close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

అచ్చుగుద్దినట్టుగా... ప్రాణం పోసినట్లు...
హుజూరాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: చూసిన ప్రతి చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా బొమ్మ గీయడం ఆయనలో నిబిడీకృతమైన కళ. అచ్చుగుద్దిన తీరుగా... నేరుగా ప్రాణం పోసినట్టుగా చుక్కలతో చిత్రాలు మరింత ఆకట్టుకునే కళతో అందరినీ అబ్బురపరుస్తుంటారు. ఒక్కమారు వీక్షించిన ఏదేని కళాఖండాన్ని ఉన్నది ఉన్నట్టుగా బొమ్మలుగా రూపొందించడంలో తనకుతానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆసక్తితో కలబోసిన పట్టుదల... దీనికితోడైన తపనతో తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలతో తన్మయత్వంలో మునిగేలా తీర్చిదిద్దుతారు. తనచేత్తో ఎన్నో అద్భుతాలను చేయవచ్చని రుజువు చేస్తున్న  హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన డాట్‌ పెయింటింగ్‌ కళాకారుడు కుసుమ రాజాపురుషోత్తమ్‌పై ‘న్యూస్‌టుడే’  స్ఫూర్తిదాయక కథనం.

సరదాగా వేసిన బొమ్మలతో నేడు జీవనోపాధి
తరగతి గదిలో బ్లాక్‌ బోర్డుపై సరదాగా వేసిన బొమ్మలు అదే కళకు అంకితం అయ్యేలా చేశాయి. రెండో తరగతి చదివే రోజుల్లో తనలో మెరిసిన కళా ప్రతిభ అందమైన కళారూపాలకు నేడు ప్రాణం పోస్తుంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైనా సరే నా బొమ్మను గీసిస్తావా అని అడిగితే చాలు ఇక అర గంటలో అందమైన ప్రతిరూపాన్ని చుక్కలతోనే గీయడం ఇతనిలో దాగిన ప్రత్యేకత. హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పురుషోత్తమ్‌ తల్లిదండ్రులు ఇరువురు వృద్ధులు. తల్లి పద్మ మృతి చెందగా తండ్రి లక్ష్మీనారాయణ ప్రయివేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. వీరిది పేద కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి ఇదే కళపై దృష్టి సారించారు. రెండు దశాబ్దాలుగా పెయింటర్‌గా జీవనోపాధిని పొందుతున్నారు. ఇటీవల అంతా అత్యాధునిక పరికరాలు రావడం, కంప్యూటర్ల ద్వారా రంగులద్దే ఫ్లెక్సీలు, మల్టీమీడియా, యానిమేటెడ్‌ వర్క్‌లతో కళ తెరమీదకు రాకుండా పోతోందని ఆవేదనకు గురవుతున్నాడు.

ఎందరో మహానుభావుల చిత్రాలు
గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రాలు మొదలుకుని మహానుభావులు మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, మదర్‌ థెరిసా, చినజీయర్‌ స్వామితో పాటు మరెందరో మహనీయులు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, సినీరంగ ప్రముఖులు మహానటి సావిత్రి తదితరులు, శాస్త్రవేత్తలు... అబ్దుల్‌కలాం లాంటి విజ్ఞాన సంపన్నుల చిత్రాలు సుమారు 100కుపైగా డాట్‌ పెయింటింగ్‌ ద్వారా వేశారు. చూసిన క్షణాల్లోనే పెన్ను, పెన్సిల్‌, రంగులు తదితరాలు ఏవి అందుబాటులో ఉన్నా వాటితో చుక్కలు వేసి చిత్రాలను వేసేవారు తక్కువ మంది ఉంటారు. కానీ, ఎవరికి అంతుపట్టని విధంగా అరుదైన కళలో రాణిస్తూ ఉచితంగా కొందరికి నేర్పిస్తున్న తన లాంటి వ్యక్తులను ప్రభుత్వం గుర్తించడంతో పాటు తగిన విధంగా ప్రోత్సహించాలని పురుషోత్తమ్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చుక్కలతో చిత్రాలు వేసే కళాకారులను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.