close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

వరుస హత్యల నిందితుడికి మరోసారి జీవితఖైదు
సహకరించిన వ్యక్తికీ అదే శిక్ష
రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: వరుస హత్యలతో బంధువులనే అంతమొందిస్తూ ఓబులవారిపల్లె మండలంతోపాటు జిల్లాను కూడా ఉలిక్కిపడేలా చేశాడు తోట వెంకటరమణ. 2009 నుంచి 2013 వరకు నాలుగేళ్లపాటు జరిగిన ఈ దారుణాలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టిన ఇతనికి ఎలాగైతే వరుస హత్యలకు పాల్పడ్డాడో- అదే రీతిలో వరుసగా జీవిత ఖైదు శిక్షలు కూడా పడినట్లు సీఐ సాయినాథ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న వెంకటరమణకు రాజంపేట న్యాయస్థానం గురువారం మరోసారి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పిన నేపథ్యంలో రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్లో సీఐ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
* ఓబులవారిపల్లె మండలం గాదెల వెంకట్రామపురం గ్రామానికి చెందిన తోట వెంకటయ్య, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమారుడు వెంకటరమణ. చిన్నతనం నుంచే దుందుడుకు స్వభావంతో ఉండేవాడు. గ్రామంలో బంధువుల మధ్య పొలం తగాదాలు వగైరా చిన్నచిన్న మనస్పర్ధలు ఉండేవి. ఈ నేపథ్యంలో నిందితుడి చిన్నాన్న కుమారుడు వెంకటరమణ (అతడి పేరు కూడా అదే)తో కలసి క్రికెట్‌ ఆడుకుంటుండగా అక్కడ మాటామటా అనుకున్నారు. అది మనసులో పెట్టుకుని 2009 జులై 1న అతడు ఆరుబయట నిద్రిస్తుండగా, పెట్రోలు పోసి నిప్పంటించాడు. నాలుగు రోజులు తిరుపతిలో చికిత్స పొందినమీదట అతను చనిపోయాడు. ఆ నేరంలో వెంకటరమణ జైలుకు వెళ్లాడు. ఈ ఘటన జరగడంతో నిందితుడి తల్లిదండ్రులను బంధువులు చితకబాది, వారి పొలాలను ఆక్రమించుకున్నారు. ఇంటిని తగులబెట్టారు. ఈ విషయాలను తెలుసుకుని జైల్లోనే నిందితుడు కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై బయటకు రాగానే 2012 జూన్‌ 21న తన బంధువు, హత్య కేసులో సాక్షి అయినటువంటి గబ్బి రామకృష్ణయ్యను రాత్రిపూట ఇంట్లో నిద్రిస్తుండగా, నాటు తుపాకీతో కిటికీలో నుంచి కాల్చి చంపేశాడు. ఆపైన ఎవరికీ దొరక్కుండా తప్పించుకు తిరగసాగాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీస్‌ పికెటింగ్‌పై కూడా మెరుపు దాడి చేసి పారిపోయినట్లు అతడిపై అభియోగం మోపబడింది. అంతటితో ఆగని వెంకటరమణ హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న తోట సుబ్రహ్మణ్యంపై ఒకసారి తుపాకీతో దాడి చేశాడు. అదృష్టవశాత్తు బుల్లెట్‌ అతడి భుజంలో నుంచి దూసుకుపోవడంతో అప్పటికి బతికిపోయాడు. అయితే పట్టువదలని హంతకుడు 2013 నవంబరు 24న పొలం వద్దకు వెళ్లిన సుబ్రహ్మణ్యంను మరోసారి తుపాకీతో కాల్చాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఇలా వరుస హత్యలతో ఆ గ్రామాన్ని వణికించేశాడు. చివరకు పోలీసులు 2013 డిసెంబరు 14న రాజంపేట మండలం కూచివారిపల్లె సాయిబాబా దేవాలయం వద్ద అతడిని పట్టుకోగలిగారు. ఈ నేరాలకు సంబంధించి మొదటి హత్యానేరం రుజువు కావడంతో గతేడాది సెప్టెంబరు 18న న్యాయస్థానం నిందితుడికి జీవితఖైదు విధించింది. మిగిలిన రెండు హత్యారోపణలు కూడా సాక్ష్యాధారాలతో రుజువుకావడంతో గురువారం న్యాయస్థానం మరోసారి జీవితఖైదు విధించినట్లు సీఐ చెప్పారు. పోలీసుల విచారణలో హంతకుడికి నగిరిపాటి పోలయ్య, నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన నక్కలోళ్ల విజయ్‌కుమార్‌ అనేవారు సహకరించినట్లు తేలింది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే పోలయ్య చనిపోయారు. విజయ్‌కుమార్‌ నాటు తుపాకీని అందజేయడం, దాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చినట్లు రుజువైంది. వరుస హత్యల్లో పరోక్షంగా పాల్గొన్నందున అతడికి కూడా జీవితఖైదు విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సత్యవాణి తీర్పు చెప్పినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసును వాదించడంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యు. వెంకటస్వామి విశేష కృషి చేసినట్లు ఆయన తెలియజేశారు.

ఎస్పీ అభినందనలు
జిల్లావ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును పలువురు పోలీస్‌ అధికారులు ఛేదించారు. మొదట ఇక్కడ సీఐగా పని చేసిన రమాకాంత్‌ నిందితుడిని అరెస్టు చేశారు. ఆయన తరువాత రసూల్‌సాహెబ్‌ ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇప్పటి సీఐ సాయినాథ్‌ కేసును పురోగమింపజేసి, సాక్షులు భయపడుతుంటే వారికి భద్రత కల్పించి న్యాయస్థానంలో నిజం చెప్పేలా కృషి చేశారు. అధికారులతోపాటు ఓబులవారిపల్లె కానిస్టేబుళ్లు నరసయ్య, మణి, అమర్‌లు కృషి చేయడంతో కేసు పూర్తయినట్లు సీఐ చెప్పారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.