close

శుక్రవారం, జూన్ 22, 2018

డాలర్‌ సిరికి ఉరి!
యాంటిబయోటిక్స్‌ ప్రమాదంలో ఆక్వా రంగం
చోద్యం చూస్తున్న మత్స్యశాఖ
యూరోపియన్‌ యూనియన్‌ బృందాలు  బహిష్కరిస్తే ఎగుమతులుండవు
ఉన్నతాధికారులు, రైతులు మేల్కొంటేనే ముప్పు తొలగు
న్యూస్‌టుడే, నెల్లూరు (వ్యవసాయం)
నెల్లూరు నగరంలోని శ్రీనివాస అగ్రహారంలోని లక్ష్మీబాలజీఫుడ్స్‌, కెమికల్స్‌ ఆక్వా షాపులో ప్రభుత్వ అనుమతి లేని చేపలు, రొయ్యల ఫీడ్‌ మందులు అమ్ముతుండటంతో వారికి రూ.25 వేలు అపరాద రుసుం చెల్లించాలని నోటీసులు జారీచేశారు.

కోవూరు మండలం, పోతిరెడ్డిపాళెంలోని డాక్టర్‌ వెట్‌పారమ్‌ షాపులో చేపల పెంపకం మందులకు సంబంధించిన ఐదు శాంపిళ్లను సేకరించారు. వీటిలో ప్రభుత్వం నిషేధించిన యాంటీ బయోటిక్స్‌ నిర్ధరణకు పరీక్షలకు పంపారు.

గతంలో నెల్లూరు నగరం, జిల్లాలోని వివిధ పట్టణాల్లో దాడులు జరిపి పలువురు ఆక్వా షాపు నిర్వాహకులపై కేసులు నమోదుచేశారు. పలు రొయ్యలు, చేపల మందుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.

జిల్లాలో కొందరు రొయ్య రైతులు విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్‌ వాడటంతో విదేశీ మార్కెట్లో మన రొయ్యలను వెనక్కు పంపేస్తున్నారు. దాంతో రూ.కోట్ల  ఆదాయానికి గండి పండింది. జిల్లాలో యాంటీ బయోటిక్స్‌ వాడకం తగ్గడం లేదు. దాంతో అంతర్జాతీయంగా మన ఖ్యాతి మంటగలుస్తోంది. డాలర్‌ సేద్యానికి చిరునామాగా జిల్లా ఒకప్పుడు నిలిచింది. ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిన జిల్లాలోని రైతులే సిరులు కురిపించే ఆక్వాకు ఉరి వేస్తున్నారు. ఈ దారుణ పరిస్థితులను ఇప్పటికైనా అరికట్టకుంటే చివరకు జిల్లా మత్స్యరంగానికి పెను ప్రమాదం  పొంచి ఉందని అటు మత్స్యశాఖ అధికారులు, ఇటు రొయ్యలు, చేపల పెంపకందారులు హెచ్చరిస్తున్నారు.

రొయ్యల్లో అవశేషాలు
రోగ కారకాల నిర్మూలనకు, వ్యాధుల తగ్గుదలకు యాంటీ బయోటిక్స్‌ వాడాలి. అనేక హేచరీల్లో రొయ్య లార్వా దశలో సోకే వ్యాధులు అరికట్టేందుకు, ఆరోగ్యకరంగా పెరిగేందుకు సైతం వాడుతున్నారు. ఇప్పుడిది శ్రుతిమించింది. రైతులు విచక్షణా రహితంగా వాడుతున్నారు. అరకొర పరిజ్ఞానం, అపోహలతో వీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ మందుల అవశేషాలు రొయ్యల్లో ఉండిపోతున్నాయి. దాంతో ఇక్కడ నుంచి ఎగుమతి చేసిన అనేక రొయ్యల కంటైనర్లను విదేశాలు వెనక్కి పంపుతున్నాయి.

ఆలస్యంగా మేల్కొన్నారు
యాంటీ బయోటిక్స్‌పై విదేశాలు ఎప్పుడో చర్యలు తీసుకున్నాయి. మన ప్రభుత్వం, అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. అంతర్జాతీయంగా ఉత్పత్తులను వెనక్కి పండం, యురోపియన్‌ యూనియన్‌ మన సాగుతీరును సందర్శించడం, తదితర కారణాలతో యాంటీ బయోటిక్స్‌ తగ్గించాలంటూ రైతులను ఆదేశిస్తున్నా.. వీటి వాడకం మాత్రం తగ్గడం లేదు. విదేశి ఎగుమతుల్లో 70 శాతం మనరాష్ట్రం నుంచే ఉండగా అందులో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. యాంటీబయోటిక్స్‌ వాడకం నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్సు, తదితర కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో పలుచోట్ల దాడులు చేయడం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా.. యాంటీ బయోటిక్స్‌ వాడకం తగ్గడం లేదు.

మన దేశం నుంచి ఏటా ఎగుమతి అవుతున్న రొయ్యల్లో రాష్ట్రం వాటి 70 శాతం. దాని ద్వారా రూ.19 వేల కోట్లు ఆదాయం లభిస్తోంది. యాంటీబయోటిక్స్‌ ప్రకంపనలతో విదేశీ ఎగుమతులు తగ్గుతున్నా.. జిల్లాలో రొయ్యలసాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. వీటి వాడకం మానకుంటే యూరోపియన్‌ యూనియన్‌ బృందాలు రొయ్యలను పరిశీలించి నిషేధిస్తే మిగిలిన దేశాలు దాన్ని అనుసరిస్తాయి. ఇదే జరిగితే జిల్లాలో రొయ్యల సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

పెరుగుతున్న విస్తీర్ణం
జిల్లా ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలి
యాంటీ బయోటిక్స్‌ను కొన్ని సంస్థలు తయారు చేసి వాటిని అనుమతిలేని డీలర్లకు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నాయి. ఒక్కసారి అవి మార్కెట్లోకి వస్తే నియంత్రణ కష్టం. అవగాహన లేకనే అనేక మంది రైతులు వాటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయా తయారీ సంస్థలపై ప్రాథమిక దశలోనే దృష్టిపెట్టి వాటిని నిషేధించాలి. హేచరీలు, శీతలీకరణ కేంద్రాల నిర్వాహకులు, రైతులు, ఆక్వారంగ నిపుణులు, ఆక్వా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు ఇలా అందరూ యాంటీబయోటిక్స్‌పై అవగాహన పెంచుకుని ముందుకు సాగాలి. అప్పుడే జిల్లాలో ఆక్వారంగానికి మనుగడ ఉంటుంది. జిల్లా, మండలాల్లో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు త్వరలోనే ఆక్వా మందుల దుకాణాలపై దాడులు చేయడం, అక్కడ సేకరించిన, పరీక్షించిన నమూనాల్లో యాంటీ బయోటిక్స్‌ ఉంటే వాటి అనుమతులు రద్దుచేయాలి. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల దాడులు చేసి నిషేదిత యాంటీబయోటిక్స్‌ను పట్టుకున్నారు.

విక్రయించే వారిపై చర్యలు తప్పవు
- సాల్మాన్‌రాజు, జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, నెల్లూరు
జిల్లాలో యాంటీ బయోటిక్స్‌ విక్రయించే వారిపై చర్యలు తప్పవు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దాడులు జరుపుతున్నాం. వీటి వాడకంతో రొయ్యల ఎగుమతులు పడిపోతున్నాయి. చేపలు, రొయ్యల రైతులు వీటిని వాడకుండా సాగు చేపట్టాలి. మందులు వాడినవి తినడం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. వీటి నిర్మూలనకు జిల్లాలో టాస్క్‌ఫోర్సు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నాం.

వ్యాధులు వచ్చే ప్రమాదం
యాంటీ బయోటిక్‌ అవశేషాలు కలిగిన రొయ్యలను తిన్నవారు అనారోగ్యానికి గురవుతారు. ఎంపెడా హెచ్చరికల ప్రకారం ఎలర్జీ, విష లక్షణాలు కలుగుతాయి. ఆహార నాళంలో నివసించే సూక్ష్మజీవుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దాంతో ఎముకల నుజ్జు(బోన్‌మారో)కి హాని కలుగుతుంది. రక్తహీనత, క్యాన్సర్‌, ప్రమాదకర వ్యాధులు వస్తాయి.

ఇష్టారాజ్యంగా వినియోగం
జిల్లాలో అనేక మంది రైతులు యాంటీ బయోటిక్స్‌ను ద్రావణం, పొడి రూపంలో వాడుతున్నారు. వాటిని ఆక్వామేతలో కలుపుతున్నారు. కొందరు నీటిలో చల్లుతున్నారు. వీటి వాడకం రొయ్యలతో పాటు చేపల్లోనూ అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలు ఖరీదైనవి కావడం, అవి విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో సమస్య ఏర్పడుతోంది. పంట పంటకు మధ్య విరామం ఇవ్వకుండా వెంటనే రొయ్యలను సాగు చేసే క్రమంలో రైతులు అవగాహన లేక ఉపయోగిస్తున్నారు. ఫలితంగా మొదటికే మోసం వస్తోంది.

జిల్లాలో మత్స్యకార ప్రాంత మండలాలు : 12
గ్రామ పంచాయతీలు : 37
లోడింగ్‌ కేంద్రాలు : 85
మత్స్య ఉత్పత్తుల్లో విశాఖపట్నం తర్వాత నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విశాఖ 34 శాతం, నెల్లూరు జిల్లా 14 శాతం మత్స్య ఉత్పత్తులను చేస్తోంది.

జిల్లాలో తీరప్రాంతం విస్తీర్ణం 169 కిలోమీటర్లు
మత్స్యకారుల సంఖ్య : 1.98 లక్షల మంది
మంచి నీటి చెరువులు : 1,495
జిల్లాలో ఆక్వాసాగు : 13,233 హెక్టార్లు
రొయ్యలు, చేపల ఉత్పత్తి : 4.80 లక్షల టన్నులు
జిల్లాలో కోట, చిట్టేడు, చిల్లకూరులో రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి.

జిల్లాలో మత్స్య ఉత్పత్తులు (మెట్రిక్‌ టన్నుల్లో)
ఉత్పత్తులు    2016-17      2017-18
రొయ్యలు     68,798       47,899
చేపలు       60,171        43,533

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.