close

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2018

జనరల్

ప్రత్యామ్నాయం.. పదునైన సమయం
జిల్లాలో విస్తారంగా వర్షాలు
అర్హులందరికీ విత్తు
జేడీఏ హబీబ్‌బాషా
జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ‘జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. భూమి పదునెక్కింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఇదే మంచి తరుణమని’ జేడీఏ హబీబ్‌బాషా తెలిపారు. ఆయన ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  అన్నదాతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2.88 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ సాగుకు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా.. రూ.32 కోట్ల విలువైన 55,439 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించిందని వివరించారు. విత్తు సరఫరా బాధ్యత విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్‌)కు అప్పగించారన్నారు. ఇప్పటికే విత్తనాల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. 65-70 రోజుల్లో చేతికొచ్చే పంటలను సాగుచేయాలని రైతులకు సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా విత్తు అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
* న్యూస్‌టుడే: జిల్లాలో 44 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆయా మండలాల్లో మాత్రమే విత్తన పంపిణీ సాగుతోంది. మిగిలిన ప్రాంతాల రైతుల పరిస్థితి ఏమిటి?
* జేడీఏ : మిగిలిన 19 మండలాలకు విత్తనాలను పంపిణీ చేస్తాం. జులై నాటికి వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని, 44 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. కరవు నిబంధనల ప్రకారం ఆయా మండలాల్లోనే విత్తనాలను పంపిణీ చేయాలి. అయితే ఆగస్టు నెలాఖరు వరకు వర్షపాతం, పంట స్థితిగతులను పరిశీలించగా.. మిగిలిన 19 మండలాల్లోనూ గడ్డు పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించాం. సంబంధించి నివేదికలు ప్రభుత్వానికి పంపాం. అన్ని మండలాల్లో విత్తనాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. త్వరలోనే ఉత్తర్వులు వస్తాయి. జిల్లా అంతటా ప్రత్యామ్నాయ విత్తు పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటాం.
* జేన్యూ : విత్తనాలు తీసుకెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారా?
* జేడీఏ : గతేడాది 1.24 లక్షల క్వింటాళ్ల విత్తనాలను జిల్లాకు కేటాయించారు. అయితే పంట నష్టపరిహారం, పంటల బీమా రాదన్న అపోహతో అప్పట్లో రైతులు ఆసక్తి చూపలేదు. కేవలం 19 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ జరిగింది. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. రైతుల నుంచి డిమాండు బాగా పెరిగింది. ఇప్పటికే 13 వేల క్వింటాళ్లు పంపిణీ చేశాం. డిమాండుకు తగట్టు విత్తనాలను సిద్ధంగా ఉంచుతున్నాం.
* న్యూ : జిల్లాకు 28,691 క్వింటాళ్ల జొన్న విత్తనం కేటాయించారు. అయితే రైతులెవరూ తీసుకోవడం లేదు. దీనికి మీరేమంటారు?
* జేడీఏ : జొన్న విత్తనాలను రైతులు తీసుకోవడం లేదు. హైబ్రిడ్‌ జొన్న విత్తనాలిస్తున్నాం. వాటిని వద్దంటున్నారు. హైబ్రిడ్‌ రకం సాగుకు నల్లరేగడి భూముల రైతులు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఎర్రనేలలు ఉన్న రైతులు ఒప్పుకోరు. బళ్లారి, రాయచోటి నాటిరకం జొన్నలనే రైతులు అడుగుతున్నారు. కలెక్టర్‌, కమిషనర్‌తో మాట్లాడి, నాటిరకం జొన్నలను  తెప్పిస్తాం.
* న్యూ : వర్షాభావంతో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. పంట తొలగించుకున్న రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇస్తారా?
* జేడీఏ : ఇస్తాం.. పంట వేయని రైతులతో పాటు ఖరీఫ్‌లో పంటలు సాగుచేసి, వర్షాభావంతో తొలగించుకున్న రైతులకు కూడా విత్తనాలు ఇస్తాం. ఏ విత్తనం అవసరముందో ఆ విత్తనాలను పంపిణీ కేంద్రాలకు వెళ్లి తీసుకోవచ్చు.
* న్యూ : సర్వర్‌ పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?
* జేడీఏ : సర్వర్‌ సరిగా పనిచేయకపోవడం వాస్తవమే. సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సర్వర్‌ సామర్థ్యం పెంచారు. విత్తన పంపిణీ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటాం.
* న్యూ : కౌలు రైతులకు విత్తనం ఇస్తున్నారా?
* జేడీఏ : జిల్లాలో 45 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డు ఉంటేనే  విత్తనాలు ఇస్తాం. కౌలు రైతులకు సాధారణ పద్ధతిలోనే విత్తనాలు పంపిణీ చేస్తాం.
* న్యూ : మీరిచ్చే విత్తనాలను సాగుచేస్తే ఎన్ని రోజుల్లో రైతులకు పంట చేతికొస్తోంది?
* జేడీఏ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే విత్తనాలన్నీ తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలే. పంటకాలం 65-70 రోజులే. పంట సాగు ఆలస్యం చేయొద్దు. పదునెక్కిన భూములు సేద్యాలతో సిద్ధంగా ఉంటే.. విత్తనం వేయాలి. మంచి దిగుబడి వస్తుంది.
* న్యూ : విత్తనాల పంపిణీకి గడువు ఏమైనా ఉందా?
* జేడీఏ : ప్రత్యామ్నాయ విత్తనాలను గత పదిరోజుల నుంచి పంపిణీ చేస్తున్నాం. ఈనెల 30వ తేదీ వరకు పంపిణీ చేయాలని ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా సమయం ఉంది. అర్హులైన రైతులంతా విత్తనాలను పొందవచ్చు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.