close

మంగళవారం, ఏప్రిల్ 24, 2018

జనరల్

రారండోయ్‌ వేడుక చూద్దాం!
అన్నవరం, న్యూస్‌టుడే: హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, రత్నగిరి వాసుడు, సత్యదేవుని సన్నిధిలో ఆనందోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 25 నుంచి మే 1వ తేదీ వరకు వారం రోజుల పాటు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కల్యాణమహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవో జితేంద్ర, పెద్దాపురం ఆర్డీవో విశేశ్వరరావు  ఆదివారం ఉదయం విలేకర్ల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు, ఈఈ నూకరత్నం, పీఆర్వో తులారాముడు, ఏఈవోలు వైఎస్‌ఆర్‌ మూర్తి, ఎం.కె.టి.ఎన్‌.వి. ప్రసాద్‌, నటరాజ్‌, సి.హెచ్‌ రామ్మోహనరావు, సూపరింటెండెంట్లు బలువు వాసు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

మాటల సందడితో ప్రారంభమమై... శ్రీపుష్పయాగంతో పరిసమాప్తి
కల్యాణోత్సవాలు ఈనెల 25న ఎదుర్కోలుతో ప్రారంభమై మే 1న శ్రీపుష్పయాగ మహోత్సవంతో ముగుస్తాయి. 25న సాయంత్రం 4 గంటలకు ప్రధానాలయంలోని అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేస్తారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. కళామందిరంలో జరిగే ఈ ఉత్సవంలో దేవతామూర్తుల కీర్తి ప్రతిష్టలు, గుణగణాలు, వంశాన్ని కీర్తిస్తూ సరదాగా వేడుక ఉంటుంది. 26న స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణమహోత్సవం జరగనుంది. రాత్రి 9 గంటలకు ప్రాంగణంలోని (రామాలయం పక్కన) కల్యాణ వేదికపై ఈ వేడుకను నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కల్యాణ వేదికను విశాలంగా, సుందరంగా భక్తులంతా కనులారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో, ఆర్డీవోలు తెలిపారు. 27న రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం, 28న మధ్యాహ్నం 3 గంటలకు మహదాశీర్వచనం, పండిత సదస్యం, పండిత సత్కారం, (వేదశాస్త్ర సభ) తదితర కార్యక్రమాలుంటాయి. 29న సాయంత్రం 4 గంటలకు వనవిహారోత్సవం ఉంటుంది. ఇప్పటి వరకు కొండపై పేపర్‌మిల్లు గార్డెన్‌లో దీనిని నిర్వహించేవారు. ఈ ఏడాది కొండదిగువున గార్డెన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఈనెల 30న ఉదయం 8 గంటలకు పంపా సరోవరంలో శ్రీచక్రస్నానం నిర్వహించనున్నారు. అయితే రిజర్వాయర్‌లో ఆశించిన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పుష్కర కాలువ నుంచి నీటిని మళ్లించే అవకాశం లేకపోవడంతో దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.
* మే 1న శ్రీపుష్పయాగ మహోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఏటా అనివేటి మండపంలో నిర్వహించేవారు. అయితే ఈసారి  విశాలంగా, ఎక్కువమంది భక్తులు వీక్షించేలా నిత్య కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రామోత్సవాలకు ఎంతో విశిష్టత
ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారి కల్యాణానికి పెండ్లి పెద్దలుగా సీతారాముల వారు వ్యవహరిస్తారు. 25న సీతారాముల వారిని వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగిస్తారు. 26న పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె లైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను వెండి గరుడవాహనం, సీతారాముల వారిని పల్లకీపైనా ఊరేగిస్తారు. 27న నూతన వధూవరులు స్వామి, అమ్మవార్లను రావణ వాహనంపైన, 28న పొన్న వాహనంపైన, 29న వెండిరథంపైనా ఊరేగిస్తారు. గ్రామోత్సవాల నేపథ్యంలో రాత్రి 9 నుంచి 12 గంటల వరకు భారీ, ఇతర వాహనాలను జాతీయ రహదారి మీదుగా మళ్లించేందుకు పోలీస్‌ అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈనెల 29, 30 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేయనున్నారు. అంతేకాకుండా భజన, సంగీత కచేరీలు, భక్తి ప్రవచనాలు, కూచిపూడి నృత్యాలు, వీణావాయిద్య కచేరీ, బుర్రకథ, హరికథ, ఈలపాట, కర్ణాటక సంగీతం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.