అంతర్యామి

వృత్తిధర్మం
వృత్తినే దైవంగా భావించాలని భారతీయ సంస్కృతి బోధిస్తుంది. మనిషి తన పని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. అంకిత భావంతో కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దాన్ని మించిన దైవారాధన మరేదీ లేదు. నీతి, నిజాయతీలతో వ్యవహరించే మనిషే వృత్తిలో దైవాన్ని చూడగలడు.

భారతం, భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి మతగ్రంథాలన్నీ వృత్తిని త్రికరణశుద్ధిగా నిర్వహించాలంటాయి.

ధర్మవ్యాధుడు బ్రహ్మజ్ఞాని. నిత్యమూ తన వృత్తిధర్మాన్ని అనుసరించేవాడు. ఒకరోజు తన దగ్గరకు వచ్చిన కౌశికుడికి ఆయన పలు ధర్మసూక్ష్మాలు వివరిస్తాడు. ‘నేను వృత్తిరీత్యా మాంస విక్రేతను. కొనుగోళ్లు, అమ్మకాల్లో ఎవరినీ మోసగించను. నన్ను నమ్ముకున్నవారిని ఎన్నటికీ వంచించను. ఏనాడూ అసత్యం లేదా అప్రియం పలకను’ అంటాడు.

మానవుడు స్వధర్మ వర్తనను వీడకూడదు. చిత్తశుద్ధితో చేసే పనుల వల్లనే అతడికి సత్ఫలితాలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. పరోపకారం, దాతృత్వం, ఔదార్యం వంటి సద్గుణాలు పెంపొందుతాయి. వివేకయుక్తమైన మనసు, ధర్మాచరణ తప్పని తత్వం వల్ల పరమోన్నతి లభిస్తుంది. వృత్తిధర్మం పాటించే వ్యక్తికి అవన్నీ సులభసాధ్యమవుతాయి.

రత్నాకరుడు దారిదోపిడి వంటి నేరాలకు పాల్పడేవాడు. ఒకనాడు నారదముని ప్రబోధంతో, తన పాపపంకిల జీవితానికి స్వస్తి పలికాడు. వాల్మీకి మహర్షిగా మారి, రామాయణ రచనకర్తగా లోకప్రసిద్ధుడయ్యాడు. ఆయన ధర్మావలంబన విశిష్టత తెలుసుకున్నవాడు. కల్మషరహిత వర్తనతో చిర యశస్సు గడించిన చరితార్థుడు.

ఈ సృష్టిలోని ప్రతి వృత్తీ విశిష్టమైనదే. ఏ వృత్తీ గొప్పదీ కాదు, ఏ వృత్తీ నీచమైనదీ కాదు. అన్ని వృత్తులూ సమప్రాధాన్యం కలిగినవే. శరీరంలోని ఏ అవయవం పనిచేయకున్నా, మనిషి జీవితం కుంటువడుతుంది. అలాగే ఏ వృత్తి చేసేవారు దాన్ని వీడితే, సమాజం అనేక ఇబ్బందులపాలవుతుంది.

ఏ వృత్తిలో రాణించాల‌న్నా, మనిషికి ప్రధానంగా రెండు అంశాలు దోహదపడతాయి. వృత్తిని ప్రేమించడం ఒకటి. నిరంతరమూ శ్రమించడం మరొకటి.

వృత్తిని ప్రేమించడం అంటే, చేస్తున్న పనిమీద ఆసక్తి పెంచుకోవడం. పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడే, అతడు చక్కని నైపుణ్యం సంపాదించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అదే నైపుణ్యాన్ని కృషికి అనుసంధానించినప్పుడు, వృత్తిలో తిరుగులేనివాడవుతాడు. సంఘంలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు.

పరంపరగా లభించే వృత్తినైనా, తనకు ఇష్టమైనదైనా మనిషి దాన్ని సమర్థంగా పూర్తిచేయాలి. యాంత్రికంగా పనిచేయడం తగదు. అది వృత్తికి, సమాజానికీ ద్రోహం చేసినట్లవుతుంది.
లోకంలో ఏ వృత్తీ పూల పానుపు కాదు. దేని ఇబ్బందులు దానికి ఉంటాయి. ఎటువంటి పరిస్థితిలోనైనా, ప్రతి మనిషీ తన వృత్తికి తాను న్యాయం చేయాలి. ఇతరులతో అనవసరంగా పోల్చుకోకూడదు. కర్తవ్యనిర్వహణ దృష్టి కలిగి ఉన్నప్పుడు అశాంతి, ఆత్మన్యూనత అతణ్ని ఏమీ చేయలేవు. ఆ వ్యక్తి నిత్యచైతన్యంతో ఉంటాడు. అందరి గౌరవాన్నీ సంపాదించుకుంటాడు.

వృత్తిధర్మ ఆచరణలోనే సమాజ శ్రేయం ఇమిడి ఉంది. ఎవరు చేయాల్సిన పనిని వారు ధర్మంగా, సక్రమంగా నిర్వర్తించినప్పుడే- సమష్టి రూపమైన మానవ సమాజం పురోగమిస్తుంది!

- విశ్వనాథ రమ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.