ప్రకారం- వాటితోపాటు 2017లో మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లూ స్వైన్‌ ఫ్లూ బారిన పడకుండా ప్రత్యేకత చాటుకున్నాయి. ఆ అనుభవాలనుంచి విలువైన పాఠాలు స్వీకరించి, జాతీయ కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించి పట్టాలకు ఎక్కించడంలో ఇక ఎంతమాత్రం జాప్యం పనికిరాదు. స్వైన్‌ ఫ్లూ సాధారణ జలుబు, జ్వర లక్షణాలతో మొదలై ఉద్ధృతమయ్యాక ఊపిరితిత్తులపై కర్కశంగా దాడికి తెగబడుతుంది. పోనుపోను కాలేయం, మూత్రపిండాలు, కేంద్ర నాడీమండలాల పని తీరును కుంగదీసి ప్రాణాంతకమవుతుంది. వ్యాధిపై అవగాహన పెంపొందించి, వ్యక్తిగత జాగ్రత్తలు పాటింపజేయగలిగితే వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించగలమని వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో కొత్త కేసుల నమోదు, మరణాలు ఆగకుండా సాగుతుండటం- జనచేతన కార్యక్రమాల పరంగా ఏళ్లతరబడి ఘోర వైఫల్యాల్ని ధ్రువీకరిస్తోంది.

రెండేళ్ల క్రితం 1,786 కేసులు, 265 మరణాలకు స్వైన్‌ ఫ్లూ పద్దు పరిమితమైన దేశంలో గత ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే 11 వందల చావులు ఎందుకు నమోదైనట్లు? అంటురోగాల నివారణకై అమలుపరచాల్సిన వ్యూహం ఎక్కడికక్కడ చతికిలపడిందన్నదే అందుకు సరైన జవాబు. వైరస్‌ కట్టడికి వివిధ మంత్రిత్వ శాఖల నడుమ సమన్వయం అత్యావశ్యకమంటూ జాతీయ విపత్తుల నిభాయక సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల్ని శిరసా వహించిన రాష్ట్రాలు వ్యాధి నియంత్రణలో ముందున్నాయి. భౌగోళికంగా ఏ ప్రాంతానికి చెందినప్పటికీ- వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా హెచ్‌1ఎన్‌1 అనూహ్య వేగంతో ఇతరులకు సంక్రమించే ముప్పున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. ఆ ప్రాథమిక అంశం పట్ల వ్యవస్థాగత నిర్లక్ష్యమే నేడెన్నో రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ కారక వైరస్‌కు తిరిగి కోరలు తొడుగుతోంది. జనసమ్మర్దంతో కిటకిటలాడే చోట్ల హెచ్‌1ఎన్‌1 మహా విషాదం సృష్టించగలదని లోగడ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాద ఘంటికలు మోగించినప్పుడు, చైనా దీటుగా స్పందించింది. అప్పట్లో వేలల్లో కేసులు నమోదైనా ప్రాణనష్టం ముమ్మరించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. అటువంటి ముందుచూపు కొరవడిన ఇక్కడ దోమకాటుతో వ్యాపించే విషజ్వరాలూ ఊళ్లకు ఊళ్లను చుట్టేస్తున్నాయి. జ్వరాలు, సాంక్రామిక వ్యాధులు పెచ్చరిల్లడానికి వాతావరణ మార్పులు ప్రధాన కారణమన్నది ఎంత నిజమో, ప్రభుత్వాల అలసత్వమూ శాయశక్తులా పుణ్యం కట్టుకుంటున్నదనేదీ అంతే యథార్థం. పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతల పట్ల అవగాహన కల్పించి, ప్రజారోగ్య పరిరక్షణకై సమధికంగా మౌలిక వసతులు నెలకొల్పిన ఏ దేశంలోనూ రోగాలింతగా ప్రకోపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటా ఆ వివేచన అంకురించి స్వస్థ సంస్కృతికి ప్రోది చేయడమే, దేశంలో సాంక్రామిక దుస్థితిగతుల్ని పరిమార్చే క్రమంలో తొలి ముందడుగు!

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.