close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

ఎప్పుడూ దుంగలే.. దొంగలు దొరకరే?
ఎర్రచందనం అక్రమానికి పడని అడ్డుకట్ట
నిఘా కళ్లుగప్పి రూటుమార్చి రవాణా
కదిరి, న్యూస్‌టుడే: అనతి కాలంలో అందలం ఎక్కాలన్నా.. సమాజంలో డాబు.. దర్పం కావాలన్నా డబ్బు అవసరం. అక్రమార్కులు కొందరు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన సమకూర్చే ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకున్నారు. ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. కేవలం అడవిలో చందనం దుంగలను నరికి అడ్డదారుల్లో రవాణా చేసే ధైర్యం ఉంటే చాలు కావాల్సినంత డబ్బు. అందుకు కడప, అనంతపురం సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతాలు తరగని నిధిగా మారాయి. కడప జిల్లాలోని చక్రాయపేట, రాయచోటి, రాజంపేట, తదితర అటవీ ప్రాంతాల్లోని ఎర్రచందనం నరికి కదిరి నియోజకవర్గంలోని పలు మార్గాల ద్వారా నిఘాకళ్లు గప్పి కర్ణాటక రాష్ట్రానికి అక్రమ రవాణా చేస్తున్నారు. ఎర్రచందనం వెళ్తుందని అందరికీ తెలుసు. అటవీ శాఖ ప్రత్యేక నిఘాసైతం ఏర్పాటు చేసింది. అయినా ఆగని ప్రవాహంలా ఎర్రచందనం సరిహద్దులు దాటి వెళ్తూనే ఉంది. బహిర్గతంగా కళ్లబడిన అక్రమార్కులను అడ్డగించినా..చందనం దుంగలు, వాహనాలు మాత్రమే దొరుకుతున్నాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే కూలీలు, డ్రైవర్లు మాత్రమే పట్టుబడతారు. ఇందుకు రెండురోజుల క్రితం ఎన్పీకుంట మండలం వెలిచెలమల వద్ద అటవీ, పోలీసు సిబ్బంది వెంబడించి పట్టుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనం మాత్రమే నిదర్శనం.

యథేచ్ఛగా రవాణా.. అడపాదడపా దాడులు
కడప జిల్లాతో పాటు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం లభిస్తుంది. ఈ ప్రాంతాల నుంచి అక్రమ రవాణాకు అనుకూలంగా అందుబాటులో ఉన్న నగరం బెంగళూరు. దీంతో దశాబ్దాలుగా చందనం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. గతంలో కడప జిల్లా సరిహద్దు అడవి నుంచి ఎర్రచందనం తీసుకొచ్చి తలుపులలోని అటవీ పరిసర గ్రామాలలో నిల్వ చేసేవారు. అదును చూసుకుని కర్ణాటకకు తరలించేవారు. ఒకటి, రెండుసార్లు పెద్దఎత్తున జరిపిన దాడులతో నిల్వలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం నేరుగా రవాణా కొనసాగిస్తున్నారు. కడప జిల్లా అడవుల నుంచి వచ్చే అక్రమాలను అరికట్టేందుకు అటవీశాఖ కదిరి నియోజకవర్గ పరిధిలో కుర్లి, రెక్కమాను ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. కుర్లి చెక్‌పోస్టు కొంత నయమనిపించినా రెక్కమానులో మాత్రం ఉన్నా లేనట్లే ఉంది. వాహనాలు ఆపటం, అందుకు తగిన ఏర్పాటు కనిపించవు.
కడప జిల్లా చక్రాయపేట అటవీ ప్రాంతం ఎర్రగుడి నుంచి ఎన్పీకుంట మండలం కమ్మగుట్టపల్లి, గౌకనపల్లి, వెలిచెలమల, కురుమామిడి మీదుగా తనకల్లు మండలం కొర్తికోట మీదుగా మరో మార్గంలో తలుపుల, ఎన్పీకుంట మండలం మీదుగా కర్ణాటకకు వెళ్తున్నారు. దీంతో పాటు కడప జిల్లా సానిపాయి నుంచి రాయచోటి, గాలివీడు మీదుగా ఎన్పీకుంట మండలం పెడబల్లి, సారగుండ్లపల్లి, కొర్తికోట దాటి కర్ణాటకకు చేరుకుంటున్నారు. నిఘా తక్కువగా ఉండి, జనసంచారం లేని సమయంలో నిర్భయంగా వెళ్తున్నారు. ప్రధాన మార్గాల గుండా కాకుండా మారుమూల దారులతో అనుమానించేలా వాహనాలు వెళ్లటంపై విస్తృత చర్చ జరుగుతోంది.

కరవైన కఠిన చర్యలు
కదిరి అటవీప్రాంతంలో తలుపుల, ఎన్పీకుంట, తనకల్లు, కదిరి పరిసర ప్రాంతాల్లో గత కొన్నేళ్లలో చాలాసార్లు వాహన తనిఖీలు, సమాచారంతో కూడిన దాడులతో దుంగలు, వాహనాలే పట్టుబడ్డాయి. ఒకటి రెండుసార్లు వ్యక్తులు దొరికినా కూలీలు, డ్రైవరు మాత్రమే దొరికారు. ఎర్రచందనం దొరికిన కేసుల్లో పోలీసులు పట్టుకున్నవే ఎక్కువ. నిరంతర నిఘాలో ఉన్న అటవీ సిబ్బంది చేసింది నామమాత్రమే. ఈనెల 17న ఎన్పీకుంట మండలం వెలిచెలమలలో ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని అటవీసిబ్బంది వెంబడించినా నిందితులను పట్టుకోలేకపోయారు. 2007 అక్టోబరులో ఓమ్‌నీ వాహనంలో తీసుకెళ్తున్న 32 దుంగలను కొక్కంటి వద్ద పట్టుకున్నారు. ఆ తర్వాత నవంబరులో మారుతీ 800వాహనంలో 17దుంగలు కొక్కంటి క్రాస్‌ డ్రైవర్‌తో పాటు పట్టుబడ్డాయి. తరలిస్తున్న నిందితుడు పట్టుబడినా అసలు నిందితులెవరో ఇప్పటికీ నిగ్గుతేలకుంది. మూడేళ్లకు ముందు ఎన్పీకుంట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, మేకలచెరువు ప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు చందనం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవరును అరెస్టు చేశారు. డ్రైవరును అరెస్టు చేసినా ఎర్రచందనం అక్రమ వ్యాపారం వెనుక ఎవరున్నారన్న విషయం వెలుగులోకి రాలేదు. రెండేళ్ల  క్రితం బుక్కపట్నం బుచ్చయ్యగారిపల్లి వద్ద, కొత్తచెరువులో పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా ట్యాంకరులో వెళ్తున్న దుంగలను పట్టుకున్నారు. అయితే వాహనంలో వెళ్తున్న నిందితులెవరూ పట్టుబడలేదు. సంఘటనలు జరిగి చందనం, వాహనాలు పట్టుబడిన ప్రతిసారీ కేసులు నమోదు చేయటంతో చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

రాత్రిపూట ప్రత్యేక నిఘా పెట్టాం
ఇతర ప్రాంతాల నుంచి ఎర్రచందనం కదిరి, బుక్కపట్నం రేంజ్‌ల మీదుగా వెళ్తున్నట్లు సమాచారం ఉంది.ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం వేశాం. ఎన్పీకుంట సంఘటనలో సిబ్బంది ప్రత్యేక సమావేశం జరిపాం. రాత్రిపూట వాహనాల తనిఖీని ముమ్మరం చేస్తాం. ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైనా సిబ్బంది పొరపాటు చేసినట్లు తెలిస్తే వారి చర్యలు తప్పక ఉంటాయి. వంతుల వారీగా  సిబ్బంది కేటాయించి, పటిష్ట నిఘాకు చర్యలు తీసుకున్నాం.

-  వేణుగోపాల్‌, అటవీ క్షేత్రాధికారి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.