close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

పైపులు వదిలేశారు..నల్లాలు మరిచారు..!
నాలుగు నెలలైనా పూర్తికాని పథకం
నర్సాపూర్‌లోని అన్ని వీధుల్లో ఇదే దుస్థితి
న్యూస్‌టుడే, నర్సాపూర్‌
మహిళల కష్టాలు తీరుస్తూ ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకమే మిషన్‌ భగీరథ. పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నెరవేరని పరిస్థితి నెలకొంది. డివిజన్‌ కేంద్రం నర్సాపూర్‌ పట్టణంలో అన్ని వీధుల్లో పైపులైన్లు వేసేందుకు ఇష్టానుసారంగా తవ్వేశారు. పాత వాటిని తొలగించారు. సిమెంటు, మట్టి, కంకర దారులను తవ్వేసి వాటిని పూడ్చివేయకుండా వదిలేశారు. నల్లాలను సైతం బిగించకపోవడంతో పైపుల ద్వారానే నీటిని పట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణవాసులు పడుతున్న అవస్థలపై ‘న్యూస్‌టుడే’ కథనం.
నర్సాపూర్‌ పట్టణంలో మిషన్‌ భగీరథ పథకం పనులు అస్తవ్యస్తంగా మారాయి. తొలి విడతలో ఇంటింటికీ నల్లా నీరందించే పనులు ప్రారంభించారు. గతేడాది డిసెంబరు నాటికి పనులన్నీ పూర్తిచేసి నీటిని పంపిణీ చేస్తామన్నారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో మార్చి నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు. అదీ సాధ్యం కాలేదు. నెలలు గడుస్తున్నాయి తప్పితే ఇంకా అన్ని వార్డుల్లో పనులు పూర్తికాకపోవడం గమనార్హం. ఈ ఏడాది డిసెంబరుకు లక్ష్యాన్ని అందుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇష్టానుసారంగా తవ్వేయడంతో..
పట్టణంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఆరు ట్యాంకులు నిర్మించారు. వాటికి సంబంధించిన పనులను సబ్‌కాంట్రాక్టు ఇచ్చారు. ఇందులో జాప్యం చోటుచేసుకొని ఆలస్యంగా సాగినా ఎట్టకేలకు కొన్ని ట్యాంకులను మాత్రం వినియోగంలోకి తీసుకొచ్చారు. మరికొన్నింటిని నేటికీ వినియోగించడం లేదు. అంతర్గత పైప్‌లైన్ల ఏర్పాటులో భాగంగా కాలువలు తవ్వారు. ఇష్టానుసారంగా తవ్వేయడంతో పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలకు సైతం సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ కాలనీలలో సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరిగి వాటిని బాగుచేయడమే మరిచిపోయారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు కయ్యలు ఏర్పడి అధ్వానంగా మారాయి. తవ్విన ప్రాంతాల్లో నీరు చేరి మురుగుకు నిలయంగా మారాయి. పాత పైప్‌లైన్లను అన్నింటినీ ధ్వంసం చేశారు. కొన్ని వార్డుల్లో పూర్తిగా తొలగించారు. తద్వారా పట్టణంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైప్‌లైన్ల నిర్మాణంలో భాగంగా గ్రామంలోని మురుగు కాలువల కప్పులను తొలగించారు. మరి వాటికైనా మరమ్మతులు చేశారా అంటే అదీ లేదు. అక్కడక్కడ పైప్‌లైన్ల గోతులను నేటికీ పూడ్చలేదు. వాటిల్లో పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. కట్‌వాల్వులు బిగించేందుకు తీసిన గుంతలు కూడా ప్రమాదాల్ని సూచిస్తున్నాయి.

నల్లాల బిగింపులో జాప్యం..
పట్టణంలో ఇంటింటికీ నల్లాల బిగింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పైప్‌లైన్ల పనులు పూర్తయినా వాటికి నల్లాలను బిగించడమే మరిచారు. ఇళ్ల వరకూ పైపులను ఏర్పాటు చేసి చేతులు ఎత్తేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీ, బస్టాండు సమీప కాలనీ, గాంధీనగర్‌ రెండో వీధి, పోస్టాఫీసు వీధి, శ్రీరాంగనర్‌ కాలనీ ఇలా అన్ని వార్డుల్లో నల్లా కనెక్షన్ల కోసం పైపులు వదిలేశారు. దీంతో నీటిని పట్టుకునేందుకు నానాపాట్లు పడాల్సి వస్తోంది. పైపుల ద్వారానే కొన్ని వార్డుల్లో నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి. దీనికితోడు పట్టుకున్న తర్వాత అలాగే వదిలేయడంతో నీరు వృథాగా పోతోంది. కనీసం వాటికైనా బిరడాలు బిగించినా వృథాకు అడ్డుకట్ట పడేది. అక్కడక్కడ గుంతల్లోనే నీటిని పట్టుకోవాల్సి వస్తోంది. దీంతో కలుషితం అవుతోంది. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చేందుకు పైపులు ఏర్పాటుచేసి సీసీ రోడ్లను తవ్వేసి వదిలేశారు. కొంతమంది స్వయంగా వారే సీసీ రోడ్లను కట్‌ చేయించుకొని మరీ కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఇందుకు రూ.2 వేల వరకు వెచ్చిస్తుండటం గమనార్హం.

ఆరు నెలలుగా చెబుతున్నాం..
- వెంకటరమణారావు, సర్పంచి, నర్సాపూర్‌
పట్టణంలోని అన్ని వార్డుల్లో నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఎండీపీ పైపులు ఏర్పాటు చేశాము. రోడ్డుకు ఒకవైపు నుంచి మరో వైపునకు పైపును మళ్లించడానికి, సీసీ రోడ్లను కట్‌ చేసి తీసుకువెళ్లాలి. ఇక్కడే జాప్యం జరుగుతోంది. ఆరు నెలలుగా సంబంధిత బీఆర్సీ సంస్థ ప్రతినిధులకు చెబుతూ వస్తున్నాం. అయినా వారు పట్టించుకోవడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు పూర్తి స్థాయిలో మిషన్‌ భగీరథ నీరు అందించలేకపోతున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.