close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

600 మెగా పవర్‌ ఏదీ?
అత్యున్నత ఆశయంతో 600 మెగావాట్ల ఉత్పత్తి యంత్రాల ఏర్పాటు
ఆరో యూనిట్‌ సీవోడీ పూర్తయి 3 నెలలు.. 1, 5 యూనిట్లలోనే విద్యుదుత్పత్తి
పలు కారణాలు చెబుతూ ఉత్పత్తి తగ్గింపు
ఆర్టీపీపీ విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరో యూనిట్‌ అత్యున్నత ఆశయంతో నిర్మాణం చేపట్టారు. అడుగుడుగునా అవాంతరాలు ఎదురైనా సీవోడీ ప్రక్రియ పూర్తయింది. వెలుగులు అందించాల్సిన 600 మెగావాట్‌ల ఉత్పత్తి లక్ష్యంలో చీకట్లు కనిపిస్తున్నాయి. మూన్నెళ్ల కిందట ఆరో యూనిట్‌ ఉత్పత్తికి సిద్ధమైందంటూ సంబరాలు చేసుకున్నా వెలుగులు మాత్రం రావడం లేదు. రూ.వేల కోట్లు గుమ్మరించి నిర్మాణం చేశారు. ఆశయం వెనక్కు వెళ్తోంది.

ఆర్టీపీపీ(ఎర్రగుంట్ల), న్యూస్‌టుడే : ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామం వద్ద నిర్మించిన రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) విద్యుదుత్పత్తిలో కొత్త పుంతలు తొక్కుతూ ఎన్నో మైలురాళ్లను దాటింది. మూడు దశల్లోని ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. 2010 సంవత్సరంలో సుమారు రూ.3500 కోట్ల వ్యయంతో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6వ యూనిట్‌ ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురైనా  నిర్మాణం పూర్తి కావడానికి జెన్‌కో యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నా సీవోడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) కావాల్సిన పనులన్నీ పూర్తి చేసి 2018 మార్చి 28 రాత్రి 11 గంటలకు అధికారికంగా సీవోడీ ప్రకటించారు. జెన్‌కో డైరెక్టర్‌ సుందర్‌సింగ్‌ సుమారు నెల రోజులపాటు ఆర్టీపీపీలో ఉంటూ అధికారులు, గుత్తేదారులను పరుగులు పెట్టించారు. ఇచ్చిన గడువు దాటిపోతోందంటూ సమీక్ష సమావేశాల్లో వారికి చురకలు అంటిస్తూ వేగంగా పూర్తి చేయడానికి కృషి చేశారు. సీవోడీ పూర్తి కావడంతో కేక్‌ కోసి సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ తంతు పూర్తయి మూన్నెళ్లవున్నా ఉత్పత్తి మాత్రం జరగడంలేదు. కేవలం 20 రోజులు మాత్రమే ఉత్పత్తి చేసినట్టు తెలుస్తోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు, నీరు, కూలింగ్‌ టవరు, టర్బైన్‌ జనరేటర్‌, యూసీబీ తదితర వాటితో ఉత్పత్తిని అందించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. బాయిలర్‌, టర్బైన్‌లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు అంటున్నారు. బొగ్గు నిల్వలు అరకొరగా ఉండటం, విద్యుత్తుకు డిమాండ్‌ లేకపోవడంతో ఉత్పత్తిని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. జెన్‌కో ప్రారంభంలో పెట్టిన పెట్టుబడి వస్తుందని, నిర్మాణానికి తెచ్చిన రుణభారం తగ్గుతుందనే సీవోడీ యద్ధప్రాతిపదికన చేశారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్తు అవసరం ఎక్కువగా లేనందువల్ల డిస్కం కూడా ఉత్పత్తి గురించి పట్టించుకోవడంలేదని చెబుతున్నారు.

ఇంజినీర్ల సర్దుబాటు...
కొత్తగా నిర్మించిన 600 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రంలో సిబ్బంది కొరత ఉంది. విద్యుదుత్పత్తి చేయడానికి కావాల్సిన సిబ్బంది అవసరం చాలా ఉందని అధికారులు అంటున్నారు. ఐదు యూనిట్లలోని ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులను సర్దుబాటు చేయాలని ఎండీ విజయానంద్‌ ఇటీవల ఆర్టీపీపీకి వచ్చిన సందర్భంగా చెప్పినట్టు వారు తెలిపారు. ఆరో యూనిట్‌లోకి వెళ్లే జాబితా కూడా సిద్ధమైనట్టు తెలిసింది. త్వరలో వారందరికీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.

మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేత : ఆర్టీపీపీ విద్యుదుత్పత్తి కేంద్రంలోని మూడు యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. యూనిట్‌-2, 3, 4లలో మరమ్మతు పనులు చేయడానికి ఉత్పత్తిని ఆపేశారు. గతంలో ఒక యూనిట్‌ ఆపేసి మరమ్మతు చేసేవారు. అది పూర్తయిన తర్వాత మరొక యూనిట్‌ తీసుకొనేవారు. ప్రస్తుతం కరెంట్‌కు డిమాండ్‌ లేనందువల్ల మూడింటిలో ఉత్పత్తి నిలిపివేశారు. మిగిలిన 1,5 యూనిట్లలో కూడా ఉత్పత్తిని బాగా తగ్గించారు. ఒక్కో దానిలో సుమారు 150 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది.

గ్రిడ్‌ అనుమతులు రావాలి
ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి అనుమతులు రావాల్సి ఉంది. విద్యుత్‌ డిమాండ్‌ ఆధారంగా అనుమతులు ఇస్తారు. అక్కడి నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఉత్పత్తి చేస్తాం. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తి చేసుకుంటున్నాం.

-జి.చంద్రశేఖర్‌రాజు, ముఖ్యఇంజినీరు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.