జనరల్
వద్దన్నా..
వినట్లేదు!
రోజంతా
గుట్టుగా బోధన
ఇంటర్
బోర్డు తనిఖీలతో వెలుగులోకి
గ్రేటర్లో
పలు కళాశాలలకు తాళాలు
గుర్తింపు
రద్దు చేయాలంటున్న విద్యార్థి
సంఘాలు
ఈనాడు,
హైదరాబాద్
గ్రేటర్
పరిధిలోని కొన్ని జూనియర్
కళాశాలలు వేసవి సెలవుల్లోనూ
విరామం లేకుండా విద్యార్థులకు
తరగతులను నిర్వహిస్తున్నాయి.
వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి.
దీన్ని తట్టుకోలేక పలువురు
విద్యార్థులు తీవ్ర ఆందోళనకు
గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నాలుగు గోడల మధ్య బట్టీ చదువుల
నుంచి విద్యార్థులను బయట పడేసేందుకు
వేసవి సెలవుల్లో కళాశాలల్లో
తరగతుల నిర్వహణపై ఇంటర్‌బోర్డు
నిషేధం విధించింది. ఎవరైనా తరగతులు
నిర్వహిస్తున్నట్లు తెలిస్తే
కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు
జారీ చేసింది. అయినా నగరంలో
చాలా జూనియర్ కళాశాలలు యథేచ్ఛగా
తరగతులను నిర్వహిస్తూ వస్తున్నాయి.
దీనిపై స్థానికులు, విద్యార్థి
సంఘాల నుంచి ఇంటర్ బోర్డు అధికారులకు
తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి
ఆయా కళాశాలలను నిత్యం తనిఖీ
చేసేందుకు సుమారు 27 బృందాలను
ఏర్పాటు చేశారు. గత పది రోజుల్లోనే
హైదరాబాద్ జిల్లాలో 15, మేడ్చల్
జిల్లాలో 13, రంగారెడ్డి జిల్లాలో
8 కళాశాలలు తరగతులు నిర్వహిస్తుండగా
పట్టుకొని తాళాలు వేశారు. ఎంత
చెప్పినా జూనియర్ కళాశాలల
నిర్వాహకులు గుట్టుగా సెలవుల్లో
తరగతులు నిర్వహించడంపై విద్యార్థి
సంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల
ఆదేశాలు పట్టించుకోని కళాశాలల
గుర్తింపు రద్దు చేయాలని ఆయా
సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బలిపశువులవుతున్న
విద్యార్థులు
వార్షిక
పరీక్షలు అయిపోతే కనీసం నెలన్నర
సెలవులు వస్తాయని విద్యార్థులు
ఎంతో ఆశగా ఎదురుచూశారు. పదో
తరగతి చివరి పరీక్ష రాసిన తర్వాత
రోజు నుంచే కొన్ని జూనియర్
ఇంటర్ కళాశాలలు తరగతులను ప్రారంభించేశాయి.
ఇదే తరహాలో ఇంటర్ ప్రథమ సంవత్సర
పరీక్షలు అయిన వెంటనే ద్వితీయ
సంవత్సర తరగతులను మొదలుపెట్టేశారు.
తరగతులు జరుగుతుంటే ఎలా పంపించకుండా
ఉంటామని విద్యార్థుల తల్లిదండ్రులు
పేర్కొంటున్నారు. తరగతులకు
వెళ్లకుంటే పాఠ్యాంశాల్లో
తమ పిల్లలు వెనుకబడిపోతారని
ఆందోళన చెందుతున్నారు. మార్కుల
వేటలో తమ విద్యార్థులు ముందంజలో
ఉండాలని కొన్ని కళాశాలలు గుట్టుగా
తరగతులను నిర్వహిస్తున్నాయి.
ఏడాదిలో చదవాల్సిన పాఠ్యాంశాలను
నాలుగైదు నెలల్లో పూర్తి చేసేసి..
మళ్లీ మళ్లీ వాటినే బోధిస్తూ
విద్యార్థులతో బట్టీపట్టిస్తున్నారనే
ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు
అర్థమయ్యేలా ఒక్కసారి చెప్పితే
అది బట్టీపట్టాల్సిన పనిలేదని
విద్యారంగ నిపుణులు వివరిస్తున్నారు.
అలా చేయకుండా నాలుగు గోడల మధ్య
విద్యార్థులను ఉంచేసి విశ్రాంతి
లేకుండా తరగతులను బోధిస్తూ
వారిని బలిపశువులుగా మారుస్తున్నారని
నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజువారీ, వారాంత పరీక్షల పేరుతో
నిత్యం ఒత్తిడికి గురిచేయడంతో
విద్యార్థులు మానసిక ఆందోళనకు
గురవుతారని వివరిస్తున్నారు.
రోజంతా
తరగతులే
ఒకవైపు
ఎండలు మండిపోతున్నాయి. చాలామంది
విద్యార్థులకు కళాశాలల్లో
తరగతుల బాధ తప్పట్లేదు. చదువులకు
వేసవిలోనూ కనీస విరామం దొరకట్లేదు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల
వరకు కొన్ని ప్రైవేటు జూనియర్
కళాశాలల్లో యథేచ్ఛగా తరగతులు
జరుగుతున్నాయి. దీంతో ఇంటర్
విద్యార్థులు మానసికంగా తీవ్ర
ఒత్తిడికి గురవుతున్నారు. తమ
బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం
కావట్లేదని పలువురు విద్యార్థులు
వాపోతున్నారు. రోజంతా తరగతి
గదిలో కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా
ఉంటోందని పేర్కొంటున్నారు.
పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా..లేదా
అనే విషయాన్ని బోధకులెవరూ పట్టించుకోవట్లేదని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోధకులు ఎంత ఆసక్తిగా పాఠ్యాంశాలు
చెబుతున్నా.. ఎలాంటి విద్యార్థులైనా
విరామం లేకుండా తరగతి గదిలో
పాఠాలను ఏకధాటిగా రెండు మూడు
గంటలకు మించి వినలేరని నిపుణులు
వివరిస్తున్నారు. దీని ప్రకారమే
విద్యార్థుల రోజువారీ తరగతుల
ప్రణాళికను తయారు చేస్తారని,
ప్రతీ రెండు గంటలు లేదా తరగతుల
బోధన తర్వాత కనీసం 10 నిమిషాల
విరామం ఇస్తారని వారు చెప్పారు.
ఉదయం తరగతి గదిలో కూర్చున్న
విద్యార్థులు అయిదారు గంటలపాటు
కదలకుండా ఉండాలంటే చాలా ఇబ్బందిపడతారనే
విషయాన్ని కళాశాలలు ఎందుకు
గుర్తించట్లేదని నిపుణులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు ఒత్తిడిలేని
చదువులు అందించే దిశగా కళాశాలలు
ముందుకుసాగాలని వారు సూచిస్తున్నారు.