close
మొబైల్‌-ఆధార్‌ బంధం తెగాలంటే..
ఈనాడు వాణిజ్య విభాగం
ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి
6 నెలల్లోగా ఇతర ధ్రువీకరణలు అందించాలి
టెలికాం సంస్థలకూ ఆర్థిక భారం
జియోపైనే అధిక ప్రభావం
మొబైల్‌ కనెక్షన్ల జారీకి, పునఃపరిశీలనకు తీసుకున్న ఆధార్‌ వివరాలు తొలగించాలని ఆమధ్య సుప్రీంకోర్టు ఆదేశించడంతో, అందరి దృష్టీ టెలికాం సంస్థలపై పడింది. 2014 అక్టోబరు నుంచి కొత్త మొబైల్‌ కనెక్షన్ల జారీ సమయంలో ఆధార్‌ నమోదు చేయాలని, 2016 ఆగస్టు నుంచి ఆధార్‌ సహిత ఇ-కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) ద్వారా కొత్త కనెక్షన్లు జారీ చేయొచ్చని టెలికాం సంస్థలను టెలికాం విభాగం ఆదేశించింది. ఇప్పుడు మొబైల్‌ సంస్థల డేటా నుంచి వినియోగదారుల ఆధార్‌ వివరాలు తొలగించే ప్రణాళిక ఇవ్వాలని కోరింది. ఈనేపథ్యంలో వినియోగదారులు ఏం చేయాలో చూద్దామా..
మొబైల్‌ కనెక్షన్‌ పొందేందుకు దరఖాస్తు (కస్టమర్‌ అక్విజిషన్‌ ఫార్మ్‌-క్యాఫ్‌) నింపి, ఫొటో అతికించి, వ్యక్తిగత-చిరునామా ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి ఇవ్వాల్సి వచ్చేది. కనెక్షన్లు ఎక్కువగా జారీ చేసేందుకు, తగిన ధ్రువీకరణలు లేనివారికి, వారి దరఖాస్తుతో ‘ఇతరుల ధ్రువీకరణలు’ జతచేసిన విక్రేతలు ఎందరో. వీటిని నివారించేందుకు ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకున్నాక, కస్టమర్‌కేర్‌ సెంటర్‌ నుంచి సంబంధిత సిమ్‌కార్డు పొందిన వ్యక్తికి కాల్‌ చేసి, వారు చెప్పిన వివరాలు, దరఖాస్తులో ఉన్నవి సరిపోలితే, సిమ్‌ యాక్టివేట్‌ చేసేవారు. ఇందుకు 3-4 రోజులు కూడా పట్టేది. టెలికాం సంస్థలకు ఖర్చూ అధికమయ్యేది. నకిలీల నివారణ కోసం క్యాఫ్‌లో ఆధార్‌ నెంబరు/ఆధార్‌ నమోదిత వివరాలు కూడా జతచేయాలని 2014 అక్టోబరులో టెలికాం సంస్థలకు ఆదేశాలందాయి. తరవాత ఆధార్‌ (వేలిముద్ర ధ్రువీకరణతో ఇచ్చే 12 అంకెల సంఖ్య) సహిత ఇ-కేవైసీ ద్వారా, సిమ్‌ కనెక్షన్‌ సత్వరం యాక్టివేట్‌ చేసే వీలును 2016 ఆగస్టులో కల్పించారు. ఆధార్‌ను జారీ చేసే యూఐడీఏఐ ధ్రువీకరించిన పరికరాల ద్వారానే వినియోగదారుల వేలిముద్రలను సేకరించాలనే నిబంధన విధించారు. అక్కడ నుంచి టెలికాం సంస్థలు అత్యంత వేగంగా కొత్త కనెక్షన్లు మంజూరు చేయగలగడంతో పాటు, ఇందుకయ్యే వ్యయం కూడా తగ్గింది.

అందరికంటే ఎక్కువ భారం జియోపైనే..
ఆధార్‌ సహిత ఇ-కేవైసీ అమలుకు ముందు సేవలందించిన టెలికాం సంస్థలన్నీ క్యాఫ్‌ వివరాలతో కనెక్షన్లు జారీ చేసినవే. అందువల్ల అత్యధిక ఖాతాదార్ల వివరాలు, పాత ధ్రువీకరణలతో వాటి వద్ద ఉన్నాయి. అదే రిలయన్స్‌ జియోను పరిశీలిస్తే, ఇ-కేవైసీ ద్వారానే కనెక్షన్లన్నీ జారీ చేసింది. కొత్త పద్ధతి అమల్లోకి వచ్చాక, సేవలు ప్రారంభించడమే ఇందుకు కారణం. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాల ప్రకారం ..2016 జులైలోనే భారతీ ఎయిర్‌టెల్‌కు 25.68 కోట్ల కనెక్షన్లున్నాయి. ఈ ఏడాది జులై ఆఖరుకు కనెక్షన్ల సంఖ్య 34.48 కోట్లు. అంటే 9 కోట్ల నికర కొత్త కనెక్షన్లు జత చేరాయి. వీటిల్లో అత్యధికం ఇ-కేవైసీ ద్వారా ఇచ్చినవే ఉంటాయి. అదే జియోను తీసుకుంటే, మొత్తం 22.70 కోట్లు ఇ-కేవైసీ ద్వారా జారీ చేసినవే. ఇప్పుడు ఈ డేటా అంతా తొలగించి, కొత్తగా ధ్రువీకరణలను తీసుకోవాల్సి వస్తుంది. ఇందుకు వ్యయ ప్రయాసలు తప్పవు.

ఇప్పుడేం జరగొచ్చు?
ఇప్పటికే ఆధార్‌ సహిత ఇ-కేవైసీ ద్వారా చందాదార్లుగా మారిన వారి వివరాల నుంచి ఆధార్‌ వివరాలు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఇందుకు తగిన ప్రణాళికను టెలికాం సంస్థలు సమర్పించాలి. ఈ విషయమై తమ చందాదార్లకూ సంస్థలు సమాచారం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా కేవైసీ రూపొందించాల్సి వస్తుంది. వీటికి ధ్రువీకరణలు జతచేసి, అందించాలి. అయితే కొత్త కనెక్షన్ల జారీ ఆలస్యం కాకుండా, ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో పత్రాలను అప్‌లోడ్‌ చేసే వీలు కల్పిస్తారనే అభిప్రాయాన్ని టెలికాం సంస్థల అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత చందాదార్లు: కొత్త కేవైసీ నింపి, ఫొటో, వ్యక్తిగత-నివాస ధ్రువీకరణలను 6 నెలల్లోగా అందించాల్సి వస్తుంది. ఇందుకు టెలికాం విభాగం ఆమోదించినవి అనుమతిస్తారు. ఇది చేయకపోతే, కనెక్షన్లు రద్దు చేసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త కనెక్షన్‌కు: ఆధార్‌ ఇవ్వమని టెలికాం సంస్థలు కోరలేవు. ఇతర ధ్రువీకరణ పత్రాలు అడగాల్సి వస్తుంది. గతంలో వ్యక్తిగత ధ్రువీకరణకు అనుమతించిన పత్రాలు పాస్‌పోర్ట్‌, ఆయుధ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపుకార్డు, ఫోటోతో కూడిన రేషన్‌కార్డు, ప్రభుత్వ సంస్థల ధ్రువీకరణ, ఎంపీ/ఎంఎల్‌ఏ/గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన ఫొటోతో కూడిన పత్రం, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ధ్రువీకరణ, గ్రామ పంచాయతీ అధిపతి ధ్రువీకరణ, ఆదాయపు పన్ను పాన్‌కార్డు, ఫొటోతో ఉన్న క్రెడిట్‌కార్డు, బ్యాంక్‌-పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌, భారత ప్రభుత్వం-తపాలా శాఖ జారీచేసిన చిరునామా కార్డు వంటివి.

గతంలో చిరునామా ధ్రువీకరణకు అనుమతించిన పత్రాలు
పై పత్రాలే కాక నీటి బిల్లు, ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ బిల్లు, ఆదాయపు పన్ను మదింపు పత్రం, నమోదిత లీజ్‌/విక్రయ పత్రం వంటివి.ఒక్క నెంబరునూ తొలగించేది లేదు
ఆధార్‌తో తీసుకున్న సిమ్‌లు పనిచేస్తాయి
స్పష్టం చేసిన ప్రభుత్వం
దిల్లీ: ఆధార్‌ గుర్తింపుతో జారీ అయిన మొబైల్‌ నెంబర్లను నిలిపివేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌ ధ్రువీకరణతో తీసుకున్న 50 కోట్ల మొబైల్‌ నెంబర్లను నిలిపివేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి చర్యలేమీ తీసుకోవడం లేదని టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌), భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)లు వెల్లడించాయి. గతంలో మొబైల్‌ వినియోగదారులు ఆధార్‌తో సిమ్‌ తీసుకుని ఉంటే.. దాన్ని ప్రత్యామ్నాయ గుర్తింపును సమర్పించి మార్చుకునే అవకాశం ఉందని, నెంబరును నిలిపివేయకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చని యూఐడీఏఐ తెలిపింది.  ప్రైవేటు కంపెనీలు ఆధార్‌ డేటాను వినియోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డాట్‌, యూఐడీఏఐలు స్పందించాయి. ‘కొత్తగా తీసుకునే సిమ్‌ కార్డులకు ఆధార్‌ ఇ-కేవైసీని తీసుకోవడం నిలిపివేయాలని ఆధార్‌ కేసులో సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతే కానీ.. ఆధార్‌తో తీసుకున్న సిమ్‌లను నిలిపివేయమని తీర్పులో ఎక్కడా లేదు’ అని యూఐడీఏఐ పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వార్తలు పూర్తిగా నిరాధారమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. టెలికాం వినియోగదారుల నుంచి తీసుకున్న ఇ-కేవైసీ వివరాలను తొలగించమని సుప్రీం కోర్టు ఆదేశించలేదని చెప్పింది. ఆరు నెలలకు పైగా గుర్తింపు వివరాలను ఉంచరాదని యూఐడీఏఐను సుప్రీం కోర్టు ఆదేశించిందని, ఇది టెలికాం కంపెనీలకు వర్తించదని స్పష్టం చేసింది. వినియోగదారులు ఆధార్‌ గుర్తింపును ఇవ్వకూడదని భావిస్తే.. ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు వంటి ఇతర కార్డులతో కొత్తగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చని, అయితే ఇది తప్పనిసరి కాదని యూఐడీఏఐ తెలిపింది.

ప్రత్యామ్నాయ గుర్తింపు ఇస్తే తొలగిస్తాం.. కాయ్‌: టెలికాం సంస్థల రికార్డుల నుంచి ఆధార్‌ వివరాలు తొలగించాలనుకునే వినియోగదారులు.. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను సమర్పించాలని భారత టెలికాం ఆపరేటర్ల సమాఖ్య (కాయ్‌) కోరింది. ఈ ప్రక్రియలో మొబైల్‌ సేవలు నిలిపివేయమని స్పష్టం చేసింది. ‘టెలికాం శాఖతో టెలికాం సంస్థలు భేటీ అయ్యాయి. ఆధార్‌ వివరాలు తొలగించాలనుకునే వినియోగదారులు ప్రత్యామ్నాయ గుర్తింపును సమర్పించాల్సిన అవసరం ఉంది’ అని కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. డాట్‌ ఆదేశాలు, నిబంధనలను టెలికాం ఆపరేటర్లు ఎల్లప్పుడూ పాటిస్తారని, సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, డాట్‌ తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తామని రాజన్‌ అన్నారు. వినియోగదారుల గుర్తింపునకు ఆధార్‌ సులభమైన విధానమని అభిప్రాయపడ్డారు.


ప్రధానాంశాలు

వార్తలు

52 వారాల గ‌రిష్టం-క‌నిష్టం

విదేశీ మార‌క‌పు రేట్లు

కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.