close

మంగళవారం, ఏప్రిల్ 24, 2018

జనరల్

ఎక్కడ ఏ పైపుందో... ఎప్పుడు ఏమవుతుందో?
రసాయన వ్యర్థాల పారబోతలో అడ్డదారులు
కన్పించకుండా నాలాల్లోకి పైపులైన్లు
పూర్తిస్థాయి తనిఖీలు చేయాల్సిన ఆవశ్యకత
న్యూస్‌టుడే, జీడిమెట్ల
పారిశ్రామికవాడల్లో ఎక్కడ ఏ పైపు ఉందో? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రసాయన వ్యర్థాల పారబోత విషయంలో నిబంధనలు ఉల్లంఘించి కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు అవలంభించిన అడ్డదారులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నాలాలను కలుషితం చేసేలా వారు వేస్తున్న పైపులు ఏ ప్రమాదానికి దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పీసీబీ అధికారులు తనిఖీలు చేపడితే మరిన్ని బాగోతాలు బట్టబయలయ్యే అవకాశం ఉంది.

మేడ్చల్‌ జిల్లాలోని జీడిమెట్ల, ఎస్వీ కో-ఆపరేటివ్‌ సొసైటీ, గాంధీనగర్‌, కూకట్‌పల్లి పారిశ్రామికవాడల పరిధిలోని రసాయన పరిశ్రమలు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. భూగర్భంలో పైపులైన్లు ఏర్పాటు చేసి ప్రమాదకర వ్యర్ధరసాయనాలను నాలాల్లో కలుపుతున్నాయి. దీంతో సమీప భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ పారిశ్రామికవాడల్లో సుమారు 100 వరకూ రసాయన, బల్క్‌డ్రగ్‌, డ్రగ్‌ ఇంటర్మీడియట్స్‌ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ధనార్జనలో పడి కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి హాని చేస్తున్నాయి. తమ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించాలి. అనుమతులు తీసుకున్న ఉత్పత్తులనే తయారు చేయాలి. చాలా వరకూ ఈ నిబంధనలు పాటించడంలేదు. పరిశ్రమల ఉత్పత్తులకు, అనుమతులకు పొంతన ఉండటంలేదు. ఇటీవల ఎస్వీ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని సూటిక్‌ఫార్మా పరిశ్రమలోనూ అనుమతి లేని ఉత్పత్తి చేస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగి నలుగురు మృతిచెందిన విషయం తేలింది. ఇలా అనుమతులు లేకుండా చేస్తున్న ఉత్పత్తుల గుట్టు బయటపడుతుందనే కారణంతో కొందరు, శుద్ధి ప్రక్రియ ఖర్చుతో కూడుకుంది కావడంతో ఇంకొందరు వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించకుండా నాలాలు, చెరువుల్లో కలిపేస్తున్నారు.

వదిలించుకోవడానికి వంద మార్గాలు
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉక్కుపాదం మోపకపోవడం వల్లే వ్యర్థ రసాయనాల పారబోతలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్ల ద్వారా నాలాల్లో, నిర్మానుష ప్రదేశాల్లో, చెరువుల్లో గుమ్మరించేవారు. ప్రజలు గగ్గోలు పెట్టడంతో స్పందించిన పీసీబీ ట్యాంకర్లపై నిఘా తీవ్రతరం చేసింది. పరిశ్రమలు కొత్త పద్ధతిని అవలంభించాయి. సెప్టిక్‌ ట్యాంకర్లను ఎంచుకొని చాలా రోజులపాటు వ్యర్థాలు తరలించాయి. దీనినీ గుర్తించడంతో స్వస్తిపలికారు. తరవాత నాలాల పక్కన ఉన్న షెడ్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లను తీసుకెళ్లి అర్ధరాత్రి పైపులతో నాలాల్లో కలిపేసేవారు..

భూగర్భంలో పైపులైన్లు
పరిశ్రమల నుంచి నాలాల్లోకి భూగర్భంలో పైపులైన్లు వేసే పద్ధతి ఇటీవల వెలుగుచూస్తోంది. ఇటీవల రెండు రసాయన పరిశ్రమల గుట్టురట్టు కావడంతో పీసీబీ అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం అతులిత ల్యాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పైపులైను ద్వారా వ్యర్థ రసాయనాలు వదులుతూ పీసీబీకి అడ్డంగా చిక్కింది. పరిశ్రమలు ఘన వ్యర్థాలను సైతం గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలు పారిశ్రామికవాడల్లోనూ కొన్ని రసాయన పరిశ్రమలు ఇదే పంథాను కొనసాగిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పీసీబీ తనిఖీలను ముమ్మరం చేస్తేనే అక్రమార్కులు బయటపడే అవకాశం ఉంది.

పరిశ్రమలకూ ప్రమాదమే!
భూగర్భంలోంచి పైపులైన్లు వేసి ప్రమాదకర వ్యర్థ రసాయనాలను నాలాల్లోకి వదిలే సమయంలో రసాయన చర్య జరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదైనా జరిగితే చుట్టుపక్కల పరిశ్రమలు, జనావాసాలు ముప్పు బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థ రసాయనాలు నాలాల్లో వదలడాన్ని నిరోధించడానికి గతంలో నాలాల వద్ద కాపలాదారులను నియమించేవారు. నాలాలో నీరు రంగు మారగానే వారు పీసీబీకి సమాచారం ఇచ్చేవారు. ఈ విధానాన్ని ప్రస్తుతం తొలగించారు. తిరిగి ఏర్పాటు చేస్తే మేలని ప్రజలు భావిస్తున్నారు.

గతంలో జరిగిన సంఘటనలు
* ఇటీవల వెంకటేశ్వర ఇండస్ట్రీస్‌, ఠాగూర్‌ పరిశ్రమలు పైపులైను ద్వారా నాలాల్లోకి వ్యర్థాలు వదులుతున్నాయని ఫిర్యాదు రావడంతో పీసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వాస్తవమని నిర్ధారించి ఆ పరిశ్రమలను మూసివేయించారు.
* గతంలో గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో ఓ పరిశ్రమ వ్యర్థ రసాయనాలు కాల్వలోకి వదలగా మంటలు వెలువడి సమీపంలోని ఇళ్లు దహనమయ్యాయి.
* పైపులైను రోడ్డులో నాలాలో రసాయనాలు వదలడంతో ఉన్నట్టుంటి మంటలు చెలరేగి పచ్చని చెట్లు కాలిపోయాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.