close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

విజ్ఞానం.. బహుదూరం..!
నిధుల లేమితో కళ తప్పిన సైన్స్‌ సెంటర్‌
వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత
అసంపూర్తిగా శిక్షణ భవనం
రాష్ట్రంలోని విద్యార్థులకు విజ్ఞాన సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు మూడేళ్ల కిందట ప్రారంభించిన ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాన్ని నిధుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా పరికరాలు పని చేయకపోవడం, అవగాహన కల్పించే సిబ్బంది లేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండడంలేదు. విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ఈ కేంద్రాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.
న్యూశాయంపేట, న్యూస్‌టుడే
హన్మకొండ హంటర్‌రోడ్డులో రూ.6 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం పూర్తి స్థాయిలో పరిపూర్ణతకు  నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 2015 అక్టోబరు 21న ప్రారంభించారు. నాటి నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చారు. ఈ కేంద్రం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయకపోవడం.. అవగాహన పరిచే సిబ్బంది కొరత.. ఉన్న పరికరాల్లో కొన్ని పని చేయకపోవడంతో ఈ కేంద్రానికి ఆదరణ తగ్గుతూ వస్తోంది. అనువంశికత తెలిపే డీఎన్‌ఏ పరికరం, బబుల్‌ ట్యూన్స్‌, ఎలక్ట్రో స్పైన్‌, భూమి గుండ్రంగా తిరుగుతుందని చూపే పరికరం, టోర్నిడో తదితర పరికరాలు పనిచేయడంలేదు. వాటిని మరమ్మతు చేసేందుకు నిధులు లేకపోవడంతో అవి అలాగే ఉండిపోయాయి.

పగిలిన అద్దాలు..
మొదటి అంతస్తులో వివిధ ప్రయోగాలకు సంబంధించిన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో ఎడ్యుషాట్‌ కార్యక్రమాలను, దిల్లీ విజ్ఞాన్‌ ప్రసార్‌భవన్‌ నుంచి ప్రసారమయ్యే వాటిని విద్యార్థులు ప్రత్యక్షంగా చూడవచ్చు. సైన్స్‌లో ఉన్న సందేహాలను నేరుగా తెలుసుకునే అవకాశముంది. మూడో అంతస్తులో శాస్త్రీయతపై అభిరుచి కలిగించేందుకు 3డీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని పరికరాలు సమకూర్చాలని అధికారులు కలెక్టర్‌ ఆమ్రపాలిని కోరగా రూ.10 లక్షల విలువ చేసే 3డీ ప్రొజెక్టర్లు 2, మైక్‌సెట్‌, 200 కుర్చీలను అందించారు. 3డీ కేంద్రం ఉపయోగంలోకి వచ్చినా 40 మంది విద్యార్థులుంటే తప్పా దానిని చూసే అవకాశం లేదు. 5డీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. మూడో అంతస్తులో ఎండ వేడిమిని తట్టుకునేందుకు పైబర్‌ బోర్డుతో బిగించిన అద్దాలు అక్కడక్కడ పగిలిపోయాయి. తద్వారా గాలితో కూడిన వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది. సిబ్బంది వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.

పూర్తిగాని శిక్షణ భవనం...
ఈ కేంద్రానికి ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భవనం అసంపూర్తిగా ఉండిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే సైన్స్‌ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు విడిది చేసేందుకు ఈ భవనాన్ని నిర్మించాలని అనుకున్నారు. నిధుల లేమితో సదరు గుత్తేదారు చేతులెత్తేశారు. అసంపూర్తిగా మిగిలిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవైంది. భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కనీసం రూ.40 లక్షలు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం లేదా, నగర పాలక సంస్థ అయినా దృష్టి సారించి నిధులు కేటాయించాలని విషయ నిపుణులు కోరుతున్నారు.

అవగాహన పర్చే వారేరి?
విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చొరవ చూపాలని ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా వారు పాఠశాలల నుంచి విద్యార్థులను పంపించిన దాఖలాల్లేవు. శాస్త్రీయ పరికరాలు, అవి పనిచేసే విధానంపై అవగాహన కల్పించేందుకు ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారి ముగ్గురు డిస్ట్రిక్‌ లెవల్‌ మానిటరింగ్‌ టీం (డీఎంఎల్‌టీ) సిబ్బందిని నియమించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసిన అనుభవజ్ఞులైన సైన్స్‌ ఉపాధ్యాయులు పని చేసే వారు. ఇంకా మరో ముగ్గురు అధికారులను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోఆర్డినేట్‌ చేసేందుకు ఒక అధికారిని నియమించాలి.

పని చేయని ఏసీలు, లిఫ్ట్‌లు..
ఈ భవనంలో సెంట్రలైజ్డ్‌ ఏసీతో గదులను నిర్మించారు. గత కొంతకాలంగా విద్యుత్తు బిల్లులు పెరిగి పోతుండడంతో వాటిని వినియోగించకలేదు. దీంతో అవి పని చేయడంలేదు. మూడో అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించేందుకు లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలలుగా అదీ పని చేయడంలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చి కొండపై ఉన్న సైన్స్‌ కేంద్రం చేరుకున్న విద్యార్థులకు నిరాశే ఎదురవుతుంది. ప్రదర్శనలను చూడాలనే ఆసక్తి  ఉన్పప్పటికీ మూడు అంతస్తులపైకి చేరుకోలేక మధ్యలోనే తిరుగుముఖం పడుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారిస్తేనే విద్యార్థులకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది.

ఈ ఏడాది నిధులేవి?
విజ్ఞాన కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం 2016లో రూ.6 లక్షల నిధులను కేటాయించింది. మూడు విడతల్లో రూ.4.5 లక్షలు విడుదల చేసింది. నాలుగో విడత నిధులు ఇవ్వలేదు. 2017లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం 2018 సంవత్సరానికి ఇంకా నిధులను కేటాయించలేదు.

రూ.60 లక్షలు ఇవ్వాలని నివేదిక పంపాం
- డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌, ప్రాజెక్టు అధికారి, ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, వరంగల్‌
రెండేళ్లుగా నిధుల కొరతతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా డబ్బులు అవసరమవుతాయి. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోఆర్డినేట్‌ చేసేందుకు ఒక అధికారిని నియమించాలి. 1 డిప్లొమా ఇంజినీర్‌ అవసరం, ఆరుగురు రిసోర్స్‌ పర్సన్లను,  సెక్యూరిటీ, టెక్నీషియన్లు, ఆఫీస్‌ సబార్టినేట్లను నియమించాలి. టీఎస్‌ కాస్టు ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. ప్రతి నెల దాదాపు రూ.25 వేల విద్యుత్తు బిల్లు వస్తుంది. వాటిని టీఎస్‌ కాస్టు నిధుల నుంచి చెల్లించి నెట్టుకొస్తున్నాం. మూడు నెలలుగా సిబ్బందికి చెల్లించే వేతనాలు కాంట్రాక్టర్‌కు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూస్తున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.