close

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2018

జనరల్

PDL20D07 
జనారణ్యంలోకి భల్లూకాలు
గుట్టల విధ్వంసంతో ఆహారం, నీటి కొరత
మూడు నెలల్లో మూడు ఎలుగుబంట్ల సంచారం
గంటల తరబడి నిపుణుల కోసం పడిగాపులు
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(కరీంనగర్‌)

ఇటీవల మల్కాపూర్‌ వద్ద మృతిచెందిన ఎలుగుబంటి
జనాలకు ఎలుగుబంట్ల బెడద ముప్పుగా మారింది. ఎపుడు ఎక్కడ వన్యప్రాణులు జనారణ్యంలో చేరుతాయో..నన్నది అంతుచిక్కని పరిస్థితి. గురువారం జిల్లా కేంద్రంలోని నగర నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌ చేయడంతో బతుకుజీవుడా పరుగులు తీయాల్సిన పరిస్థితి. బుధవారం రాత్రి హుజూరాబాద్‌ మండలం ఇప్పలనర్సింగపూర్‌లో ఎలుగుబంటి కనిపించడంతో ప్రాణాపాయం సంభవించకుండా మైక్‌లో అప్రమత్తం చేశారు. గుట్టల విధ్వంసం, వనమేధం పెచ్చుమీరుతుండగా జనావాసాల్లోకి వచ్చినపుడు సకాలంలో పట్టుకునే నిపుణులు, పరికరాలు లేకపోవడం విడ్డూరం.
ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం విస్తారంగా ఉండేది. 2.50 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతముండేది. అడవి జంతువులు కనిపించాయంటే ఒకరకమైన మానసిక ఉల్లాసం, చూడాలనే కుతుహలముండేది. కాలక్రమేణా అడవిలో అక్రమార్కులు చెలరేగడం, గుట్టల్లో గ్రానైట్‌ వేళ్లూనుకోవడం, సంబంధిత యంత్రాంగం కొమ్ముకాయడంతో ఎడారులుగా మారాయి. వన్యప్రాణుల నివాసాలైన గుట్టలు, చెట్లు కాసుల వలలో నేలకూలడంతో ప్రజల మధ్యకు చేరి దాడులకు దిగుతున్న సందర్భాలు కోకొల్లలు. ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు తాగునీటికి వచ్చి మృత్యువాత పడుతుండగా వేటగాళ్ల ఉచ్చులో మరిన్ని బలవుతున్నాయి. నూతన కరీంనగర్‌ జిల్లాలో 793 హెక్టార్లలో అడవి ఉండగా కరీంనగర్‌ రేంజీలో 101.75హెక్టార్లు, హుజూరాబాద్‌ రేంజీలో 692.5 హెక్టార్ల అడవి ఉన్నట్లు అధికారిక లెక్కలు చాటుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37 వేల హెక్టార్లలో అడవులుండగా సిరిసిల్ల రేంజిలో 19559.611హెక్టార్లు, చందుర్తి-మల్యాల రేంజిలో 17530.92 హెక్టార్ల అడవులున్నాయి. ఇందులో కరీంనగర్‌ జిల్లాలో అత్యల్పంగా అడవులుండగా సైదాపూర్‌ మండలం ఆకునూరు, గంగాధర మండలం వెంకటాయపల్లిలో మాత్రమే అటవీ భూమి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, ముస్తాబాద్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్‌ మండలాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. గణాంకాల ప్రకారం అడవులున్నా క్షేత్రస్థాయిలో ఆక్రమణలు, పోడుతో విస్తీర్ణం తగ్గుతోంది. సుమారు 5 వేల హెక్టార్ల వరకు ఇతరుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. చిన్నచిన్న ప్రాణులు అంతరించడం, నీటి వనరులు కొల్లగొట్టడంతో వన్యప్రాణులు జనసంచారంలోకి చేరుతున్నాయి.
గత ఘటనలతోనైనా చర్యలేవీ..?
ఎలుగుబంటి జిల్లాకేంద్రానికి రావడం ఇది రెండోసారి. నాలుగేళ్ల క్రితం తమకు పునరావాసం చూపాలనో మరేమో కానీ ఏకంగా అటవీశాఖ తూర్పు డివిజన్‌ కార్యాలయానికి ఎలుగుబంటి చేరి హల్‌చల్‌ చేసింది. వేకువజామున సిబ్బంది గుర్తించగా సాయంత్రం వరకు కుస్తీ పడితే గానీ పట్టుకోలేకపోయారు. జిల్లా అటవీశాఖకు అడవి జంతువులను సురక్షితంగా పట్టుకునేందుకు అవసరమైన యంత్రాంగంతో పాటు ఆధునిక పరికరాలు లేకపోవటమే దీనికి కారణం. అవసరమైన మత్తు మందును ఇంజక్షన్‌ ద్వారా ఇవ్వడానికి కరీంనగర్‌లో ట్వాంకిలైజర్‌ గన్‌ సౌకర్యం లేదు. ఈ గన్‌ను పక్కన వరంగల్‌ జిల్లా నుంచి తీసుకురావాల్సిందే.జ ఇక పట్టుకున్న జంతువులను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడానికి ట్రాపర్‌ వెహికిల్, నిపుణులతో కూడిన రెస్క్యూ టీం సౌకర్యం లేకపోవడం గమనార్హం. గురువారం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఎలుగుబంటిని పట్టుకునేందుకు మంచిర్యాల రెస్క్యూ టీం రాగా ఎలుగుబంటిని పట్టుకుని సదరు ప్రాంతానికే తరలించారు.
ఒక్కొక్కటిగా అడవి దాటుతున్నాయ్‌..!
అడవులు ఎక్కువ ఉన్న చోట జంతువులు ఉండటం సాధారణం.. కానీ అక్రమార్కుల వికృత చేష్టలతో ఎడారులుగా మారడంతో వన్యప్రాణులు ఒక్కొక్కటిగా జనస్రవంతిలో కలుస్తున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత మూడు నెలలుగా చిరుతతో పాటు జింకలు, నక్కలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తున్నాయి. హుజూరాబాద్, గంగాధర, చొప్పదండి, మానకొండూరు, శంకరపట్నం, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, ముస్తాబాద్‌ మ వీటిలో కొండగొర్రెలు, జింకలు, నక్కలు, అడవిపందులు, హైనా, కుందేళ్లు, ముళ్లపంది, నెమళ్లు విరివిగా ఉన్నాయి.

చర్యలు చేపడితేనే సరి
అడవుల్లో నీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. సాసర్‌పిట్‌ (నీటి గుంత)లలో ఎప్పటికప్పుడు నీళ్లు ఉండేలా చూడాలి. విస్తారంగా మడుగులు, చిన్న చిన్న కుంటలు నిర్మించి వాటిల్లో దాహం తీర్చేందుకు సౌకర్యం కల్పిస్తే బాగు. అవసరమున్న చోట బోర్లు తవ్వించడంతో పాటు బొట్టుబొట్టును ఒడిసిపట్టాలి. పలుచోట్ల నీటి గుంతలున్నప్పటికి వాటిలో నీరు పోయడం లేదని స్పష్టమవుతోంది. అడవుల్లోనే వాటికి కావాల్సిన ఆహారాన్ని ఉంచితే అవి బయటకు రాకుండా ఉంటాయి. అలాగే ఎడారులుగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా పెరిగే మొక్కలను నాటాలి. హరితహారంలో సదరు మొక్కలకు ప్రాధాన్యతనివ్వాలి.

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు
* హుజూరాబాద్‌ మండలంలోని సిర్సపల్లి గ్రామ శివారులో వెంకటయ్యకు చెందిన వ్యవసాయ బావిలో భల్లూకం పడిపోయింది. అరుపులు విన్న రైతు అటవీ అధికారులకు సమాచారమందించగా వల సాయంతో పట్టుకుని అడవిలో వదిలేశారు.
* గంగాధర మండలం తాడిజెర్రి గ్రామంలోని వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడిపోయింది. గట్టుబూత్కుర్‌ శివారులో గ్రానైట్‌ తవ్వకాల వల్లే ఈ పరిస్థితని అటవీ అధికారులు పేర్కొంటున్నారు.
* గన్నేరువరం మండల కేంద్రంలో వ్యవసాయ బావిలో పడి జింక మృతి చెందింది. నీరు తాగేందుకు వచ్చి బావిలో పడిందని రైతులు పేర్కొన్నారు.
* కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ నుంచి వెలిచాలకు వెళ్లే మార్గంలో విద్యుదాఘాతంతో ఎలుగుబంటి మృతి చెందింది. రాత్రి సమయంలో సదరు ప్రాంతానికి రాగా నియంత్రిక గద్దెపైకి చేరడం వల్ల ప్రమాదం సంభవించింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.