close

మంగళవారం, నవంబర్ 20, 2018

అడ్డగోలు దోపిడీ...
మాల్స్‌, మల్టీప్లెక్సుల్లో పార్కింగ్‌ ఫీజు వసూలు
వాహనం నిలిపినా బాదుడే
హైదరాబాద్‌ను ఆదర్శంగా తీసుకుంటే మేలు
ఈనాడు డిజిటల్‌, అమరావతి
వ్యనగరిలో పార్కింగ్‌ దందా రోజురోజుకి పెరిగిపోతోంది. గంటల వ్యవధి పెట్టిమరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖË్యంగా షాపింగ్‌మాల్స్‌, మల్టీప్లెక్సులకు వెళ్తే అక్కడ చేసే దోపిడీ అంతాఇంతా కాదు. మాల్‌లోకి వాహనంతో ప్రవేశించినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ప్రతి నిమిషాన్ని లెక్కించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ దందా గురించి వీఎంసీ, జీఎంసీ అధికారులకు తెలిసినా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పార్కింగ్‌ కోసం ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు.. నిబంధనలు ఉల్లఘించి డబ్బులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ, గుంటూరు నగరాల్లో రోజురోజుకు వాహనాలు పెరిగిపోతున్నాయి. ఏ చిన్నపనికి బయటకు రావాలన్నా.. వాహనం లేనిదే కుదరని పని. ఇదే అదునుగా పలు మాల్స్‌, మల్టీప్లెక్సులు, సినిమాహాళ్లు వినియోగదారులను బుట్టలో పడేస్తున్నాయి. అదిరిపోయే ఆఫర్లు, సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.. ఇదే అదనుగా మాల్స్‌ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై వాహనదారులకు అవగాహన లేకపోవడం, తెలిసినా మనకెందుకులే అని పట్టించుకోకపోవడంతో.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.

గంటల చొప్పున దోపిడీ
విజయవాడ నగరంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే.. కచ్చితంగా వాహనాన్ని పార్కింగ్‌లో పెట్టాల్సిందే. వీటిలో ద్విచక్రవాహనానికి తొలి మూడు గంటలకు రూ.20 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున పెరుగుతుంటుంది. కారుకి ఈ ధర రూ.40 ఉంటుంది. సినిమా టిక్కెట్లు తీసుకోవాలన్నా.. ఏదైనా చిన్నపని ఉన్నా.. బయట ఎక్కడా పార్కింగ్‌ చేయడానికి స్థలం లేకపోవడం మాల్స్‌ నిర్వాహకులకు కలిసొస్తోంది. ఈ విషయమై అడిగేవారు లేకపోవడంతో   ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా  అర గంట కోసం ఏదో పని మీద వచ్చే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. దీంతో మధ్య తరగతి వినియోగదారులు మాల్స్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గుంటూరులో వందల సంఖ్యలో మాల్స్‌ ఉన్నప్పటికీ సుమారు పదింటిలో మాత్రమే వసూలు చేస్తున్నారు. వీరిలోనూ కొంత మంది సంబంధిత మాల్‌లో కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్‌ను ఉచితంగా ఇస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి...: 1995 చట్టం ప్రకారం ప్రజల అవసరాలకు ఉపయోగపడే మాల్స్‌, మల్టీప్లెక్సులు వినియోగదారులకు ఉచితంగా పార్కింగ్‌ను కల్పించాలి. కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన మాల్స్‌ ఆ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. చట్ట ప్రకారం ఒక వాణిజ్య సముదాయం నిర్మించేటప్పుడు 44 శాతం బిల్డ్‌ అప్‌ స్పేస్‌ వదిలితేనే అనుమతి ఇస్తారు. అలా వదిలన స్థలానికి ఆస్తిపన్ను కట్టాల్సిన పనిలేదు. అలాగే వాటిపైనే ఇక ఎలాంటి వ్యాపార కార్యాకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. కానీ మాల్స్‌ నిర్వాహకులు మాత్రం  భవనం అనుమతి పొందేటప్పుడు పార్కింగ్‌ ఏరియాకు సంబంధించి ఎలాంటి పన్ను చెల్లించరు. దీని నుంచి మినహాయింపులు పొందుతారు. దీని ప్రకారం ప్రైవేటు మాల్స్‌ వినియోగదారులకు పార్కింగ్‌ను ఉచితంగా ఇవ్వాలి. ఇదంతా ఎవరికీ తెలియకపోవడంతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ వసూలు చేసిన సొమ్మంతా లెక్కలోకి రాని డబ్బులో చేరిపోతుంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోంది.

హైదరాబాద్‌ ఆదర్శం కావాలి...
నగరంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు నగరపాలక సంస్థకు కొత్త జీవోలను తెచ్చే అధికారం ఉంటుంది. దీని ప్రకారం హైదరాబాద్‌లోని షాపింగ్‌మాల్స్‌, మల్టీప్లెక్సులు, వాణిజ్య ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ దందాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అన్ని ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయాన్ని ఉచితంగానే పొందేలా జీవోను జారీ చేశారు. వాణిజ్య ప్రదేశాలు, మాల్స్‌కు వెళ్లేవారు అక్కడ కొనుగోలు చేయకపోయినా.. అరగంట వరకు ఎలాంటి పార్కింగ్‌ రుసుము వసూలు చేయకూడదని నిర్ణయించారు. అరగంట నుంచి గంట వరకు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచితే మాత్రం సదరు వాణిజ్య కేంద్రంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపితే పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరు. దీన్ని సినిమా థియేటర్లకు వర్తింపజేశారు. సినిమా కోసం వచ్చేవారికి ఒక షో సమయం వరకు (3గంటలు) ఉచితంగా పార్కింగ్‌ సౌకర్యం ఉంటుంది. అదే సమయంలో 3గంటల తర్వాత నుంచి ఛార్జీ చేస్తారు.

తాజా వార్తలు

జనరల్

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.